Share News

Kollu Ravindra Fire On Perni Nani: పేర్నినానిని ఉతికారేసిన మంత్రి కొల్లు

ABN , Publish Date - Apr 08 , 2025 | 02:47 PM

Kollu Ravindra Fire On Perni Nani: మద్యంలో వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై సీఐడీ ఎంక్వైరీ జరుగుతోందని.. సిట్‌ను ఏర్పాటు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సిట్ వేసిన సాయంత్రం తాడేపల్లిలో ఫైల్స్ దగ్ధం చేశారన్నారు. ఏ తప్పు చేయకపోతే ఫైల్స్ తగలబెట్టడం ఎందుకు..? ముందస్తు బెయిల్ ఎందుకు అని ప్రశ్నించారు.

Kollu Ravindra Fire On Perni Nani: పేర్నినానిని ఉతికారేసిన మంత్రి కొల్లు
Kollu Ravindra Fire On Perni Nani:

కృష్ణా జిల్లా, ఏప్రిల్ 8: మద్యం విక్రయాలపై మాజీ మంత్రి పేర్ని నాని (Former Minister Perni Nani) చేసిన అవినీతి ఆరోపణలను ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) తీవ్రంగా ఖండించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బియ్యం దొంగ పేర్ని నానివి కారుకూతలు, పిచ్చివాగుడు అంటూ మండిపడ్డారు. మద్యం దుకాణాల నుంచి కూటమి ఎమ్మెల్యేలు మామూళ్లు వసూళ్లు చేస్తున్నారని చేసిన చెత్త ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మద్యం విధానంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడింది గత ప్రభుత్వమే అని అన్నారు. పేర్ని నాని చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. రాష్ట్రంలో పారదర్శకంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం సబ్ పేరుతో ఎక్సైజ్ శాఖను విచ్చిన్నం చేసిందని విమర్శించారు. ప్రభుత్వ షాపుల పేరుతో అక్రమ మద్యాన్ని అమ్ముకుని జేబులు నింపుకున్నారని ఆరోపించారు. ఎక్సైజ్‌లో గత ప్రభుత్వం చేసిన అవినీతి బయటపడుతుంటే చూసి తట్టుకోలేక ప్రజలను దారి మళ్లించారని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఆ ఘనత కూటమి సర్కార్‌దే

మద్యంలో వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై సీఐడీ ఎంక్వైరీ జరుగుతోందని.. సిట్‌ను ఏర్పాటు చేశామన్నారు. సిట్ వేసిన సాయంత్రం తాడేపల్లిలో ఫైల్స్ దగ్ధం చేశారన్నారు. ఏ తప్పు చేయకపోతే ఫైల్స్ తగలబెట్టడం ఎందుకు..? ముందస్తు బెయిల్ ఎందుకు అని ప్రశ్నించారు. ‘బెల్టు షాపులకు వేలం పాటలు నిర్వహించిందే కూడా మీరే. మీ అనుయాయులతో వేలం పాటలు పెట్టి దోచుకున్నారు’ అంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో 3400 షాపులకు టెండర్లు పిలిస్తే 90వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. రూ.1800 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు. గీత కార్మికులకు కూడా 340 దుకాణాలు కేటాయించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు.

