Share News

CM Chandrababu: వైసీపీతో వినాశనం

ABN , Publish Date - Mar 02 , 2025 | 04:10 AM

‘అడవి పందులు పంటల్ని నాశనం చేసినట్లు.. ఐదేళ్ల పాటు వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని నాశనం చేశారు. గత ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రానికి అప్పులిచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

CM Chandrababu: వైసీపీతో వినాశనం

  • ఆ పార్టీకి మేలు చేస్తే పాముకు పాలు పోసినట్లే

  • టీడీపీ నేతలకు సీఎం హెచ్చరిక

  • రాష్ట్రాభివృద్ధి కోసం పరుగులు తీస్తున్నా.. తీయిస్తున్నా

  • బడ్జెట్‌లో బడుగుల సంక్షేమానికి ప్రాధాన్యం

  • 64 లక్షలమందికి పెన్షన్లు.. ఏటా 33 వేలకోట్లు

  • జూన్‌లోగా డీఎస్సీ భర్తీ ప్రక్రియ పూర్తి

  • మే నెల నుంచి తల్లికి వందనం అమలు

  • 3 విడతల్లో రైతులకు అన్నదాత సుఖీభవ

  • 20 వేల కి.మీ. గుంతల రోడ్లు బాగు చేశాం

  • చిత్తూరు జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు

  • జీడీ నెల్లూరులో సామాజిక పెన్షన్ల పంపిణీ

టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉండాలి. నా చుట్టూ తిరిగితే పదవులు రావు. పదవులు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలంటే మీరు ప్రజలతో ఉండాలి.

- చిత్తూరు జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు

గంగాధర నెల్లూరు, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ‘అడవి పందులు పంటల్ని నాశనం చేసినట్లు.. ఐదేళ్ల పాటు వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని నాశనం చేశారు. గత ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రానికి అప్పులిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్రాభివృద్ధి కోసం నేను పరిగెత్తడంతో పాటు అధికారులనూ పరుగులు తీయిస్తున్నా. నాయకులనూ భాగస్వాములను చేస్తున్నా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరులో ఆయన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీ కాలనీలో గీత కార్మికుడు వాసు, దళితవాడలో వసంతమ్మ ఇళ్లకు వెళ్లి పెన్షన్లను అందించారు. దళితవాడలో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక వద్ద స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం రామానాయుడుపల్లె వద్ద ఏర్పాటు చేసిన టీడీపీ కార్యకర్తల సమావేశంలోనూ ప్రసంగించారు. ‘రాష్ట్రంలో 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నాం. పెన్షన్ల కోసం ఏటా రూ.33 వేల కోట్లను ఖర్చు చేస్తున్నాం. దేశంలో మరే రాష్ట్రంలో కూడా ఇంత పెద్దమొత్తంలో ఖర్చు చేయడం లేదు. అమరావతిలో ఉంటున్నా టెక్నాలజీ ద్వారా రాష్ట్రంలో ఎవరెక్కడ ఎలా పనిచేస్తున్నారో క్షణాల్లో తెలుసుకుంటున్నా. వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా ఇళ్ల వద్ద నుంచే ప్రజలు సేవల్ని పొందవచ్చు’ అని అన్నారు.


9 నెలల్లో 12.9 శాతం వృద్ధిరేటు

‘వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలు ఎన్నో బాధలు పడ్డారు. వారి ముఖాల్లో నవ్వు కనిపించలేదు. కూటమిని అధికారంలోకి తెచ్చారు. ఈ 9 నెలల్లో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నాం. 12.9 శాతం వృద్ధిరేటు సాధించాం. కేంద్రంతో కలిసి చేసే పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాం. మ్యాచింగ్‌ గ్రాంట్‌ను ఇచ్చి పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తున్నాం. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యమిచ్చాం. రాష్ట్ర ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ఎన్డీయే ప్రభుత్వ పాలన సాగుతోంది’ అని అన్నారు.

రాజముద్రతో పాసుపుస్తకాలు

‘జూన్‌లోగా డీఎస్సీ భర్తీ ప్రక్రియ పూర్తిచేస్తాం. పాఠశాలలు మళ్లీ తెరిచేలోగా పోస్టింగ్‌లు కూడా ఇచ్చేస్తాం. గత ప్రభుత్వంలో జగన్‌ తన ఫొటోలతో పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. వాటిని రద్దుచేసి త్వరలో రైతులకు రాజముద్రతో పుస్తకాలను అందించనున్నాం. రాష్ట్రంలో 20వేల కిలోమీటర్ల గుంతల రహదారుల్ని బాగు చేశాం. వైసీపీ హయాంలో రోడ్లపై గుంతలతో ఇంటికి సురక్షితంగా చేరుతామనే నమ్మకం ఉండేది కాదు. ఇప్పుడు ప్రశాంతంగా ప్రయాణిస్తున్నారు. ఇద్దరికి మించి పిల్లల్ని కనండి. భవిష్యత్తులో పిల్లలే మనకు ఆస్తి. అందుకే నేను ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ తల్లికివందనం కింద ఏడాదికి రూ.15 వేల చొప్పున అందిస్తానని చెప్పా. మే నెల నుంచి తల్లుల ఖాతాల్లో ఈ డబ్బులు జమవుతాయి’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘రైతులకు సాగు ఖర్చు కోసం కేంద్రం ఇప్పటికే రూ.6 వేలను అందిస్తుండగా.. మేం రూ.14 వేలు జత చేసి మొత్తంగా రూ.20వేలు ఇస్తాం. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో అందిస్తాం. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకానికి బడ్జెట్‌లో నిధుల్ని కేటాయించాం. చిత్తూరు-తచ్చూరు హైవే సమీపంలో పారిశ్రామిక వాడ కోసం 2వేల ఎకరాలను సేకరించాలని కలెక్టర్‌కు చెప్పాను. బయటి ప్రాంతాల నుంచి పెద్ద కంపెనీలను తీసుకొచ్చి ఇక్కడ నిరుద్యోగ సమస్య తీరుస్తాం’ అని చంద్రబాబు అన్నారు.


త్యాగాలు చేసిన వారిని గుర్తుంచుకుంటాం

టీడీపీ కోసం త్యాగాలు చేసినవారిని ఎప్పుడూ గుర్తుంచుకుంటామని చంద్రబాబు అన్నారు. టీడీపీ శ్రేణులు ఇష్టానుసారంగా కాకుండా నాయకత్వం కింద పనిచేయాలని సూచించారు. గంగాధరనెల్లూరు పర్యటనలో భాగంగా రామానాయుడుపల్లె సమీపంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘టీడీపీ కార్యకర్తలు మరో పార్టీలోకి వెళ్లరు, వెళ్లలేరు. మనది మొదటినుంచీ కేడర్‌ ఆధారిత పార్టీ. అందుకే క్లస్టర్‌, యూనిట్‌ బూత్‌ విధానం తీసుకొచ్చాం. ఆన్‌లైన్‌ సభ్యత్వానికి మంచి స్పందన వచ్చింది. 1.02కోట్ల మంది సభ్యత్వం తీసుకున్నారు’ అని చెప్పారు. మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద రావు, ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ థామస్‌, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Updated Date - Mar 02 , 2025 | 04:11 AM