Share News

చివరికి కష్టమే..!

ABN , Publish Date - Apr 02 , 2025 | 11:46 PM

శ్రీశైలం రైట్‌ బ్రాంచ కెనాల్‌ (ఎస్సార్బీసీ) ద్వారా 1,53,936 ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధాన ఎస్సార్బీసీ కాలువలు, పంటకాలువలు, డిస్ర్టిబ్యూటరీ కాలువలను ఏర్పాటు చేసింది.

   చివరికి కష్టమే..!
దెబ్బతిన ్న మెయిన కెనాల్‌

ఆఖరి ఆయకట్టుకు అందని ఎస్సార్బీసీ సాగునీరు

42 వేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకం

పూర్తిగా దెబ్బతిన్న ఎస్సార్సీసీ మెయిన కెనాల్‌

తెగిపోతున్న కాల్వలు, ఇబ్బందుల్లో రైతులు

బనగానపల్లె, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం రైట్‌ బ్రాంచ కెనాల్‌ (ఎస్సార్బీసీ) ద్వారా 1,53,936 ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధాన ఎస్సార్బీసీ కాలువలు, పంటకాలువలు, డిస్ర్టిబ్యూటరీ కాలువలను ఏర్పాటు చేసింది. 2000 సంవత్సరంలో పనులు పూర్తి అయ్యాయి. అయితే 2002 నుంచి ఎస్సార్బీసీకి నీటిని విడుదల చేయడంతో పొలాలకు సాగునీరు అందుతోంది. బనగానపల్లె నియోజకవర్గంలోని బనగానపల్లె, అవుకు, కొలిమిగుండ్ల, సంజామల, కోవెలకుంట్ల మండలాలతో పాటు పాటు పాణ్యం, ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని దొర్నిపాడు, ఉయ్యాలవాడ మండలాల్లో 1,53,936 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. అయితే ప్రధాన కాల్వ దెబ్బతినడంతో పొలాలకు తగినంత ఆయకట్టు నీరు అందడం లేదు. ఈ పరిస్థితుల్లో నేటికీ 42వేల ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందడం లేదు. ఆ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

రిజర్వాయర్లలో తగ్గిన నీటి నిల్వలు

గోరుకల్లు రిజర్వాయర్లలో 12.44 టీఎంసీల నీటిని నిల్వ ఉండాలి. అలాగే అవుకు రిజర్వాయర్‌లో 4.148 టీఎంసీల నీటిని నిల్వ ఉంచాలి. అయితే గోరుకల్లు రిజర్వాయర్‌లో నిర్మాణం వల్ల చుట్టుపక్కల గ్రామాల్లోకి నీరు ఉబుకుతుండడం, రిజర్వాయర్‌ కట్ట ఇంకా 4 మీటర్లు ఎత్తు పెంచాల్సి ఉండడంతో గోరుకల్లులో నీటిని పూర్తిస్థాయిలో నిల్వ ఉంచడం లేదు. కేవలం 10 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ ఉంచుతున్నారు. గత సంవత్సరం అవుకు రిజర్వాయర్‌లో ప్రస్తుతం కేవలం ఒక టీఎంసీ నీటిని నిల్వ ఉంచారు. దీంతో ఆ రిజర్వాయర్‌లో నీటి నిల్వ సామర్థం గణనీయంగా తగ్గిపోయింది. గత రబీసీజన పూర్తయ్యే సరికి అవుకు రిజర్వాయర్‌లో మూడు టీఎంసీల నీటి నిల్వ ఉండేది. కానీ ఈ ఏడాది కేవలం 1 టీఎంసీకే పరిమితం కావడం ఆందోళన కలిగిస్తోంది.

