Share News

ప్రజా సమస్యలను పరిష్కరించండి

ABN , Publish Date - Mar 16 , 2025 | 01:10 AM

ఈ ఏడాది పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక ఆదేశించారు. జిల్లా పరిషత ఏడు స్థాయీసంఘాల సమావేశాలు శనివారం స్థానిక జెడ్పీ సమావేశ హాల్లో జరిగాయి. వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించారు.

ప్రజా సమస్యలను పరిష్కరించండి

పదిలో ఉత్తమ ఫలితాలు రావాలి

పాఠశాలల మనుగడకు ఇబ్బంది రానీయొద్దు

పశుసంపదను కాపాడేందుకు చర్యలు తప్పనిసరి

ఇంటి నిర్మాణాలు పూర్తయితే బిల్లులు ఇవ్వండి

జెడ్పీ స్థాయీసంఘం సమావేశాల్లో చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : ఈ ఏడాది పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక ఆదేశించారు. జిల్లా పరిషత ఏడు స్థాయీసంఘాల సమావేశాలు శనివారం స్థానిక జెడ్పీ సమావేశ హాల్లో జరిగాయి. వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించారు. తొలుత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమాలకు తమవంతు సహకారం అందిస్తామని, స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి కట్టుబడి ఉంటామని అధికారులు, ప్రజాప్రతినిధులతో జెడ్పీ చైర్‌పర్సన్‌ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు జెడ్పీ ద్వారా స్ఫూర్తి స్టడీ మెటీరియల్‌ను అందిస్తున్నామన్నారు. సాయంత్రం సమయంలో పోషకాహారాన్ని కూడా సమకూర్చామన్నారు.

పాఠశాలల్లో పిల్లలను చేర్పించండి

విద్యాశాఖపై సమీక్ష జరిగిన సమయంలో.. నందివాడ మండలం ఒద్దులమెరక గ్రామ పాఠశాలలో గతంలో పదిమంది పిల్లలు ఉండేవారని, నేడు ముగ్గురే ఉన్నారని నందివాడ జెడ్పీటీసీ సభ్యురాలు కందుల లక్ష్మీదుర్గాకుమారి సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. కుదరవల్లి పాఠశాలలో చదివే పిల్లలు కొంతమందికి నేటికీ ఆధార్‌కార్డులు లేవన్నారు. పలు మండలాల్లోని జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో మూగ, చెవుడు ఉన్న బాలలకు పాఠాలు బోధించే టీచర్లు, సౌకర్యాలు లేకపోవడంతో వారు చదువుకోలేని స్థితి ఏర్పడిందన్నారు. నూజివీడు మండల కేంద్రంలో 16 మంది పిల్లలు చదువుకు దూరమయ్యారని జిల్లా పరిషత ఉపాధ్యక్షుడు గుడిమళ్ల కృష్ణంరాజు అధికారులకు వివరించారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు పాఠాలు బోధించేందుకు టీచర్లను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఇందుకోసం తగు చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్‌పర్సన్‌.. విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. డీఈవో రామారావు మాట్లాడుతూ గ్రామాల్లోని పాఠశాలల్లో 50 నుంచి 60 మంది పిల్లలు ఉంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అక్కడ ఐదుగురు టీచర్లు ఉంటారని, తక్కువ పిల్లలున్న పాఠశాలలను కిలోమీటరు దూరంలోని పాఠశాలల్లో విలీనం చేస్తామన్నారు. జెడ్పీ సీఈవో కన్నమనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించే బాధ్యతను టీచర్లు కూడా తీసుకోవాలన్నారు.

పశు సంపదను కాపాడండి

ఏడాదిలోపు వయసున్న దూడలకు శరీరంపై బొబ్బలు వచ్చి చనిపోతున్నాయని, ఈ అంశంపై పశుసంవర్థక శాఖ అధికారులు దృష్టిసారించి అవసరమైన టీకాలు, వైద్యం అందించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక సూచించారు. పశువులు అంటువ్యాధులు, రోగాల బారిన పడితే తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు వైద్యసేవలను అందుబాటులోకి తేవాలన్నారు. చేపలవేట నిషేధ సమయంలో మత్స్యకారుల కుటుంబాలకు ఇచ్చే జీవనభృతిని సకాలంలో అందించాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. ఇంటి నిర్మాణాలు పూర్తిచేసుకున్న లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు చెల్లించేలా చూడాలని గృహనిర్మాణ సంస్థ అధికారులకు జెడ్పీ చైర్‌పర్సన్‌ సూచించారు.

గూడూరు సీహెచ్‌సీపై దృష్టిపెట్టండి

వైద్యశాఖపై సమీక్ష జరిగిన సమయంలో.. గూడూరు జెడ్పీటీసీ సభ్యుడు వేముల సురేష్‌ మాట్లాడుతూ పెడన నియోజకవర్గం గూడూరులో మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారి పక్కనే రూ.4 కోట్లతో ప్రభుత్వం సమీకృత ఆసుపత్రిని నిర్మించిందని, ఈ ఆసుపత్రికి గతంలో రోజుకు కనీసం 150 మంది రోగులు వచ్చేవారని, ప్రస్తుతం 50 మంది కూడా రావట్లేదన్నారు. వైద్యులను అందుబాటులో ఉంచాలని కోరారు. వివిధ శాఖలపై సమీక్షలో భాగంగా చేనేత కార్మికులకు రుణాలు ఇప్పించేందుకు, చిన్నపాటి వ్యాపారాలు చేసుకునే వారికి ముద్రరుణాలు ఇచ్చేందుకు అధికారులు చొరవ తీసుకోవాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆనంద్‌కుమార్‌, డ్వామా పీడీ శివప్రసాద్‌ యాదవ్‌, డీఎంఅండ్‌హెచ్‌వో శర్మిష్ట, వ్యవసాయశాఖ జేడీ మనోహరరావు, చేనేత జౌళిశాఖ జేడీ సాయిప్రసాద్‌, ఉమ్మడి జిల్లాకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 01:10 AM