Share News

ప్రభుత్వ స్థలాలను గుర్తించాలి : కలెక్టర్‌

ABN , Publish Date - Mar 18 , 2025 | 02:08 AM

జిల్లాలోని అభివృద్ధి సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని కలెక్టర్‌ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ స్థలాలను గుర్తించాలి : కలెక్టర్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లె, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అభివృద్ధి సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని కలెక్టర్‌ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సెంటినరీ హాల్‌లో జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌, డీఆర్వో రాము నాయక్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులతో జిల్లా సమగ్రాభివృద్దిపై కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈ పార్కులు, కుసుం కార్యక్రమం కింద విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు, రిలయన్స్‌ సంస్థవారిచే కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌ ప్లాంట్‌, స్టార్‌ హోటళ్లు, ఐటీఐ సంస్థల ఏర్పాటుకు డివిజన్ల పరిధిలో ప్రభుత్వ స్థలాలను అన్వేషించాలని సూచించారు. విద్యుత్‌ సబ్‌ స్టేషన్లకు 5నుంచి 10 ఎకరాలు, ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు 50నుంచి 100ఎకరాల స్థలాలను గుర్తించాలని అన్నారు. నంద్యాల జిల్లాలో రెండు స్టార్‌ హోటళ్లు రానున్నాయని, రెవెన్యూ, ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ శాఖలకు చెందిన భూములను గుర్తించాలని తెలిపారు. ఐటీఐ కళాశాలల ఏర్పాటుకు 2ఎకరాల భూమిని కేటాయించేలా స్థలాలను అన్వేషించాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

లక్ష మెట్రిక్‌ టన్నుల చెత్త తొలగింపునకు చర్యలు

వంద సంవత్సరాల చరిత్ర కలిగిన నంద్యాల మున్సిపాల్టీలో పేరుకుపోయిన లక్ష మెట్రిక్‌ టన్నుల చెత్త తొలగింపుకు పట్టిష్ట ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్‌ రాజకుమారి మున్సిపల్‌ కమిషనర్లను, జిల్లా అధికారులను ఆదేశించారు. నంద్యాల మున్సిపాల్టీ డంప్‌యార్డులో పేరుకుపోయిన చెత్త తొలగింపుకు అన్ని శాఖల అధికారులు భాగస్వాములు కావాలని సూచించారు. చెత్త తొలగింపుపై ఆర్టీసీ డ్రైవర్లు ప్రజల నుంచి ఎన్నోసార్లు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదులు రావడం జరిగిందని దీనిపై శ్రద్ద వహించాలని సూచించారు. కర్నూలులో జరిగిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన అంశాలను పరిష్కరించాలని, గోస్పాడు మండలంలోని పలు గ్రామాల్లో త్రాగునీటి అంశంపై క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కరించాలని ఆర్‌డబ్ల్యూఎస్‌, ఎంపీడీవోలను ఆదేశించారు. సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో అనుమతులు లేకుండా నదిలోకి బోట్లు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు ఆర్డీవోను ఆదేశించారు. మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకుల కింద ఉన్న భూముల ఆయకట్టు వివరాలను బోర్డు ఏర్పాటు చేసి ప్రదర్శించాలని తెలిపారు.

Updated Date - Mar 18 , 2025 | 02:08 AM