Share News

కడప ప్రొఫెసర్ల పాగా

ABN , Publish Date - Apr 14 , 2025 | 12:13 AM

జిల్లాలోని 3 యూనివర్సిటీలలో కడప జిల్లాకు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు పాగా వేశారనే విమర్శలున్నాయి.

 కడప ప్రొఫెసర్ల పాగా

స్థానిక ప్రొఫెసర్లలో ముసలం..

ఆర్‌యూ, క్లస్టర్‌, ఉర్దూ యూనివర్సిటీల్లో నిత్యం వివాదాలు

కర్నూలు అర్బన్‌, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 3 యూనివర్సిటీలలో కడప జిల్లాకు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు పాగా వేశారనే విమర్శలున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన వారినే అందలం ఎక్కించారని కొందరు ప్రొఫెసర్లు ఆందోళన చెందుతున్నారు. పరిపాలనతో పాటు కీలక విషయాల్లో వారి పెత్తనం మితిమీరి పోవడంతో స్థానిక బోధన, బోధనేతర సిబ్బంది మండిపడుతున్నారు. రాయలసీమ యూనివర్సిటీ, క్లస్టర్‌ యూనివర్సిటీలకు రిజిస్ర్టార్లు, డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ యూనివర్సిటీ ఇన్‌చార్జి ఉపకులపతి కడప జిల్లాకు చెందిన వారిని నియమించడంతో పాలన వ్యవహరాల్లో వారు చెప్పిందే వేదంగా మారింది. దీనికి తోడు వర్శిటీల మధ్య ఆధిపత్య పోరుకు తెరలేపుతున్నారని విద్యార్థులు మండి పడుతున్నారు. క్లస్టర్‌, ఉర్దూ యూనివర్సిటీ రెండింటిని ఒకే క్యాంప్‌సలో ఏర్పాటు చేసి పెత్తనం అంతా ఓ వర్శిటీలో తానే చెలాయించాలనే లక్ష్యంగా ఓ అధికారి పావులు కదుపుతున్నట్లు ప్రచారం ఉంది. ఈ క్రమంలో ఇటీవల కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాలను ఉర్దూ వర్శిటీకి అప్పగించాలని విద్యార్ధి, మైనార్టీ సంఘాలను ఉసిగొలిపి ఆందోళనకు వారే తెరవెనుక ఉంటూ విద్యార్థుల మధ్య చిచ్చు రేపుతున్నారనే ప్రచారం ఉంది.

రాయలసీమ వర్సిటీలో ..

రాయలసీమ యూనివర్సిటీకి ప్రభుత్వం కొత్తగా ఉపకులపతిని నియమించినా పెత్తనం అంతా ఇద్దరు మాజీ ప్రొఫెసర్ల మధ్య సాగుతోందనే ప్రచారం ఉంది. ఉపకులపతిని కేవలం సీటుకే పరిమితం చేయ డంలో ఓ అధికారి పాత్ర ఉందని విద్యార్థులు అంటున్నారు. ఈ క్రమంలో రాయలసీమ యూనివర్సిటీలో నిత్యం వివాదాలు తలెత్తుతున్నాయి. ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ను విద్యార్ధులను అడ్డుపెట్టుకొని బలవంతంగా రాజీనామా చేయించి రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్‌ అదనంగా ఇంజనీరింగ్‌ కళాశాల కు చెందిన ప్రిన్సిపాల్‌ బాధ్యతలు తన వద్దే పెట్టుకోవడంతో స్థానికంగా పని చేస్తున్న ప్రొఫెసర్లు గుర్రుగా ఉన్నారనే ప్రచారం ఉంది. పరిపాలన వ్యవహారాల్లో ఉపకులపతి వద్ద తనే కీలకంగా వ్యవహరిస్తూ పరిపాలన తాను చెప్పినట్లే నడవాలని చూడటంతో బోధన, బోధనేతర సిబ్బంది ఆయనతో వాగ్వివాదానికి దిగుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని వివాదాస్పద అంశాలు, కోర్టు కేసులో ముడి పడి ఉన్న పోస్టులను దగ్గరుండి నడిపించి తనకేమి సంబంధం లేదని, వర్శిటీలో ప్రొఫెసర్లను రెండు వర్గాలుగా చీల్చి ఒక వర్గాన్ని తనకు అనుకూలంగా మలచుకుని వర్శిటీ రాజకీయాలను శాసిస్తున్నాడనే విమర్శలున్నాయి.

క్లస్టర్‌ వర్సిటీలో ఇలా...

ప్రతిష్టాత్మకంగా కొత్త కోర్సులతో ఏర్పాటైన క్లస్టర్‌ వర్శిటీలో కూడా ఆధిపత్య పోరుతో పాలన గాడి తప్పిందనే ప్రచారం ఉంది. కేవీఆర్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్స్‌ మధ్య రెండేళ్ల పాటు కోల్డ్‌వార్‌ జరగడంతో ఇద్దరు ప్రిన్సిపాల్స్‌ను, అప్పటి రిజిస్ట్రాార్‌ను బదిలీ చేశారు. ఆ తర్వాత కడప జిల్లా నుంచి వచ్చిన రిజిస్ట్రార్‌ మరి కొందరు ఆధ్యాపకులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి లేఖలు రాయడం, ఉర్దూ యూనివర్సిటీ అధికారులు వారికి వ్యతిరేకంగా మైనార్టీ వర్గాలను డిగ్రీ కళాశాల పరిశీలనకు పంపారు. దీనితోపాటు మంత్రి టీజీ భరత్‌ను ఇందులో లాగారు. వీటన్నిటి వల్ల విశ్వవాద్యాల పాలన రోడ్డున పడిందని ప్రొఫెసర్లు ఆందోళన చెందుతున్నారు.

అలాంటిది ఏమీ లేదు

అలాంటింది ఏమీ లేదు. అందరినీ కలుపుకొని పని చేయాలి. ఎవరి మధ్యా అభిప్రాయ భేదాలు ఉండవు. అన్ని సరిచేస్తా. ప్రొఫెసర్ల మధ్య తేడాలు రాకుండా అందరికీ న్యాయం జరిగేలా చూస్తా.

- వెంకట బసవ రావు, ఉపకులపతి, రాయలసీమ, ఇన్‌చార్జి క్లస్టర్‌ వర్శిటీ

రిజిస్ట్రార్‌లుగా స్థానికులకు అవకాశాలు కల్పించాలి

రిజిస్ట్రార్‌లుగా స్థానికంగా ఉన్న ప్రొఫెసర్లకు అవకాశాలు కల్పించాలి. నైపుణ్యం ఉన్న వారెందరో ఇక్కడి వర్శిటీల్లో ఉన్నారు. వారిని కాదని కింది స్థాయిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను రిజిస్ట్రార్‌లు నియమించడం వెనుక అంతర్యం బయట పెట్టాలి. స్థానికంగా ఉన్నఎందరో సీనియర్‌ ప్రొఫెసర్లకు అన్యాయం చేయడం మంచిది కాదు.

- భాస్కర్‌, రాష్ట్ర ఆధ్యక్షుడు, ప్రగతి శీల ప్రజా స్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎ్‌సయూ)

Updated Date - Apr 14 , 2025 | 12:13 AM