వాహన ఫిట్‌నెస్‌పై అయోమయం
ABN , Publish Date - Mar 16 , 2025 | 01:01 AM
రవాణా శాఖలో ఏం జరుగుతుందో తెలియక వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు. కొవ్వూరు ఎంవీఐ కార్యాలయానికి శనివారం వాహనాలు ఫిట్‌నెస్ చేయించుకోవడానికి సుమారు 30 నుంచి 40 మంది వాహనదారులు వివిధ ప్రాంతాలనుంచి వచ్చారు.

కొవ్వూరు, మార్చి 15 (ఆంధ్రజ్యోతి) : రవాణా శాఖలో ఏం జరుగుతుందో తెలియక వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు. కొవ్వూరు ఎంవీఐ కార్యాలయానికి శనివారం వాహనాలు ఫిట్‌నెస్ చేయించుకోవడానికి సుమారు 30 నుంచి 40 మంది వాహనదారులు వివిధ ప్రాంతాలనుంచి వచ్చారు.ఈ మేరకు గత రెండు రోజులుగా వాహన ఫిట్‌నెస్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో చలానా చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్నారు.కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం, దేవరపల్లి, యర్నగూడెం, నల్లజర్ల, మలకపల్లి, నిడదవోలు, చాగల్లు, తాళ్ళపూడి మండలాల నుంచి శనివారం ఉదయం స్లాట్ బుక్ చేసుకున్న వాహనదారులు ఫిట్‌నెస్ చేయించుకోవడానికి కొవ్వూరు ఎంవీఐ కార్యాల యానికి వచ్చారు.అయితే ఫిట్‌నెస్ చేయడానికి ఆన్‌లైన్ ఆప్షన్ తొలగించారని.. రాజానగరంలో ఇటీవల ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్‌కు వెళ్లాలని కొవ్వూరు ఎంవీఐ కె.వి.శివప్రసాద్ తెలిపారు. దీంతో వాహనదారులు ఫిట్‌నెస్ చేయనప్పుడు ఆన్‌లైన్‌లో చలానా ఎందుకు కట్టించుకున్నారని నిలదీశారు.దీంతో వాహనదారులంతా రాజమహేంద్రవరం డీటీసీ కార్యాలయానికి వెళ్లగా దీనిపై మాకు ఎటువంటి సమాచారం లేదని ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ను సంప్రదించాలని కార్యాలయ వర్గాలు తెలిపాయి.ఈ మేరకు వాహనదారులంతా కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావునుకలిసి తమ ఆవేదన తెలిపారు.దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కలెక్టర్,డీటీసీలకు ఫోన్ చేసి వాహనదారులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఎంవీఐ కార్యాలయాలు ఉండగా రాజానగరంలో ఏర్పాటు చేసిన ఏటీసీ సెంటర్‌లో మాత్రమే ఫిట్‌నెస్‌లు చేస్తామనడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి స్థానికంగా ఉన్న రవాణా కార్యాలయాల్లో సౌకర్యాలు కల్పించాలని కోరారు.
రాజానగరంలోనే వాహనాల ఫిట్‌నెస్ : డీటీవో
రాజమహేంద్రవరం అర్బన్, మార్చి 15 : జిల్లాలోని వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీ కోసం ఇక నుంచి రాజానగరంలోని కంట్రోల్ ఆల్ట్‌ఫిక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అఽధీకృత ఏజెన్సీని సంప్రదించాలని జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ తెలిపారు. అన్ని రకాల రవాణా మోటారు వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్లకు అధీకృత ఏజెన్సీని సంప్రదించాలని సూచించారు. ఇప్పటి వరకూ రాష్ట్ర, జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్లును సంబంధిత అధీకృత ఏజెన్సీ నిర్వాహకులు తనిఖీలు చేసి నిర్వహించి ధ్రువపత్రాలు జారీ చేస్తారన్నారు.