Share News

Tirumala : గదుల్లోనూ గోల్‌మాల్‌ గోవిందా!

ABN , Publish Date - Jan 24 , 2025 | 02:30 AM

తిరుమలలో డోనర్‌ కాటేజీలు, గెస్ట్‌హౌస్‌లు నిత్యం బుక్‌ అవుతున్నా... వాటి నుంచి ఆదాయం మాత్రం తగినంత రావడంలేదు! డోనర్‌ (దాత) స్కీమ్‌ కింద రూమ్‌లు......

Tirumala : గదుల్లోనూ గోల్‌మాల్‌ గోవిందా!

  • టీటీడీ కాటేజీలు, గెస్ట్‌హౌస్‌ల బుకింగ్‌లో స్కామ్‌

  • జగన్‌ జమానాలో భారీ కుంభకోణం

  • దాతలకు ఏటా కొన్ని రోజులు ఉచిత వసతి

  • 20 ఏళ్లు దాటితే డోనర్ల లేఖలు చెల్లవు

  • అయినా... వారి పేరుతో నకిలీ లేఖల సృష్టి

  • దళారులతో కొందరు సిబ్బంది కుమ్మక్కు

  • ఆన్‌లైన్‌లో ఉచితంగా గదుల బుకింగ్‌

  • భక్తుల నుంచి సొమ్ములు వసూలు

  • ఐదేళ్లపాటు చెలరేగిన ‘గదుల మాఫియా’

  • 200కు పైగా కాటేజీల దుర్వినియోగం

  • టీటీడీకి రూ.కోట్లలో నష్టం

‘దర్శనం బాగా జరిగిందా? ఎక్కడ బస చేశారు?’... తిరుమలకు వెళ్లి వచ్చిన వారిని సర్వసాధారణంగా అడిగే ప్రశ్నలివి! కొండ మీద ‘అకామిడేషన్‌’కు అంత గిరాకీ! అందులోనూ... కాటేజీలు, స్పెషల్‌ గెస్ట్‌హౌ్‌సలకు మరింత డిమాండ్‌! వైసీపీ హయాంలో ఈ ‘డిమాండ్‌’ను బాగా సొమ్ము చేసుకున్నారు. దాతల పేరుతో దండుకున్నారు! కొందరు దళారులు, సిబ్బంది కలిసి చేసిన ఈ దందా తాజాగా బయటికి వచ్చింది. గదుల విషయంలో గందరగోళం, ఉన్న వసతిని సమర్థంగా వినియోగించడంపై అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి దృష్టి సారించినప్పుడు ఈ కుంభకోణం బయటపడింది.

కాదేదీ అవినీతికి అనర్హం! దోచుకునేందుకు, దాచుకునేందుకు ఏ చిన్న చాన్స్‌ దొరికినా దోపిడీనే! కొండలనైనా... కొండమీది దేవుడినైనా వదిలేదే లేదు! ఇదీ.. ఐదేళ్లపాటు జగన్‌ జమానా సాగిన తీరు! తిరుమలలో వైసీపీ పెద్దలు అడ్డగోలుగా దర్శనాలకు గేట్లెత్తగా.. దళారులు, సిబ్బందిలో కొందరు గదుల స్కామ్‌కు తెరలేపారు. ఐదేళ్లు అప్రతిహతంగా ఈ కుంభకోణం కొనసాగింది.

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

తిరుమలలో డోనర్‌ కాటేజీలు, గెస్ట్‌హౌస్‌లు నిత్యం బుక్‌ అవుతున్నా... వాటి నుంచి ఆదాయం మాత్రం తగినంత రావడంలేదు! డోనర్‌ (దాత) స్కీమ్‌ కింద రూమ్‌లు బుక్‌ అవుతున్నట్లుగా రిజిస్టర్‌లో రాసేస్తున్నారు. దీనిపై లెక్కాపత్రం లేకుండా పోయింది. అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి ఈ అంశంపై దృష్టి సారించి... ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. దాదాపు 200లకుపైగా కాటేజీలు, గెస్ట్‌హౌస్‌లను ‘దాతల’ పేరుతో బుక్‌ చేసి, వాటిని ఇతర భక్తులకు అద్దెకు ఇచ్చుకున్నట్లు వెల్లడైంది.