దెబ్బతిన్న ఎస్సార్బీసీ ప్రధాన కాలువ

ఎస్సార్బీసీ ప్రఽధాన కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ నుంచి ఎస్సార్సీసీ కాలువ ప్రారంభమవుతుంది. ఎస్సార్బీసీ కాల్వ మొత్తం దూరం 116 కిలోమీటర్లు ఉంది. గోరుకల్లు రిజర్వాయర్‌ నుంచి మాత్రం అంటే పాణ్యం మండలం నుంచి ఆయకట్లుకు నీరు అందుతుంది. 1.53,936 ఎకరాల ఆయకట్టుకు నీరు అందాల్సి ఉంది. కాని కాల్వల మరమత్తులు లేకపోవడంతో 42 వేల ఎకరాలకు నేటికీ సాగునీరు అందడం లేదు. గోరుకల్లు నుంచి అవుకు రిజర్వాయర్‌ వరకు 57.7 కిలోమీటర్ల మేర మెయిన కెనాల్స్‌ పూర్తిగా దెబ్బతిన్నాయి. కాల్వలు దెబ్బతినడంతో ఎస్సార్బీసీ మెయిన కెనాల్‌ అవుకు మండలం మెట్టుపల్లె వద్ద రెండుసార్లు, బనగానపల్లె మండలం వెంకటాపురం వద్ద రెండు సార్లు, అలాగే బనగానపల్లె పట్టణం సమీపంలో ఒకసారి ప్రధాన కాల్వలకు గండిపడ్డాయి. పలుచోట్ల చిన్నపాటి గండ్లు కూడా పడ్డాయి. వాటి ద్వారా నీటి వృథా జరుగుతోంది. ఏడేళ్ల క్రితం ప్రధాన కాలువ దెబ్బతినడంతో బనగానపల్లె పట్టణంలోకి ఎస్సార్బీసీ నీరు ప్రవహించింది. అలాగే పంట కాలువలు దెబ్బతిన్నప్పుడు వేసిన పంటలు దెబ్బతిన్నాయి. గోరుకల్లు రిజర్వాయర్‌ నుంచి అవుకు రిజర్వాయర్‌ వరకు 57.7 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ వెంబడి వేసిన సిమెంట్‌ లైనింగ్‌ పూర్తిగా దెబ్బతింది. కొన్ని చోట్ల ప్రధాన కాలువలో సిమెంట్‌ లైనింగ్‌ స్థానంలో పిచ్చిమొక్కలు మొలిశాయి. ఎస్సార్బీసీ ప్రధాన కాలువ నుంచి వచ్చే సాగునీరు డిస్ర్టిబ్యూటరీ, ఫీడర్‌ ఛానళ్ల ద్వారా పంటల సాగుకు నీరందించాల్సి ఉంది. కాలువల్లో పూడికలు చేరడంతో నీటి ప్రవాహానికి అడ్డుంకులు ఏర్పడ్డాయి.

చివరి ఆయకట్టు రైతుల ఆవేదన

ఎస్సార్బీసీ ఆయకట్టు మొత్తం 1.53 లక్షల ఎకరాలకు గాను కేవలం 1.11 లక్షల ఎకరాలకు మాత్రమే పంట కాలువలు ఉన్నాయి. మిగతా ఎకరాలకు పాతికేళ్లుగా పంట కాలువలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందక పంటలు పండించుకోలేకపోతున్నారు. 70 శాతం మాత్రమే పంట కాలువలు పూర్తయ్యాయి. బనగానపల్లె మండలంలో 20 వేలకు పైగా ఎకరాలకు సాగునీరు, మిగతా అవుకు, సంజామల, కోవె లకుంట్ల, మండలాల్లో 22వేల ఎకరాలకు నేటికీ సాగునీరు అందడం లేదు. పంట కాలువల నిర్మాణం పూర్తి చేయకపోవడమే ఇందుకు కారణం. దీనికి తోడు ఎస్సార్బీసీ డిస్ర్టిబ్యూటరీ కాలువల్లో పూడిక చేరి కంపచెట్లు పెరిగి లైనింగ్‌లు దెబ్బతిన్నాయి. కనీసం దారి కూడా కనపడని పరిస్థితులు నెలకొన్నాయి. వీటి మరమ్మతుల కోసం అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నా నిధులు మంజూరు కావడం లేదు.

ఎస్సార్బీసీ కాల్వకు మరమత్తులు చేపట్టాలి

- గుడిపాటి శివ, రైతు అవుకు

ఎస్సార్బీసీ కాల్వపూర్తిగా దెబ్బతింది. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మరమతులు చేపట్టిన దాఖలాలు లేవు. నిధులు మంజూరు కావడం లేదని చెబుతూ కాల్వ నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారు. ఈసారి కాల్వకు నీటిని వదిలే సమయానికి కాల్వకు మరమతులు చేపడితే బాగుంటుంది.

గండ్లు పడితే నష్టపోవాల్సి వస్తుంది

-గొంగటి జగదీశ్వరరెడ్డి, మెట్టుపల్లె గ్రామం

ఎస్సార్బీసీ కాల్వకు ఇరువైపులా వేసిన కాంక్రీడ్‌ బెడ్డింగ్‌ దెబ్బతినడంతో గండ్లుపడే అవకాశం ఉంది. కాల్వకు 1500 క్యూసెక్కులకు నీటిని వదిలితే ఖచ్చితంగా గండ్లు పడుతాయి. అలాంటి విపత్కర పరిస్థితులు రాకమునుపే అధికారులు నిధులు మంజూరు చేయించి కాల్వకు మరమ్మతులు చేయించాలి.

ప్రభుత్వానికి నివేదికలు పంపాం

- , ఎస్సార్బీసీ ఈఈ, బనగానపల్లె

ఎస్సార్బీసీ కాల్వ దెబ్బతిన్న మాట వాస్తవమే. ప్రభుత్వానికి మరమతుల కోసం రూ.20కోట్లతో ప్రణాళికలు రూపొందించి నివేదికలు పంపించాం. నిధులు మంజూరు కాలేదు. నిధులు మంజూరైతే మరమతు పనులు చేపడతాం.

.

Updated Date - Apr 02 , 2025 | 11:46 PM