ఆర్‌యూలో సీఐడీ విచారణకు రంగం..?
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:57 AM
రాయలసీమ యూనివర్సిటీలో సీబీ సీఐడీ విచారణకు రంగం సిద్ధమవుతోందని సమాచారం. పదేళ్లుగా కొన్ని కీలక ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి ఓచర్స్, ఫర్నిచర్ మిస్సింగ్, కీలక ఫైళ్ల దొంగతనాలు, తదితర అంశాలకు సంబంధించి గతంలో విజిలెన్స్ కేసులు నమోదయ్యాయి.

వీసీని హెచ్చరించిన ఉన్నత విద్యామండలి
కర్నూలు అర్బన్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ యూనివర్సిటీలో సీబీ సీఐడీ విచారణకు రంగం సిద్ధమవుతోందని సమాచారం. పదేళ్లుగా కొన్ని కీలక ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి ఓచర్స్, ఫర్నిచర్ మిస్సింగ్, కీలక ఫైళ్ల దొంగతనాలు, తదితర అంశాలకు సంబంధించి గతంలో విజిలెన్స్ కేసులు నమోదయ్యాయి. వీటిపైన విచారణ చేసుకోవాలని 26వ పాలక మండలిలో అనుమతులు కూడా ఇచ్చారు. కానీ ఇంత వరకు కేసులో పురోగతి లేకపోవడంతో ఈ కేసుల పైన సీఐడీ రంగంలోకి దిగుతున్నట్లు తెలిసింది. ఇందులోభాగంగానే విజయవాడ సీఐడీ వర్శిటీలోని అధికారులను హెచ్చరించినట్లు సమాచారం. వీటిపైన ఉపకులపతి డాక్టర్ వెంకట బసవరావును వివరణ కోరగా ఉన్నత విద్యామండలి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన మాట వాస్తమేనని, సీఐడీ గురించి తనకు సమాచారం లేదని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రికి కొందరు అధికార పార్టీ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు పెండింగ్ కేసులపై విచారణ చేసి వర్సిటీలో ప్రశాంత వాతావరణం నెలకొల్పే దిశగా చర్యలు తీసుకోవాలని కోరిన విషయం తెలిసిందే. పెండింగ్ కేసులను వెంటనే పూర్తి చేసి వర్సిటీలో పాలనను గాడిలో పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఫేసీ ఉన్నత విద్యామండలితో పాటు, సీబీసీఐడీకి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇదే అంశంపై ఓ విద్యార్థి సంఘం నాయకుడు లోకాయుక్తాను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే సీబీసీఐడీ అంశం వర్శిటీలో ప్రొఫెసర్లు, విద్యార్థులు, ఉద్యోగుల మధ్య చర్చనీయాంశంగా మారింది.