Share News

జవసత్వాలు!

ABN , Publish Date - Apr 04 , 2025 | 01:18 AM

జిల్లాలో చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ఈ కేంద్రాలను పునః ప్రారంభించి జవసత్వాలను నింపింది. జిల్లా వ్యాప్తంగా 479 కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఇప్పటికే 50పైగా కేంద్రాల్లో వర్మీ కంపోస్టు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు అత్యధిక ఆదాయం పొందిన పంచాయతీగా చల్లపల్లి నిలిచింది. త్వరలో మరిన్ని పంచాయతీలు ఇదే బాటలో పయనించనున్నాయి.

జవసత్వాలు!

- చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలపై ప్రభుత్వం దృష్టి

- జిల్లా వ్యాప్తంగా 479 కేంద్రాలు ఏర్పాటు

- 50కిపైగా కేంద్రాల్లో కంపోస్టు ఎరువు తయారీ

- కిలో రూ.10 విక్రయం.. చల్లపల్లిలో అత్యధిక సంపాదన

- చల్లపల్లిని సందర్శించిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ బృందం

జిల్లాలో చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ఈ కేంద్రాలను పునః ప్రారంభించి జవసత్వాలను నింపింది. జిల్లా వ్యాప్తంగా 479 కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఇప్పటికే 50పైగా కేంద్రాల్లో వర్మీ కంపోస్టు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు అత్యధిక ఆదాయం పొందిన పంచాయతీగా చల్లపల్లి నిలిచింది. త్వరలో మరిన్ని పంచాయతీలు ఇదే బాటలో పయనించనున్నాయి.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

జిల్లాలో 474 గ్రామ పంచాయతీల్లో 479 చెత్త నుంచి సంపదను తయారు చేసే కేంద్రాలను నిర్మించారు. 2014-19లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వీటిని ఏర్పాటు చేశారు. స్వచ్ఛ ఆంధ్రా మిషన్‌ ద్వారా ప్రతి వెయ్యి మంది జనాభాకు చెత్త సేకరణ కోసం ఒక గ్రీన్‌ అంబాసిడర్‌ను నియమించారు. వీరు ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించి చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలకు తరలించేవారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ వ్యవస్థను అంతగా పట్టించుకోలేదు. దీంతో ఈప్రక్రియకు బ్రేక్‌ పడింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గత ఆగస్టులో జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు పంచాయతీ సమావేశాలు నిర్వహించి, అంతర్గత రహదారుల నిర్మాణంతో పాటు చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలకు మరమ్మతులు చేయడం, నూతన కేంద్రాల నిర్మాణం చేయడానికి ఆమోదం తెలిపారు. జిల్లాలోని 479 కేంద్రాల్లో 50కిపైగా చెత్త నుంచి వర్మీ కంపోస్టు తయారై విక్ర యాలు జరుగుతున్నాయి. మిగిలిన వాటి నుంచి వర్మీ కంపోస్టు తయారు చేసే పనులను ప్రారంభించే దశలో ఉన్నాయి.

చె త్త నుంచి వర్మీకంపోస్టు తయారీ ఇలా

చెత్త నుంచి వర్మీ కంపోస్టును తయారు చేయడానికి జిల్లాలోని ఆయా పంచాయతీల్లో సామర్థ్యాన్ని బట్టి షెడ్‌లను, ఫిట్‌లను నిర్మాణం చేశారు. గ్రీన్‌ అంబాసిడర్‌లు తడిచెత్తను, పొడిచెత్తను చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు తరలిస్తారు. తడిచెత్తను ఫిట్‌లలో వేసి చదును చేసి దానిపై పేడను వేస్తారు. 45 నుంచి 65 రోజుల పాటు రోజూనీటిని పోస్తారు. ఈ చెత్త కుళ్లిపోతుంది. దీనిని షెడ్‌లలో ఉన్న ఫిట్‌లలో లేయర్లుగా వేసి అందులో వానపాములను వేస్తారు. ఇలా వేసిన కుళ్లిన చెత్తపై 65 రోజుల పాటు పేడకలిపిన నీటితో తడుపుతూ ఉంటారు. దీనిని వానపాములు కలియబెడతాయి. అనంతరం వర్మీ కంపోస్టును జల్లెడపట్టి వానపాములను వేరు చేస్తారు. వేరు చేసిన వర్మీకంపోస్టును కేజీ రూ.10 చొప్పున రైతులకు, మొక్కల పెంపకం దారులకు విక్రయిస్తారు.

