Chandrababu Letter to Piyush Goyal: అమెరికాతో మాట్లాడండి

ABN, Publish Date - Apr 07 , 2025 | 03:14 AM

అమెరికా 27 Per దిగుమతి సుంకం విధించడంతో భారత రొయ్యల ఎగుమతిదారులు నష్టపోతున్నారని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. మత్స్యరంగాన్ని కాపాడేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించారు

Chandrababu Letter to Piyush Goyal: అమెరికాతో మాట్లాడండి
  • రొయ్యలకు సుంకం మినహాయించేలా చూడండి

  • 27% దిగుమతి సుంకంతో ఆక్వాకు నష్టం

  • ఆక్వా రైతాంగానికి అండగా నిలవాలి

  • ఏపీ జీడీపీలో మత్స్యరంగం కీలకం

  • కేంద్ర మంత్రి గోయల్‌కు సీఎం బాబు లేఖ

అమరావతి, బాపట్ల, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): భారత్‌ నుంచి వెళ్లే సముద్ర ఆహార ఉత్పత్తులపై 27ు దిగుమతి సుంకం విధించిన అమెరికా ప్రభుత్వంతో వెంటనే చర్చలు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రప్రభుత్వానికి సూచించారు. సుంకాల జాబితా నుంచి రొయ్యల ఉత్పత్తులను మినహాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు ఆదివారం ఆయన లేఖ రాశారు. రాష్ట్ర జీడీపీలో మత్స్యరంగం కీలక భూమిక పోషిస్తోందని, అమెరికా సుంకాల కారణంగా ఆక్వా పరిశ్రమ నష్టపోతోందని తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో రైతాంగానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ‘భారత్‌ నుంచి వెళ్లే సముద్ర ఆహార ఎగుమతులపై అమెరికా ప్రభుత్వం 27% దిగుమతి సుంకం విధించింది. ఈనెల 5 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. 2023-24లో మన దేశం నుంచి అమెరికాకు 2.55 బిలియన్‌ డాలర్ల విలువైన సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. వీటిలో రొయ్యలే 92ు వాటాను కలిగి ఉన్నాయి. అమెరికాకు రొయ్యల ఎగుమతిలో కీలకమైన భారత్‌పై 27ు దిగుమతి సుంకం విధించిన కారణంగా ఆక్వా రైతాంగం నష్టపోతోంది. ఈక్వెడార్‌ వంటి ఎగుమతిదారులపై 10ు పన్ను మాత్రమే అమెరికా విధిస్తోంది. ఇది మన దేశానికి పరోక్షంగా నష్టం చేస్తూ, వారికి అనుకూలంగా మారుతోంది. దీనికి తోడు మన దేశ ఎగుమతిదారులు ఇప్పటికే 5.77ు కౌంటర్‌ వెయిలింగ్‌ డ్యూటీ(సీవీడీ) భారాన్ని మోస్తున్నారు. అన్ని సుంకాలు కలుపుకొంటే ఈక్వెడార్‌కు, భారత్‌కు మధ్య సుంకాల వ్యత్యాసం దాదాపు 20ు ఉంటుంది. ఈ కారణంగా అమెరికాకు వెళ్లే అన్ని ఎగుమతులపైనా ఈ భారం పడుతోంది.


గతంలో వచ్చిన ఆర్డర్లకు అనుగుణంగా ఇప్పటికే సేకరించిన ఉత్పత్తులు ప్యాకింగ్‌ చేసి కోల్డ్‌ స్టోరేజీలు, పోర్టుల్లో ఉన్నాయి. వీటిపై సుంకం భారం పడుతుంది. యూరోపియన్‌ యూనియన్‌లో భారత ఎగుమతిదారులు 50% తనిఖీ రేట్లు, 4-7% దిగుమతి సుంకంతో సహా నాన్‌ టారీఫ్‌ అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. వియత్నాం వంటి దేశాలు ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌- ఎఫ్‌టీఏ) కింద జీరో డ్యూటీ పొందాయి. ఈ కారణంగా వియత్నాం వంటి దేశాలు యూరోపియన్‌ మార్కెట్‌ను సమర్థవంతంగా ఆక్రమిస్తున్నాయి. వియత్నాం, థాయ్‌లాండ్‌, జపాన్‌ మార్కెట్లు భారత్‌ నుంచి సీ ఫుడ్‌ను కొనుగోలు చేసి, వాటిని ప్రొసెస్‌ చేసి, అమెరికాకు ఎగుమతి చేస్తాయి. అయితే నేడు తుది ఉత్పత్తులపై విధించిన అధిక ట్యాక్సుల కారణంగా ఆ దేశాలు కూడా మనకు ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేస్తున్నాయి. ఏపీలో శీతల గిడ్డంగులు కూడా నిండిపోవడంతో చేతికి వచ్చిన ఆక్వా పంట ఎక్కడ ఉంచాలో తెలియని గందరగోళ పరిస్థితిలో రైతాంగం ఉంది. 27ు సుంకాల కారణంగా రైతుల నుంచి పంట సేకరించడం ఎగుమతిదారులు నిలిపివేశారు. ఈ పరిణామాలు ఏపీ ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టి వేస్తున్నాయి. ఆక్వా రైతులు, హేచరీలు, ఫీడ్‌ మిల్లులు, ప్రాసెసర్లు, ఎగుమతిదారులు.. ఇలా అందరికీ సమస్యలు వచ్చాయి’ అని పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరిపి, సుంకాల నుంచి రొయ్యల ఉత్పత్తులను మినహాయింపు జాబితాలో చేర్చడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ‘సకాలంలో మీరు జోక్యం చేసుకుని, సమస్యను పరిష్కరించడం వల్ల ఆక్వా రంగంపై ఆధారపడి బతుకుతున్న లక్షలాది మంది జీవనోపాధిని కాపాడవచ్చు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.


నేడు రాష్ట్రస్థాయి సమావేశం: మత్స్యశాఖ కమిషనర్‌

అమెరికా నిర్ణయాలతో ఆక్వా రంగం ఎదుర్కోనున్న ఇబ్బందులపై ఇప్పటికే దృష్టిసారించామని, వీటిపై చర్చించడానికే సచివాలయం వేదికగా సోమవారం రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు మత్స్యశాఖ కమిషనర్‌ రమాశంకర్‌నాయక్‌ చెప్పారు. బాపట్లలో ఆయన ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. రొయ్యల అమెరికా విధిస్తున్న అదనపు సుంకాలతో రైతుల్లో గందరగోళం నెలకొందన్నారు. క్షేత్రస్థాయి అధికారులతోపాటు ఆయా కంపెనీల ప్రతినిధులను కూడా భాగస్వాములుగా చేసి ఆక్వా రంగం పురోగమనానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని తెలిపారు. అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలకు విరుగుడుగా వేరే దేశాలకు ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి చేయడానికి ఉన్న అవకాశాలను ప్రభుత్వం పరిశీలించి, ఆక్వా రంగానికి అన్ని విధాలుగా భరోసా కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Krishna River Tragedy: పండగ వేళ ఘోర విషాదం.. కృష్ణానదిలో పడి.. బాబోయ్..

Mahesh Kumar Goud: మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా బండి సంజయ్ టిఫిన్ కూడా చెయ్యరు: మహేశ్ కుమార్ గౌడ్

Updated Date - Apr 07 , 2025 | 03:17 AM