Share News

ప్రభుత్వ బడిని బతికించుకుందాం

ABN , Publish Date - Mar 15 , 2025 | 01:35 AM

యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఎంజీ రోడ్డులోని రాష్ట్ర కార్యాలయంలో విద్యారంగ సమస్యలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వ బడిని బతికించుకుందాం

విద్యార్థులను చేర్పించే ప్రక్రియను ప్రారంభించండి

తల్లిదండ్రులకు నమ్మకం కలిగేలా పనిచేయండి

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఉపాధ్యాయులకు వక్తల పిలుపు

గవర్నర్‌పేట, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ‘ప్రభుత్వ బడి పట్ల విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలిగించేలా పనిచేసి, ప్రభుత్వ బడులను బతికించుకోవడానికి కృషి చేయండి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించే ప్రక్రియను ప్రారంభించండి.’ అని ఉపాధ్యాయులకు రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు పిలుపునిచ్చారు. యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఎంజీ రోడ్డులోని రాష్ట్ర కార్యాలయంలో విద్యారంగ సమస్యలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సమావేశానికి యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వర్లు, కేఎ్‌సఎస్‌ ప్రసాద్‌ ప్యానెల్‌ అధ్యక్షులుగా వ్యవహరించారు. పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు మాట్లాడారు. గత ప్రభు త్వం విద్యారంగ సంస్కరణల పేరుతో తెచ్చిన జీవో నెంబరు 117 కారణంగా 12,512 ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారాయని, 10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలలకు తరలిపోయారని ఆయ న ఆవేదన వ్యక్తం చేశారు. పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌ వల్ల జీవోను రద్దు చేస్తామని ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించిందన్నారు. జీవో నెంబరు 117 రద్దు చేసి మరో జీవో తేవడం కోసం చేస్తున్న కసరత్తులో విద్యారంగ సంస్కరణలు అమలు చేస్తోందని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి అన్నారు. విద్యారంగ సంస్కరణల వల్ల 1, 2 తరగతులు మాత్రమే ఉన్న ఫౌండేషన్‌ పాఠశాలలు 20 వేలకు పైగా పెరుగుతాయని తెలిపారు. భవిష్యత్తులో ఈ పాఠశాలలూ మూసివేస్తారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మోడల్‌ ప్రాథమిక పాఠశాలల పేరుతో మిగిలిన ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను మ్యాప్‌ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీల ద్వారా బలవంతంగా తీర్మానాలు చేయించడం సరికాదని మాజీ ఎమ్మెల్సీ వి.బాలసుబ్రహ్మణ్యం అన్నారు. అన్ని హంగులతో మోడల్‌ పాఠశాలను నిర్మించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. తీసుకున్న నిర్ణయాలను విద్యాశాఖా మంత్రి, ఎమ్మెల్యేలు, గ్రామ సర్పంచ్‌లు, విద్యాకమిటీ సభ్యుల వరకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. అంగన్వాడీ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్‌, ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రసన్న, అశోక్‌, యూటీఎఫ్‌ కార్యదర్శులు ఎస్పీ మనోహర్‌కుమార్‌, బి.సుభాషిణి, కేఏ ఉమామహేశ్వరరావు, ఎస్‌.కిషోర్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 15 , 2025 | 01:35 AM