Chandrababu lokesh React: పవన్ కుమారుడికి ప్రమాదంపై చంద్రబాబు, లోకేష్ స్పందన


అన్నీ బయటకు వస్తాయ్

గత ప్రభుత్వంలో అమ్మిన అక్రమ, కల్తీ మద్యం నిల్వలన్నింటినీ డిపోల్లో పక్కన పెట్టామని.. టెస్ట్‌లు చేశామన్నారు. విచారణలో అన్నీ బయటకు వస్తాయని అన్నారు. డిస్టలరీల కరెంట్ బిల్లుల నుంచి చాలా సూక్ష్మంగా విచారణ జరుగుతోందని తెలిపారు. ఎవరైతే దొంగలు ఉన్నారో వారందరూ బయటకు వస్తారన్నారు. గత ప్రభుత్వంలో అక్రమంగా తయారు చేసిన మద్యాన్ని తాము ఎక్కడా కూడా అమ్మలేదన్నారు. చాలా నాణ్యతతో కూడిన మద్యాన్ని అమ్ముతున్నామని చెప్పారు. 12 రకాలైన నాణ్యతా పరీక్షలు చేస్తున్నామని.. ల్యాబ్ లన్నింటినీ కంప్యూటరైజ్డ్ చేసి నాణ్యమైన మద్యాన్ని అమ్ముతున్నామని స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడు కూడా మద్యం నాణ్యతను పరీక్షించలేదన్నారు. కేవలం అల్కాహాల్ పర్సంటేజ్ పరీక్ష మాత్రమే చేసి కల్తీ మద్యాన్ని అమ్మి ప్రజల ప్రాణాలను తీశారని ఫైర్ అయ్యారు. వైసీపీ దోపిడీ వల్ల మల్టీ నేషనల్ కంపెనీలు అన్నీ రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని ధ్వజమెత్తారు.


అన్నీ చేసి.. టీడీపీపై నిందారోపణలా

రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన మల్టీ నేషనల్ కంపెనీలు అన్నింటినీ మళ్లీ రాష్ట్రానికి తీసుకొచ్చి 350 బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి అక్రమ మద్యం రవాణాను అరికట్టామన్నారు. అన్ని బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురావడం వల్ల మద్యం విక్రయాలు పెరిగాయని.. దాన్ని టార్గెట్ ఫిక్స్ చేయడం అంటే ఎలా అని అన్నారు. రాష్ట్రాన్ని గంజాయి మయం చేసిన ఘనత గత ముఖ్యమంత్రి జగన్ ది అంటూ మండిపడ్డారు. ఆ నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఇంటి ముందు ఓ ఆడబిడ్డపై గంజాయి మత్తులో అఘాయిత్యానికి పాల్పడితే దిక్కు లేదన్నారు. ఇవాళ ఆడపిల్ల వైపు చూడాలంటే భయపడే విధంగా కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని తెలిపారు. తోట చంద్రయ్య అనే ఓ బీసీ సోదరుడి పీక కోసి హత్య చేసింది వైసీపీ నేతలు కాదా అని ప్రశ్నించారు. మాచర్లలో నడి రోడ్డుపై టీడీపీ బీసీ నేత బోండా ఉమా కారుపై దాడి చేసిన వ్యక్తికి మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇచ్చింది వైసీపీ కాదా అని నిలదీశారు. ఇన్ని దుర్మార్గాలు చేసి నేడు టీడీపీ ఎమ్మెల్యేలపై నిందారోపణలు చేస్తారా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


పేర్నినాని.. ఇది గమనించు

గత వైసీపీ ప్రభుత్వంలో గల్లీకి ఒక వసూల్ రాజా ఉండేవారన్నారు. ఇవాళ ఇసుకలో గానీ, మద్యంలో గానీ చాలా పారదర్శకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని తెలిపారు. సిట్ నివేదికలు వచ్చిన వెంటనే అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామన్నారు. సిగ్గు లేకుండా పేదల బియ్యాన్ని బొక్కేసిన పేర్ని నాని మొన్నటి వరకు అడ్రస్ లేకుండా పోయారన్నారు. ఇవాళ ముందస్తు బెయిల్ వచ్చిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. ‘పై నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదివితే సరిపోదు. మీరు చేసిన ప్రతి కుంభకోణం బయటపడుతుంది.. 8400 బస్తాల పేదల బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి అక్రమ రవాణాకు పాల్పడిన వ్యక్తి పేర్ని నాని.. దోచుకున్న బియ్యానికి ఫైన్ కట్టేస్తే కేసు మాఫీ అయిపోదన్న విషయాన్ని పేర్ని నాని గమనించాలి’ అని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కుమారుడికి ప్రమాదం.. ఏమైందంటే..

Controversy: సీతమ్మవారికి తాళి కట్టిన వైసీపీ ఎమ్మెల్యే

Read Latest AP News and Telugu News

Updated Date - Apr 08 , 2025 | 02:47 PM