Maha Shivaratri: శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Feb 26 , 2025 | 07:03 AM
మహాశివరాత్రి వేడుకలకు శైవ క్షేత్రాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచే లక్షల సంఖ్యలో భక్తులు శ్రీగిరికి తరలి వస్తున్నారు. బుధవారం తెల్లవారు జామునుంచే భక్తులు ఆదిదంపతులను దర్శించుకుంటున్నారు.

నంద్యాల: మహా శివరాత్రి (Maha Shivaratri) పర్వదినం సందర్భంగా శ్రీశైలానికి (Srisailam) భక్తులు (Devotees) పోటెత్తారు. బుధవారం వేకువ జాము నుంచే శ్రీశైలంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉభయ దేవాలయాల్లో వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను భక్తులు దర్శించుకుంటున్నారు. పాతాళగంగలో భక్తులు పున్య స్నానాలు ఆచరించి.. క్యూ లైన్లలో నిలుచుని ఆది దంపతులను దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ అధికారులు శివ స్వాములకు ప్రత్యేక క్యూ లైన్‌లు ఏర్పాటు చేశారు. నల్లమల అడవుల్లో కాలినడకన వచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ఈ ఏడాది ప్రభుత్వం మల్లన్న భక్తులకు లడ్డూ ప్రసాదం, మంచినీరు, చిన్న పిల్లలకు పాలు అల్పాహారం ఉచితంగా పంపిణీ చేస్తోంది. రాత్రి పది గంటలకు పాగాలంకరణ, అర్ధరాత్రి శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల కల్యాణోత్సవం జరుగుతుంది. ఈ సందర్బంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ వార్త కూడా చదవండి..
తెలీదు.. మరిచిపోయా.. గుర్తులేదు..
శ్రీగిరికి తరలి వస్తున్న భక్తులు..
మహాశివరాత్రి వేడుకలకు శైవ క్షేత్రాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. మంగళవారం నుంచే లక్షల సంఖ్యలో భక్తులు శ్రీగిరికి తరలి వస్తున్నారు. బుధవారం జరిగే వేడుకలకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. వివిధ రకాల పూలు, విద్యుద్దీపాల అలంకరణతో ప్రధాన ఆలయం దేదీప్యమానంగా వెలుగుతోంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5:30 గంటలకు ప్రభోత్సవం, రాత్రి 7గంటలకు నందివాహన సేవ, రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అర్ధరాత్రి వేళ పాగాలంకరణ, స్వామిఅమ్మవార్లకు కల్యాణమహోత్సవం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
ఎంతో ప్రత్యేకం.. పాగాలంకరణ
మహాశివరాత్రి వేడుకల సందర్భంగా లింగోద్భవ కాలంలో జరిగే శ్రీశైలంలో పాగాలంకరణకు ఎంతో విశిష్టత ఉంది. ప్రకాశం జిల్లా హస్తినాపురానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు కుటుంబం మూడు తరాలుగా మల్లన్నకు పాగాను అలంకరిస్తోంది. ఏడాది పాటు దీక్షలో ఉండి రోజుకు ఒక మూర చొప్పున 365 రోజులు పాగా వస్త్రాన్ని పృథ్వీ కుటుంబం నేస్తుంది. కల్యాణోత్సవానికి ముందు వరుడు మల్లన్నకు తలపాగా చుట్టే తీరు అద్భుతంగా ఉంటుంది. మహాశివరాత్రి రోజున చిమ్మ చీకట్లో దిగంబరులుగా మారి స్వామివారి గర్భాలయ విమాన కలశాలు, నవ నందులను కలుపుతూ పాగాను అలంకరిస్తారు.
శ్రీకాళహస్తిలో...
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో బుధవారం జరిగే మహాశివరాత్రి వేడులకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు ఇబ్బంది పడకుండా తాగునీరు, బిస్కెట్లు అందించనున్నారు. తొలిసారిగా ఉచిత ప్రసాదాలు పంపిణీ చేయనున్నారు. ఇక, ప్రభుత్వం తరపున దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మంగళవారం జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్, ఆలయ ఈవో బాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కోటప్పకొండలో ప్రభల సంబరం
మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లు బుధవారం కనులపండువగా జరుగుతోంది. దేశ నలుమూలల నుంచి పది లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తున్నారు. తిరునాళ్లకు రాష్ట్ర పండుగ హోదా కల్పించిన నేపథ్యంలో ప్రభుత్వం తరపున స్వామికి దేవదాయ మంత్రి ఆనం పట్టువస్త్రాలను సమర్పిస్తారు. పోలీసు శాఖ బందోబస్తుకు ఏర్పాట్లు చేసింది. నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ నుంచి ఆర్టీసీ 550 ప్రత్యేక బస్సులను నడపుతోంది. బుధవారం తెల్లవారుజాము 2గంటలకు బిందె తీర్థంతో స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి దర్శనానికి భక్తులకు అనుమతిచ్చారు. 19 భారీ విద్యుత్ ప్రభలు తిరునాళ్లలో కాంతులీననున్నాయి. కోటప్పకొండ దిగువన, దేవస్థాన ప్రాంగణమంతా విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా ముస్తాబు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రిజిస్ర్టేషన్ల శాఖ డీఐజీ కిరణ్ సస్పెన్షన్
తెలుగు మీడియం చదివితే ఉద్యోగాలు వస్తాయా?
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News