మౌలిక సదుపాయాలు కల్పించండి
ABN , Publish Date - Apr 13 , 2025 | 11:40 PM
ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అధికారులను ఆదేశించారు.

ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో మంత్రి ఫరూక్
నంద్యాల హాస్పిటల్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు చేసేందుకు వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. అత్యవసర వైద్యసేవలు అందించేందుకు క్రిటికల్ కేర్ యూనిట్ ఎంతగానో ఉపయోగపడుతుందని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. గతంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించేందుకు ఆమోదించామన్నారు. కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు అవసరమైన పరికరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్యలోపం, టాయ్‌లెట్‌ల నిర్వహణ లేకపోవడం, తాగునీటి సమస్య, పరికరాలు ఉన్నా టెక్నీషియన్‌లు లేకపోవడం తదితర లోపాలు ఉన్నట్లు ఆసుపత్రి డెవలప్‌మెంట్ సభ్యులు కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో సమకూర్చాలని జీజీహెచ్ సూపరింటిండెంట్‌ను ఆదేశించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు శ్రీదేవి, శ్రీరామమూర్తి, శివశంకర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీదేవి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి. డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.