Share News

ఇగోలు వద్దు.. ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవద్దు

ABN , Publish Date - Apr 06 , 2025 | 12:53 AM

‘నాకేం తెలియదు.. నేనేం చూడట్లేదని అనుకోవద్దు. మీరేం చేస్తున్నారో నాకు ఎప్పటికప్పుడు రిపోర్టు వచ్చేస్తుంది. నాకు కార్యకర్తలే ముఖ్యం. ఇగోలను పక్కన పెట్టండి. ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుని పార్టీకి చెడ్డపేరు తీసుకురావద్దు. ఎవరేమిటన్నది నా దగ్గర సమాచారం ఉంది. అవినీతిని సహించను. ప్రజలు మనల్ని గమనిస్తూ ఉంటారు. మనం ఏం చేస్తున్నామో పరిశీలిస్తూ ఉంటారు. సామాజిక న్యాయం చేస్తున్నామా లేదా? మంచి పనులు చేస్తున్నామా లేదా? మనం ఎలా ఉంటున్నామనేదీ ప్రతీదీ చూస్తారు. అంచనా వేస్తారు. కాబట్టి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. నియోజకవర్గంలో అన్ని తరగతుల వారు ఓట్లు వేస్తేనే విజయం సాధించామన్నది గుర్తు పెట్టుకోవాలి. అసెంబ్లీయే కాదు పార్లమెంట్‌ నియోజకవర్గాలపై కూడా దృష్టిపెడతా..’ అని సీఎం చంద్రబాబు నందిగామ నియోజకవర్గ పార్టీ నేతలను సుతిమెత్తగా హెచ్చరించారు.

ఇగోలు వద్దు.. ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవద్దు

నేను అన్నీ గమనిస్తున్నా.. నాకన్నీ తెలుసు

పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించేది లేదు

కార్యకర్తలంటేనే నాకు ఎక్కువ ప్రేమ

నాయకులు అటూ ఇటూ పోయినా..

కార్యకర్తలు పార్టీని భుజాన వేసుకుంటారు

ఇక 2029 ఎన్నికల కోసం పనిచేయండి

పార్లమెంట్‌ నియోజకవర్గాలపైనా దృష్టి

నందిగామ కార్యకర్తలు, నేతలతో సీఎం చంద్రబాబు

పార్టీ నాయకులకు సుతిమెత్తగా క్లాస్‌

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కార్యకర్తలపైనే తనకు అభిమానం ఉంటుందని, నాయకులు అవకాశవాదంతో ఉంటారని, వారు అటూ ఇటూ మారినా.. కార్యకర్తలు మాత్రం పార్టీని భుజాలకెత్తుకుని పనిచేస్తారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం చందర్లపాడు మండలం ముప్పాళ్ల వచ్చిన ఆయన నందిగామ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు, నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బూత కన్వీనర్లు, క్లస్టర్‌ ఇన్‌చార్జులకు ఆయన ర్యాంకులు కేటాయించారు. బూత కన్వీనర్ల ర్యాంకులు తగ్గటాన్ని ప్రశ్నించారు. తమను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయట్లేదని పలువురు బూత కన్వీనర్లు తెలిపారు. పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ.. వైసీపీ నుంచి వచ్చిన వారికి సభ్యత్వాలు ఇస్తున్నారని, మళ్లీ వారే పదవుల కోసం పోటీలు పడుతున్నారని, ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న తమకు ఇబ్బందికరంగా ఉంటోందని తెలిపారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ కార్యకర్తల మనోభావాల ప్రకారమే తనతో పాటు పార్టీ కూడా నడుచుకుంటుందన్నారు. మొదటి నుంచీ పార్టీని అంటిపెట్టుకుని పనిచేసిన వారికి ఎప్పుడూ అన్యాయం జరగదని భరోసా ఇచ్చారు. నేటి మొదలు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా అంతా పనిచేయాలని సూచించారు.

అహంకారమొద్దు.. సమన్వయంతో పనిచేయండి

అనంతరం చంద్రబాబు.. నందిగామ నియోజకవర్గం గురించి కొద్దిసేపు మాట్లాడారు. టీడీపీ ఆవిర్భావం నుంచి జరిగిన ఎన్నికల్లో కేవలం రెండుసార్లే ఇక్కడ పార్టీ ఓడిపోయిందని, మిగిలిన అన్నిసార్లూ విజయదుందుభి మోగించిందని తెలిపారు. ఆ రెండు సందర్భాల్లోనూ నాయకుల మధ్య సమన్వయం లేకపోవటమే కారణమని చెప్పారు. మనల్ని మనమే ఓడించుకోవటం జరిగిందే తప్ప.. బయటి వారు ఓడించలేదన్నారు. కాబట్టి నియోజక వర్గంలో అందరూ సమన్వయంతో, సమష్టిగా పనిచేయాలని సూచించారు. అహంకారం దరిచేరనివ్వొద్దన్నారు. ఇగోలతో ఉండే వారిని తాను ఉపేక్షించబోనన్నారు. ఈ ఐదేళ్లనలో తాను 175 నియోజకవర్గాల్లో కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తానని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో క్లస్టర్‌, బూతలవారీగా నాయకుల పనితీరుపై సమీక్షిస్తానని చెప్పారు. పార్టీ కోసం మంచి పనులు చేసిన వారికి నామినేటెడ్‌ పదవులు ఇవ్వటం ద్వారా తగిన గుర్తింపు ఇస్తామన్నారు. పార్టీ కోసం పనిచేయని వారిని పక్కన పెట్టేస్తానన్నారు. ప్రతి ఒక్కరిపై పర్యవేక్షణ ఉంటుందని, గెలిచే అభ్యర్థులకే సీట్లు ఇస్తామన్నారు. గెలవలేని వారిని నిర్దాక్షిణ్యంగా పక్కనపెడతామన్నారు. వచ్చే మహానాడు కడపలో జరుగుతుందని, భవిష్యత్తులో అక్కడ కూడా ఘన విజయం సాధిస్తామన్నారు. అధికారం వచ్చిందన్న ధీమాతో నాయకులు, కార్యకర్తలు ఉంటున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పారు.

గెలిచాక పనిచేయకపోతే ఎలా..?

2024 ఎన్నికల్లో అందరూ పనిచేశారని, మంచి ఫలితాలు వచ్చాయని, గెలిచాక పనిచేయటం తగ్గించారని చురకలు అంటించారు. నందిగామ నియోజకవర్గంలో ప్రజలకు అందాల్సినవి అందుతున్నాయని, అర్జీలు కూడా పరిష్కారం అవుతున్నాయని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో సామాజిక న్యాయం పాటించాల్సిన అవసరం ఉందన్నారు.

Updated Date - Apr 06 , 2025 | 12:53 AM