అందరం కలిస్తేనే.. ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ సాధ్యం
ABN , Publish Date - Mar 16 , 2025 | 01:40 AM
ఆకట్టుకున్న ప్లాస్టిక్ నియంత్రణ ర్యాలీ

తిరుపతి, మార్చి 15 (ఆంధ్రజ్యోతి) : స్వర్ణాంధ - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా ప్రత్యేకాధికారి కోన శశిధర్ తెలిపారు. శనివారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియం వద్ద నిర్వహించిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశాఖ కమిషనర్, జిల్లా ఇన్చార్జి స్పెషల్ అధికారి కోన శశిధర్, కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య జెండా ఊపి ప్లాస్టిక్ నియంత్రణ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. తారకరామ స్టేడియం నుంచి టౌన్ క్లబ్ కూడలి వరకు ర్యాలీ సాగింది, అక్కడ మానవహారం ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వినియోగించాల్సిన వస్తువులతో ఏర్పాటు చేసిన స్టాల్ప్ ఆకట్టుకున్నాయి. కోన శశిధర్ మాట్లాడుతూ శుభ్రతపై ప్రతి ఒక్కరిలోనూ మార్పు రావాలన్నారు. పారిశుధ్యం, స్వచ్ఛత, అవినీతి నిర్మూలనలో అధికారులు, ప్రజలు భాగస్వామ్యంగా ఉండాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ శుభ్రత మీద ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలనేది స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్లాస్టిక్‌ని ప్రతి ఇంటి, పరిసరాలలో వాడకుండా చూడాలన్నారు. ప్లాస్టిక్ రహిత స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం కృషి చేయాలని కోరారు. కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఇంటికీ చెత్త సేకరణ వాహనాలు వస్తున్నాయని, వేరుచేసి వారికి ఇవ్వాలని చెప్పారు. నగరంలో ప్లాస్టిక్ వినియోగించకుండా తగు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అందరి చేత స్వచ్ఛత ప్రతిజ్ఞను చేయించి, గుడ్డ బ్యాగులను ఆవిష్కరించారు. అనంతరం న్యూబాలాజీ కాలనీలో తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్‌ఆర్‌ఆర్ సెంటర్‌ను అధికారులు ప్రారంభించారు. కార్యక్రమంలో మహిళా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఉమా, రిజిస్ట్రార్ రజిని, ఎస్వీయూ రిజిస్ట్రార్ భూపతి నాయుడు, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, జిల్లా పర్యాటక శాఖ అధికారి జనార్దన్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.