రౌడీషీటర్ దారుణ హత్య
ABN , Publish Date - Mar 16 , 2025 | 01:13 AM
ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీలో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. కంచికచర్లకు చెందిన జరబన వెంకట్ (43) గత ఏడాది నుంచి ఇబ్రహీంపట్నం ఆర్టీసీ కాలనీలో కుటుంబంతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. అతనికి ఫెర్రీకి, జూపూడికి చెందిన వ్యక్తులతో స్నేహం ఏర్పడింది.

మద్యం మత్తులో రెండు టీమ్‌ల మధ్య గొడవ
ఒకరినొకరు దూషించుకుని హత్య
పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
ఫెర్రీలోని ఓ రేకుల షెడ్డులో ఘటన
ఇబ్రహీంపట్నం, మార్చి 15 (ఆంధ్రజ్యోతి) : ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీలో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. కంచికచర్లకు చెందిన జరబన వెంకట్ (43) గత ఏడాది నుంచి ఇబ్రహీంపట్నం ఆర్టీసీ కాలనీలో కుటుంబంతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. అతనికి ఫెర్రీకి, జూపూడికి చెందిన వ్యక్తులతో స్నేహం ఏర్పడింది. వెంకట్‌కు టీడీపీలో ఉన్న పరిచయాల నేపథ్యంలో.. ఫెర్రీలో ఇసుక రేవు తెరిపిస్తే డబ్బు సంపాదించుకోవచ్చని అతడి స్నేహితులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి ఫెర్రీ వద్ద ఓ చోట మందు పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. జరబన వెంకట్ సహా చిప్పల వెంకటేశ్వరరావు, పీతా రామకృష్ణ (జూపూడి) ఒక బృందంగా, పొనమాల వేణు, చింతా వీరాంజనేయులు, కొప్పనాతి వీర్రాజులు మరో బృందంగా మద్యం సేవించారు. వీరంతా చింతా వీరాంజనేయులుకు చెందిన రేకుల షెడ్డులో మద్యం సేవిస్తుండగా, గొడవ మొదలైంది. చివరకు అది పెద్దది కావడంతో వెంకట్‌ను పొనమాల వెన్నెలరావు అలియాస్ వేణు షెడ్డులో ఉన్న ఇనుప కుర్చీతో గట్టిగా తలపై మోదాడు. తీవ్ర రక్తస్రావంతో రూమ్‌లో నుంచి బయటకు వచ్చిన వెంకట్‌ను వేణు మరోమారు సిమెంట్ రాయితో కొట్టి చంపాడు. అడ్డొచ్చిన చిప్పల వెంకటేశ్వరరావును మరో ఇద్దరు చంపబోతుండగా పరారయ్యాడు. కాగా, ఏడీసీపీ జి.రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, ఇబ్రహీంపట్నం సీఐ ఎ.చంద్రశేఖర్ ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పంపి కేసు నమోదు చేశారు. పొనమల వేణు, చింత వీరాంజనేయులు, కొప్పనాతి వీర్రాజును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
హతుడిది నేరచరిత్రే..
స్నేహితుల చేతిలో హత్యకు గురైన రౌడీషీటర్ వెంకట్‌ది ఆది నుంచి నేరచరిత్రేనని పోలీసులు తెలిపారు. హత్య కేసుతో పాటు మరో పది కేసులు వరకు ఉన్నాయి. ఏడాది క్రితం కంచికచర్లను వదిలేసి ఇబ్రహీంపట్నం ఆర్టీసీ కాలనీలో భార్య, పాపతో కలిసి అద్దెకుంటున్నాడు. స్నేహితులతో కలిసి జల్సాగా తిరుగుతూ ఉంటాడు. చివరికి ఆ స్నేహితుల చేతిలోనే హత్యకు గురయ్యాడు. కాగా, పోస్టుమార్టం అనంతరం వెంకట్ మృతదేహాన్ని స్వగ్రామం కంచికచర్లకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.