Share News

Home Minister Anitha : తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు

ABN , Publish Date - Feb 15 , 2025 | 06:40 AM

వంశీ అరెస్టు ఆయన చేసిన కర్మ ఫలం. తప్పు చేసినవారికి ఎప్పటికైనా శిక్షపడుతుంది’ అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.

Home Minister Anitha : తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు

  • గత 6 నెలల్లో క్రైం రేటు 9% తగ్గింది

  • యువతిపై యాసిడ్‌ ఘటన దురదృష్టకరం

  • చిన్నారులు, మహిళల రక్షణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు కృషి: హోం మంత్రి అనిత

అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): ‘వల్లభనేని వంశీ అరెస్టు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. వంశీ అరెస్టు ఆయన చేసిన కర్మ ఫలం. తప్పు చేసినవారికి ఎప్పటికైనా శిక్షపడుతుంది’ అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘వంశీ అరెస్టు అక్రమం కాదు, సక్రమమే. అన్ని ఆధారాలూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో డీజీపీని కలిసి వినతిపత్రాలు ఇస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో మమ్ముల్ని డీజీపీ ఆఫీస్‌ గేట్‌ కూడా దాటనీయలేదు. వైసీపీ నాయకులను అరెస్టు చేస్తే అక్రమం... మమ్మల్ని చేస్తే సక్రమమా? ‘కీలక కేసుల్లో కూటమి ప్రభుత్వం నిర్లిప్తత’ అన్న అరోపణలు సరికాదు. గత ప్రభుత్వ కక్షసాధింపు విధానాలు కూటమి ప్రభుత్వ వైఖరి కాదు. బాధితులకు అండగా ఉంటూ తప్పు చేసినవారు తప్పించుకోకుండా శిక్షపడేలా చేస్తాం. విజయనగరం జిల్లాలో 3 నుంచి 6నెలల కాలంలోనే రెండు కేసుల్లో ఫోక్సో చట్టం ప్రకారం శిక్షపడేలా చేశాం. పోలీస్‌, న్యాయ విభాగాలను సమన్వయం చేసి మరింత వేగంగా శిక్షలను అమలు చేస్తాం. గత ఆరు నెలల్లో రాష్ట్రంలో క్రైం రేటు 9శాతం తగ్గింది. నిందితులను పట్టుకొని, రిమాండ్‌కు పంపడంలో వేగం పెంచాం. టెక్నాలజీని వినియోగించి కేసులను ఛేదిస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్‌ దాడి ఘటన దురదృష్టకరం. బాధితురాలి తల్లిదండ్రులకు వీడియో కాల్‌ చేసి మాట్లాడి ధైర్యం చెప్పాం. యువతికి మెరుగైన చికిత్స కోసం బెంగుళూరు ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే మంత్రి నారా లోకేశ్‌ స్పందించారు.


మరో మంత్రి రామ్‌ ప్రసాద్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఎట్టి పరిస్థితుల్లో నిందితుడిని వదిలిపెట్టం. కఠినంగా శిక్షిస్తాం. చిన్నారులు, యువతులు, మహిళల రక్షణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటుకు కృషి చేస్తాం’ అని అనిత అన్నారు.

కేటాయింపుల్లో హోంకు పెద్ద పీట

కూటమి ప్ర భుత్వంలో హోం శాఖకు కేటాయింపుల్లో పెద్దపీట వేయనుందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. సచివాలయంలో ప్రీ బడ్జెట్‌ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘గత ఐదేళ్లలో బడ్జెట్‌లో కేటాయింపులు లేక హోం శాఖ నిర్వీర్యం అయ్యింది. ఫింగర్‌ ప్రింట్‌ అథెంటికేషన్‌ సిస్టం, సీసీ కెమెరాల నిర్వహణకూ నిధుల్విలేదు. పోలీస్‌ స్టేషన్లు అధ్వానంగా తయారయ్యాయి. హోం శాఖ ప్రతిపాదనలు, అంచనాలపై గతంలో దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వం శాంతిభద్రతలకు అవసరమైన నిధులు, వసతులు కేటాయిస్తుంది. ఈగల్‌ వ్యవస్థ, జైళ్ల నిర్మాణం, సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్లకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఉంటుంది. ఆక్టోపస్‌, అప్పా, గ్రే హౌండ్స్‌ ఏర్పాటుకు బడ్జెట్‌లో పెద్దపీట వేయాలని కోరాం. కేంద్ర ప్రభుత్వ నిధులు రాబట్టి పోలీస్‌ శాఖను పటిష్ఠం చేయడంపైనా దృషి సారించాం. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గన్‌మ్యాన్‌ గన్‌ మ్యాగ్జైన్‌ మిస్‌ అవ్వడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం’ అని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు.

Updated Date - Feb 15 , 2025 | 06:41 AM