Fruit Seminars: జిల్లాల వారీగా ఉద్యాన సదస్సులు
ABN , Publish Date - Apr 10 , 2025 | 05:00 AM
రాష్ట్రంలోని పండ్ల ఉత్పత్తులకు నాణ్యత, అదనపు విలువ జోడించేందుకు ఉద్యానశాఖ నెలల ప్రణాళిక తయారు చేసింది. జిల్లాల వారీగా పంటలపై సదస్సులు, సాంకేతిక ప్రదర్శనల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించింది

సీఎం నిర్దేశంతో ఆరు నెలల ప్రణాళిక సిద్ధం
నూతన సాంకేతికతపై ప్రదర్శనలు
పండ్ల నాణ్యత, మార్కెటింగ్ సౌకర్యాలపై దృష్టి
రేపు చిత్తూరు జిల్లాలో మామిడి పంటపై సదస్సు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో పండ్ల ఉత్పత్తులకు నాణ్యత, అదనపు విలువ, మెరుగైన మార్కెట్ కల్పించేందుకు ఉద్యానశాఖ ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది. ఉద్యాన రంగంలో ఉత్తమ పద్ధతులు పాటించి, రైతు సాధికారత సాధించాలన్న సీఎం చంద్రబాబు నిర్దేశం మేరకు చర్యలు చేపట్టింది. ఉద్యాన రైతులు, కొనుగోలుదారులు, శుద్ధి పరిశ్రమల నిర్వాహకులు, ఎగుమతిదారులు, పరిశోధకులు సమావేశమై, నూతన ఆవిష్కరణలపై చర్చించడానికి రానున్న ఆరు నెలలపాటు పంటల వారీగా జిల్లా స్థాయి ఉద్యాన సదస్సులు, ప్రదర్శనలు నిర్వహించడానికి ఉద్యాన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు ప్రణాళికలు రూపొందించారు. పంట వైవిధ్యాన్ని కాపాడుతూనే రైతులకు సాంకేతిక పద్ధతులపై అవగాహన కల్పించడం, పంట కోతల్లో శాస్త్రీయ విధానాలను అనుసరించి పండ్ల నాణ్యతను పెంచడం, అధిక దిగుబడినిచ్చే, వాతావరణానికి అనువైన రకాల సాగు, ఆటోమేషన్‌తో బిందు సేద్యం, డ్రోన్ల వినియోగంపై అవగాహన సదస్సులు, సాంకేతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
ఏ జిల్లాలో ఏ ఉద్యాన పంట ప్రధాన పంటగా ఉందో ఆ జిల్లాలో సదస్సు నిర్వహిస్తూ, ఇతర జిల్లాల రైతులను కూడా ఆ సదస్సులో భాగస్వామ్యం చేయనున్నారు. ఆధునిక సాగు పద్ధతులపై అభ్యుదయ రైతుల అనుభవాలు, శాస్త్రవేత్తల సలహాలతో చర్చాగోష్ఠులు నిర్వహించనున్నారు. పండ్ల ఉత్పత్తులకు అదనపు విలువ జోడింపు, త్వరగా పాడయ్యే ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేయడంపై నిపుణులు అవగాహన కల్పించనున్నారు. చిన్న, మధ్య తరహా ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, ఎంఎ్‌సఎంఈ పథకాలను అనుసంధానం చేయడం, మౌలిక సదుపాయాలకు ఆర్థిక సహాయం పొందటంపై మార్గదర్శకం చేయనున్నారు. ఉద్యాన పంటల్లో ప్రధానమైన మామిడి, అరటి, మిర్చి, జీడిమామిడి, కూరగాయల ఉత్పత్తుల ఎగుమతులకు అందుబాటులో ఉన్న మార్కెటింగ్ సౌకర్యాలపైనా అవగాహన కల్పించనున్నారు. పంట ఉత్పత్తుల నాణ్యత ధ్రువీకరణ ప్రక్రియలు, అంతర్జాతీయ మార్కెట్లను అనుసంధానం చేయడానికి అపెడా వంటి సంస్థల మద్దతును పొందే విధానాలపై కొనుగోలు, అమ్మకందారుల సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సదస్సుల సందర్భంగా రైతు ఉత్పత్తిదారులు, భారీ కొనుగోలుదారులు, ఇతర ఏజెన్సీలతో ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది.
ఉద్యాన సదస్సుల షెడ్యూల్ ఇదీ..
ఈనెల 11న చిత్తూరులో మామిడి, 17న కడపలో అరటి, నారింజ, 22న ఏలూరులో ఆయిల్‌పామ్, 26న శ్రీకాకుళంలో జీడిమామిడి, 29న నంద్యాలలో అరటి, ఉల్లి, మే 8న తిరుపతిలో తోతాపురి మామిడి, 15న శ్రీసత్యసాయిజిల్లాలో దానిమ్మ, బత్తాయి, 22న కర్నూలులో ఉల్లి, టమాటా, జూన్ 3న తూర్పుగోదావరిలో అరటి, కొబ్బరి, కోకో, 10న ఎన్టీఆర్ జిల్లాలో మామిడి, మిర్చి, 17న అన్నమయ్య జిల్లాలో అరటి, మామిడి, బొప్పాయి, టమాటా, 24న అల్లూరి జిల్లాలో జీడిపప్పు, పసుపు, నల్ల మిరియాలు, జూలై 1న విశాఖలో కూరగాయలు, 8న బాపట్లలో మిర్చి, పసుపు, మామిడి, 15న కోనసీమలో కొబ్బరి, అరటి, 22న నెల్లూరులో నారింజ, మామిడి, 29న పశ్చిమగోదావరిలో కొబ్బరి, కోకో, కూరగాయలు, ఆగస్టు 5న అనకాపల్లిలో జీడిమామిడి, కొబ్బరి, 12న కాకినాడలో మామిడి, జీడిమామిడి, ఆయిల్‌పామ్, కొబ్బరి, 19న విజయనగరంలో మామిడి, జీడిమామిడి, ఆయిల్‌పామ్, కోకో, 26న మన్యంలో జీడిపప్పు, అరటి, ఆయిల్‌పామ్, సెప్టెంబరు 2న కృష్ణా జిల్లాలో మామిడి, పసుపు, 9న గుంటూరులో మిర్చి, 16న ప్రకాశం జిల్లాలో మిర్చి, బత్తాయి. 23న పల్నాడులో మిర్చిపై సదస్సులు నిర్వహించనున్నారు. ఈనెల 26 లేదా 28న విజయవాడలో కొబ్బరి, కోకో, ఆయిల్‌పామ్‌పై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించాలని భావిస్తున్నారు.
Read Latest AP News And Telugu News