Share News

‘గుండ్రేవుల’కు కదలిక

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:32 AM

రాయలసీమ రైతుల ప్రాణనాడి ‘గుండ్రేవుల జలాశయం’ నిర్మాణంపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

‘గుండ్రేవుల’కు కదలిక

కర్ణాటక, తెలంగాణ, కృష్ణా బోర్డుకు డీపీఆర్‌ పంపిన ప్రభుత్వం

వైసీపీ హయాంలో అటకెక్కిన వైనం

కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ కదలిక

ఉమ్మడి ప్రాజెక్టుకుగా 35 టీఎంసీలకు పెంచాలని తెలంగాణ ప్రతిపాదన

రెండు రాష్ట్రాలు చర్చలు జరిపితే కొలిక్కి వచ్చే అవకాశం

ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలి

రాయలసీమ రైతుల ప్రాణనాడి ‘గుండ్రేవుల జలాశయం’ నిర్మాణంపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వైసీపీ హయాంలో అంతర్రాష్ట్ర సమస్య అంటూ ఐదేళ్లు పూర్తిగా అటకెక్కించారు. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లి సభల్లో చర్చించారు. ఆ ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, మూడేళ్లలో చేపడుతామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జవాబు ఇచ్చారు. కర్ణాటక, తెలంగాణ, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) అభిప్రాయాలు తెలుసుకోవడానికి సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) పంపించారు. నివేదిక పరిశీలించిన తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టుకు చేపట్టడంతో పాటు 35 టీఎంసీలకు పెంచాలని ప్రతిపాదన చేసినట్లు సమాచారం. రెండు రాష్ట్రాలు చర్చలు జరిపితే ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని రాయలసీమ సాగునీటి నిపుణులు పేర్కొంటున్నారు. ఆ వివరాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

కర్నూలు, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో కర్నూలు- కడప (కేసీ) కాలువ పరిధిలో 2.65,628 ఎకరాల ఆయకట్టు ఉంది. తుంగభద్ర నది నుంచి 39.90 టీఎంసీలు నికర జలాలు కేడబ్ల్యూడీటీ-1 అవార్డు కేటాయింపులు చేశారు. అందులో 8 టీఎంసీలు ఎస్‌ఆర్‌బీసీ కాలువకు కేటాయించారు. మిగిలిన 31.90 టీఎంసీలు వాటాలో 10 టీఎంసీలు తుంగభద్ర డ్యాం నుంచి, 21.90 టీఎంసీలు నది ప్రవాహం నీటిని సుంకేసుల బ్యారేజీ నుంచి మళ్లించాలి. కోట్ల విజయభాస్కరరెడ్డి సుంకేసుల బ్యారేజీ సామర్థ్యం కేవలం 1.20 టీఎంసీలు మాత్రమే ఉంది. తుంగభద్రకు వరద రోజులు తగ్గిపోవడం, తుంగభద్ర డ్యాం నుంచి వాటా జలాలు విడుదల చేసినా.. తుంగభద్ర నదిలో దాదాపు 350 కిలో మీటర్లు ప్రవహించాల్సి రావడంతో సుంకేసుల బ్యారేజీకి 25 శాతం వాటా నీరు కూడా చేరడం లేదు. దీంతో కేసీ కాలువ చివరి ఆయకట్టు, కర్నూలు నగరంతో పాటు వివిధ గ్రామాలకు సాగు, తాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఈ కష్టాలకు చెక్‌ పెట్టి.. కష్టజీవుల కన్నీళ్లు తుడవాలనే లక్ష్యంతో రాయలసీమ సాగునీటి నిపుణుడు, రిటైర్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు సుబ్బరాయుడు సుంకేసుల బ్యారేజీ ఎగువన తుంగభద్రపై 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవులు గ్రామ సమీపంలో అదనపు రిజర్వాయర్‌ (గుండ్రేవుల) నిర్మాణానికి ప్రతిపాదించారు. ఉమ్మడి రాష్ట్రం చివరి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సర్వేకు నిధులు ఇవ్వడం, ఆ వెంటనే హైదరాబాద్‌కు చెందిన ఆర్వే సంస్థ నది ఇరువైపుల ఏపీ, తెలంగాణ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో సర్వే చేసి రూ.2,890 కోట్లకు సవివర ప్రాజెక్టు రిపోర్ట్‌ (డీపీఆర్‌) ఇచ్చారు. ఈ ప్రాజెక్టు నిర్మిస్తే కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో కేసీ ఆయకట్టుకు సాగునీరు, కర్నూలు నగరానికి తాగునీటి పాటు జలాశయం ఎగువన కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలో గురురాఘవేంద్ర, పులికనుమ ఎత్తిపోతల పథకాల ద్వారా తాగు, సాగునీరు అందే అవకాశం ఉంది.