ఐదేళ్లపాటు సాగిన ఈ దందాతో టీటీడీకి కోట్లలోనే నష్టం వాటిల్లినట్లు అంచనా. తిరుమల కొండ మొత్తం ఆ దేవదేవుడికే సొంతం. అక్కడ ప్రైవేటు ఆస్తులు ఉండటానికి వీల్లేదు. అయితే... భక్తులకు అవసరమైన వసతి సదుపాయం మొత్తం టీటీడీ కల్పించలేదు కాబట్టి, దాతల నుంచి ‘డోనర్‌ స్కీమ్‌’ కింద విరాళాలు స్వీకరిస్తుంది. వీటి ద్వారా కాటేజీలు, గెస్ట్‌హౌస్‌లను నిర్మిస్తారు. ఖర్చు దాతలదే అయినా... కాటేజీలు మాత్రం టీటీడీకే సొంతం. బుకింగ్‌, నిర్వహణ మొత్తం టీటీడీయే చూసుకుంటుంది. కాటేజీలకు విరాళం ఇచ్చిన దాతలకు... మొదట్లో ఏడాదిలో 60 రోజులపాటు వారికి గానీ, వారు సూచించిన వారికి గానీ ఉచితంగా వసతి కల్పించేవారు. తర్వాత దీనిని 30 రోజులకు కుదించారు. ఇక... గెస్ట్‌హౌస్‌లు నిర్మించిన వారికి ఏటా 3 రోజులు మాత్రమే ఉచితంగా కేటాయిస్తారు. వారికి వీఐపీ బ్రేక్‌ దర్శనం కూడా కల్పిస్తారు. అయితే... ఇది శాశ్వతంగా ఉండే వెసులుబాటు కాదు. 20 ఏళ్లుమాత్రమే దాతలకు ఈ సౌకర్యం ఉంటుంది. అదే... సంస్థల పేరిట విరాళం ఇస్తే పాతికేళ్లు ఈ సౌలభ్యం కల్పిస్తారు. ఆ తర్వాత కాటేజీలు, గెస్ట్‌హౌ్‌సలు పూర్తిగా టీటీడీ పరమవుతాయి. ఒకవేళ దాత మరణిస్తే... అక్కడితోనే ఉచిత వసతి సదుపాయం కూడా ఆగిపోతుంది.


కాలం మీరి పోయినా...

తిరుమలలో డోనర్‌ కాటేజీలు 962.. బడా కంపెనీలు నిర్మించిన పెద్దస్థాయి గెస్ట్‌హౌస్‌ల 62 ఉన్నాయి. వీటి అద్దె రోజుకు వంద నుంచి రూ.ఆరేడువేల దాకా ఉంటుంది. కొండమీద కొలువైన గదుల మాఫియా ‘డోనర్‌ స్కీమ్‌’ కాటేజీలపై కన్నేసింది. 20 ఏళ్లు దాటిన దాతల సిఫారసు లేఖలు గదుల కోసం చెల్లుబాటు కావు. కానీ దానిపై ఉన్నతస్థాయిలో పర్యవేక్షణ లేదు. దీంతో... దళారులు రంగంలోకి దిగారు. కొందరు సిబ్బంది వారితో కుమ్మక్కయ్యారు. వాళ్లే సొంతంగా దాతల పేరిట లేఖలు సృష్టించి, తాము సొంతంగా అద్దెకు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఒకటీ రెండూ కాదు... 200కు పైగా కాటేజీలు/ గెస్ట్‌హౌస్‌ల ఐదేళ్లుగా అక్రమంగా బుక్‌ చేసినట్లు సమాచారం. నిజానికి.. కంపెనీలు, ప్రైవేటు దాతలు ప్రతీ సంవత్సరం జనవరిలో విధిగా టీటీడీలో తమ డోనేషన్‌ సర్టిఫికెట్‌ను పరిశీలన చేయించుకోవాలి. ఒకవేళ డోనర్‌ మరణిస్తే సంబంధిత వ్యక్తులు టీటీడీకి సమాచారం అందించాలి. కానీ... ఇవేవీ సక్రమంగా జరగడం లేదు. దీనినే అక్రమార్కులు సొమ్ము చేసుకున్నారు. కాలపరిమితి దాటిన, మరణించిన డోనర్ల పేరుతో వీళ్లే లేఖలను సృష్టించి, గదులను ఆన్‌లైన్‌లో ఫ్రీగా బుక్‌చేస్తున్నట్లుగా ఎంట్రీ చేసి, భక్తుల నుంచి సొమ్ము వసూలు చేశారు. కాటేజీల బుకింగ్‌కు, వాటి ద్వారా వస్తున్న ఆదాయానికి పొంతనలేకపోవడంతో... అసలేం జరుగుతోందని ఆరా తీయడంతో ఈ స్కామ్‌ బయటపడింది.


ఈ వార్తలు కూడా చదవండి...

Fog Effect: గన్నవరం ఎయిర్‌పోర్టుకు రావలసిన పలు విమానాలు ఆలస్యం

Lokesh Visit Davos: అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయండి: మంత్రి లోకేష్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 24 , 2025 | 05:37 AM