Pastor Pagadala Praveen : ప్రవీణ్ మృతిపై వేగంగా దర్యాప్తు
ABN , Publish Date - Mar 30 , 2025 | 03:54 AM
పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై దర్యాప్తు వేగంగా కొనసాగుతోందని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్ తెలిపారు. ప్రమాదానికి గల అసలు కారణాలను తేల్చేందుకు సీసీటీవీ ఫుటేజీ, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా లోతుగా విచారణ జరుగుతోందన్నారు.

ఆయన చేతులు, ముఖంపై రాపుడు గాయాలు
విజయవాడలో 4గంటల పాటు ఎక్కడున్నారో విచారణ
ప్రైవేటు సీసీ కెమెరాల ఫుటేజీ కూడా పరిశీలిస్తున్నాం
అన్ని నివేదికలూ వచ్చాకే మృతిపై స్పష్టతకు అవకాశం
వదంతులు వ్యాప్తి చేస్తే చర్యలు: ఐజీ అశోక్ కుమార్
రాజమహేంద్రవరం, మార్చి 29(ఆంధ్రజ్యోతి): పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై దర్యాప్తు వేగంగా జరుగుతోందని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్ పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రవీణ్ మృతిపై సీఎం చంద్రబాబు రోజూ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఎస్పీ నరసింహ కిశోర్‌తో శుక్రవారం రాత్రి సుమారు 45 నిమిషాలు మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారని చెప్పారు. అనుభవజ్ఞులైన ఉన్న ఇద్దరు డీఎస్పీలను దర్యాప్తు అధికారులుగా నియమించామని వెల్లడించారు. ప్రాథమికంగా పరిశీలించిన అంశాల ప్రకారం... ప్రవీణ్ హైదరాబాద్‌లో 24న ఉదయం 11 గంటల ప్రాంతంలో బయలుదేరారని, విజయవాడ చేరుకున్న తర్వాత సుమారు 4 గంటలు ఎక్కడ ఉన్నారనే అంశంపై లోతుగా విచారణ చేస్తున్నామని ఐజీ వివరించారు. హైదరాబాద్, విజయవాడల్లో ప్రైవేటు సీసీ కెమెరాల ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. కొంతమూరు టోల్‌గేటు వద్దకు రాత్రి 11.30 గంటలకు ప్రవీణ్ చేరుకున్నారని, 11.42 గంటలకు నయారా పెట్రోలు బంకు సమీపంలో ప్రమాదం జరిగిందని చెప్పారు. శవపరీక్ష నివేదిక ప్రకారం చేతులు, కాళ్లపై రాపుడు, గాయాలు, ముఖంపై గాయాలు ఉన్నాయని, కాలుపై కాలిన గాయాలు ఉండటంతో పాథాలజీ విభాగానికి నమూనాలను పంపించామని పేర్కొన్నారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి రిపోర్టులు రావాల్సి ఉందని, అన్నీ నివేదికలు వచ్చిన తర్వాతే ప్రవీణ్ మృతిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఐజీ తెలిపారు. ప్రజల వద్ద ఈ ఘటనకు సంబంధించి బెదిరించిన సాక్ష్యాలు, వీడియోలు, ఇతర సమాచారం ఉంటే తమకు అందజేయాలని కోరారు.
ప్రత్యేక దర్యాప్తు బృందం ఇన్‌చార్జి, డీఎస్పీ దేవకుమార్ నం.94407 96620లో కూడా సంప్రదించవ్చని సూచించారు. సున్నితమైన కేసు కాబట్టి విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియా తదితర మాధ్యమాల ద్వారా వదంతులను వ్యాప్తి చేస్తే చర్యలు తప్పవని ఐజీ హెచ్చరించారు. ఎస్పీ నరసింహ కిశోర్ మాట్లాడుతూ.. ప్రవీణ్ బయలుదేరిన దగ్గర నుంచీ ప్రమాదం జరిగిన ప్రాంతం వరకూ ప్రతీ టోల్‌గేటు వద్ద సీసీ ఫుటేజీని సేకరించామని చెప్పారు. దాదాపు గొట్టిపాడు నుంచి బుల్లెట్‌కి హెడ్‌లైట్ లేకుండానే ఆయన ప్రయాణించారని తెలిపారు. ప్రమాదానికి ముందు నాలుగు కార్లు ఆయన వాహనంతో పాటు ప్రయాణించాయని, వాటిలో ప్రయాణిస్తున్న వారిని కూడా విచారించామని, ఆ కార్లను రవాణా అధికారులతో పరిశీలన చేయించామని సీసీ ఫుటేజీ వీడియోలు చూపిస్తూ ఎస్పీ వివరించారు. మృతిపై ప్రవీణ్ కుటుంబ సభ్యులుఅనుమానాలు వ్యక్తం చేయడం లేదన్నారు. రాజమహేంద్రవరం సమీపంలోని నామవరంలో గతంలో కుమార్తె పేరున ప్రవీణ్ ఒక స్థలం కొన్నారని, ఫిబ్రవరి 12న రిజిస్ట్రేషన్ జరిగిందని, బైబిల్ మిషన్ తరపున అక్కడ ఒక చర్చి నిర్మించాలని అనుకున్నారని వివరించారు. ఆకాశ్, జాన్ అనే ఇద్దరి ద్వారా పనులను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. దీనికోసం హౌసింగ్ బోర్డులో ఒక ఇల్లు కూడా అద్దెకు తీసుకున్నారని ఎస్పీ పేర్కొన్నారు. ఆయన ఇక్కడికి వస్తున్నట్టు భార్యతో పాటు ఆకాశ్, జాన్‌కి మాత్రమే సమాచారం ఉందన్నారు. అన్ని అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత మృతికి కారణాలను వివరిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..
Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్‌పై మంత్రి రామానాయుడు ఫైర్
Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం
For More AP News and Telugu News