గత టీడీపీ ప్రభుత్వంలో రూ.2,980 కోట్లు మంజూరు

రాష్ట్ర విభజన తరువాత అధికారం చేపట్టిన సీఎం చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ ప్రభుత్వం మొదట్లో గుండ్రేవుల జలాశయంపై దృష్టి సారించలేదు. ఈ ప్రాజెక్టు కోసం రాయలసీమ సాగునీటి సమితి ఆధ్వర్యంలో రైతులు నిరసనలు, కర్నూలు నుంచి గుండ్రేవులకు పాదయాత్ర చేశారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. అదే సమయంలో కాంగ్రెస్‌ నుంచి టీడీపీలో చేరిన ప్రస్తుత డోన్‌ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి గుండ్రేవుల మంజూరు చేయాలనే షరతు పెట్టారు. 2019 ఫిబ్రవరి 21న రూ.2,890 కోట్లు మంజూరు చేస్తూ నాటి టీడీపీ ప్రభుత్వం జీవో ఆర్‌టీ నం.154 జారీ చేయడమే కాకుండా కోడుమూరు పర్యటనలో సీఎం చంద్రబాబు నిధులు మంజూరు శిలాఫలకం వేశారు. ఎట్టకేలకు గుండ్రేవుల జలాశయానికి తొలి అడుగు పడింది.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2019 ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసిన జగన్‌ గుండ్రేవుల జలాశయం నిర్మిస్తా మని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ముఖ్యమంత్రిగా జగన్‌ బాధ్యతలు చేపట్టారు. అదే క్రమంలో తెలంగాణలో జగన్‌కు సన్నిహితంగా ఉన్న కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలో ఉండడడంతో గుండ్రేవులపై సీమ రైతులకు ఆశలు రెట్టింపు అయ్యాయి. అయితే.. తెలంగాణతో కనీసం చర్చలు జరపకపోగా ఇది అంతర్రాష్ట్ర సమస్య అంటూ జగన్‌ ప్రభుత్వం అటకెక్కించారు. వైసీపీ హయాంలో ఐదేళ్ల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది.

రైతుల్లో చిగురించిన ఆశలు

కూటమి ప్రభుత్వం రావడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో గుండ్రేవుల జలాశయం నిర్మించి కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల రైతుల కన్నీళ్లు తుడవాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ఏకరువు పెట్టారు. సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. మూడేళ్లలో ప్రాజెక్టు చేపడుతామని అసెంబ్లీ సాక్షిగా జిల్లా ఇన్‌చార్జి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టమైన హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టుపై తమ అభిప్రాయాలు చెప్పాలని కోరుతూ సవివర ప్రాజెక్టు రిపోర్టును కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు, కేఆర్‌ఎంబీలకు పంపించారు. కదలిక రావడంతో సీమ రైతుల్లో ఆశలు రెట్టింపయ్యాయి. కాగా.. వైసీపీ హయాంలో ఐదేళ్లు నిర్లక్ష్యం కారణంగా నిర్మాణం అంచనా వ్యయం రూ.5,500 కోట్లకు పైగా చేరిందని ఇంజనీర్లు తెలిపారు.

35 టీఎంసీలకు పెంచాలని తెలంగాణ ప్రతిపాదన

తమ రాష్ట్రం పరిధిలో ముంపునకు గురయ్యే భూములు పరిహారంపై స్పష్టత ఇవ్వాలని, ప్రాజెక్టుపై ఎలాంటి అభ్యంతరం లేదని కర్ణాటక వివరించినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రం మాత్రం గుండ్రేవులను ఉమ్మడి ప్రాజెక్టుగా చేపట్టి, సామర్థ్యం 35 టీఎంసీలకు పెంచి.. 20 టీఎంసీలు ఏపీ, 15 టీఎంసీలు తెలంగాణలోని ఆర్డీఎస్‌ ఉడమ కాలువ ఆయకట్టుకు ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. అధికారికంగా ఏపీ ప్రభుత్వానికి నివేదిక పంపాల్సి ఉంది. అయితే.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్చలు జరపడం ద్వారా ఈ ప్రాజెక్టు నిర్మాణం ఓ కొలిక్కి వస్తుందని సాగునీటి నిపుణులు అంటున్నారు. కాగా.. సామర్థ్యం 35 టీఎంసీలకు పెంచడం సాధ్యమేనా..? అనే చర్చ జరుగుతోంది.

గుండ్రేవుల జలాశయం 20 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తే ముంపునకు గురయ్యే గ్రామాలు, భూములు (హెక్టార్లల్లో) వివరాలు

వివరాలు ఏపీ తెలంగాణ

ప్రభుత్వ భూములు 1,720.40 924.70

ప్రైవేటు భూములు 4,445.74 2,078.54

మొత్తం భూములు 6,166.15 3,003.24

ముంపు గ్రామాలు 8 3

పాక్షికంగా ముంపు గ్రామాలు 4 2

Updated Date - Apr 16 , 2025 | 12:32 AM