విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి
ABN , Publish Date - Mar 15 , 2025 | 01:43 AM
విశాఖ స్టీల్ పరిరక్షణ కోసం ఎన్నికల సమయంలో కూట మి నేతలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు.

ధర్నాచౌక్‌లో విశాఖ ఉక్కు పరిరక్షణ జేఏసీ ధర్నా
ధర్నాచౌక్, మార్చి 14(ఆంధ్రజ్యోతి): విశాఖ స్టీల్ పరిరక్షణ కోసం ఎన్నికల సమయంలో కూట మి నేతలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ మోసపూరితమని, ప్లాంట్‌కు సొంత గనులు, నిర్వహణ నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ జేఏసీ ఆఽధ్వర్యంలో స్థానిక ధర్నాచౌక్‌లో శుక్రవారం ధర్నా జరిగింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయరాదని అసెంబ్లీలో తీర్మానించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నాయకులు డిమాండ్ చేశారు. ఇటీవల ప్లాంట్‌ను కాపాడుకునేందుకు కేంద్రప్రభుత్వం నిధులు కేటాయించిందని అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ నిధులు కేవలం బకాయి వేతనాలు చెల్లించడానికే సరిపోతాయన్నారు. విశాఖ ఉక్కు రక్షణ కోసం ప్రజలు, ట్రేడ్ యూనియన్లు దీర్ఘాకాలంగా పోరాడుతున్నా పట్టించుకోకుండా అనకాపల్లిలో మరో ప్రైవేట్ స్టీల్‌ప్లాంట్ మిట్టల్ కంపెనీకి ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించడాన్ని తప్పుబట్టారు. రాజకీయలకు అతీతంగా విశాఖ ఉక్కు పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, జేఏసీ చైర్మన్ సీహెచ్ నర్సింగరావు, ఏఐటీయూసీ రాష్ట్ర అఽధ్యక్షుడు రావుల రవీంద్రనాథ్ మాట్లాడారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంఘీభావం తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతరేక ఉద్యమానికి తమ మద్దతు ప్రకటించారు.