జిల్లాలోనే చల్లపల్లికి ప్రథమ స్థానం

చెత్త నుంచి సంపద తయారీలో చల్లపల్లి పంచాయతీ జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉంది. స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమంలో భాగంగా చెత్త నుంచి సంపద తయారీని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ పంచాయతీ వర్మీకంపోస్టును విక్రయించి రూ.1.80 లక్షలను ఆదాయంగా పొందింది. ఇటీవల కలెక్టర్‌ బాలాజీ చల్లపల్లి పంచాయతీని సందర్శించి చెత్త నుంచి సంపద తయారీ విధానాన్ని పరిశీలించారు. చల్లపల్లి సర్పంచ్‌ పైడిపాముల కృష్ణకుమారి, ఈవో పీవీ మాధవేంద్రరావుకు ప్రత్యేక ప్రశంసాపత్రాలతో పాటు స్మార్ట్‌వాచ్‌లను బహుమతిగా అందజేశారు. స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమ రూపకర్తలు డాక్టర్‌ డీఆర్‌కే ప్రసాద్‌, పద్మావతి దంపతులను, స్వచ్ఛ చల్లపల్లి సారథులను ప్రత్యేకంగా అభినందించారు. కలెక్టర్‌, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌, ఎండీల ఆదేశాల మేరకు చల్లపల్లి గ్రామాన్ని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ బృందం గురువారం పరిశీలించింది. పదేళ్లుగా జరుగుతున్న స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమం గురించి తెలుసుకుని స్వచ్ఛ చల్లపల్లి స్ఫూర్తిని రాష్ట్రంలోని ఇతర గ్రామాలకు తెలియచేసే కార్యకమ్రంలో భాగంగా స్వచ్ఛాంద్ర కార్పొరేషన్‌ ఫైనాన్స్‌ మేనేజర్‌ పి.విజయశేఖర్‌ నేతృత్వంలోని బృందం సభ్యులు గురువారం తెల్లవారుజామున స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛ సారథులు పనిచేస్తున్న తీరును పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా చల్లపల్లిని ఆదర్శంగా తీసుకునే విధంగా నివేదికను ప్రభుత్వానికి అంద జేస్తామని వారు తెలిపారు.

మోడల్‌ కేంద్రంగా చిట్టిపాలెం

జిల్లాలో ప్రతి రెండో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. తడి చెత్త, పొడి చెత్త సేకరణ, దానిని చెత్త సంపద తయారీ కేంద్రాలకు తరలించడం, వర్మీకంపోస్టును తయారు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌ బాలాజీ మచిలీపట్నం మండలం అరిసేపల్లి పంచాయతీ పరిధిలోని చిట్టిపాలెంలోని చెత్త సంపద తయారీ కేంద్రాన్ని ఇటీవల పరిశీలించారు. చెత్త నుంచి సంపదను తయారు చేసే విధానంపై చిట్టిపాలెంలోని కేంద్రాన్ని మోడల్‌గా ఆయన ప్రకటించారు. ఈ కేంద్రంలో చెత్తనుంచి సంపద తయారు చేసే పద్ధతిపై మిగిలిన పంచాయతీలకు అవగాహన కల్పించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

పారిశుధ్య సమస్యలకు చెక్‌

గ్రామాల్లో చెత్త సంపద తయారీ కేంద్రాలు ఏర్పాటుతో పారిశుధ్య సమస్యలకు కొంత మేర బ్రేక్‌ పడుతోంది. గతంలో గ్రామాల్లో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు కనిపించేవి. గ్రీన్‌ అంబాసిడర్ల ద్వారా తడి, పొడి చెత్తను సేకరించి సంపద తయారీ కేంద్రాలకు తరలిస్తుండంతో చెత్తకుప్పలు కనుమరుగయ్యాయి. జిల్లాలో 50కిపైగా కేంద్రాల్లో చెత్త నుంచి వర్మీ కంపోస్టును తయారు చేస్తున్నారు. మిగిలిన పంచాయతీల్లో ఈప్రక్రియను ప్రారంభిస్తాం.

-జె.అరుణ, జిల్లా పంచాయతీ అధికారి

Updated Date - Apr 04 , 2025 | 01:18 AM