నేడు అమీతుమీ
ABN , Publish Date - Apr 16 , 2025 | 12:29 AM
మున్సిపల్ కౌన్సిల్ చైర్ పర్సన్ వాల్మీకి శాంత భవిష్యత్తు నేడు తేలనుంది. వైసీపీ కౌన్సిలర్లు తమ పార్టీకే చెందిన చైర్ పర్సన్ శాంతపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు.

మున్సిపల్ కౌన్సిల్ చైర్ పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం
ఆదోని/ టౌన్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి) : మున్సిపల్ కౌన్సిల్ చైర్ పర్సన్ వాల్మీకి శాంత భవిష్యత్తు నేడు తేలనుంది. వైసీపీ కౌన్సిలర్లు తమ పార్టీకే చెందిన చైర్ పర్సన్ శాంతపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు. బుధవారం సబ్ కలెక్టర్ సమక్షంలో ఎవరికీ ఏ మేరకు కౌన్సిలర్ల మద్దతు ఉందో తేలనుంది.
వైసీపీకే ఆధిక్యం
కౌన్సిల్‌లో మొత్తం 42మంది కౌన్సిలర్లలో ఒకరు టీడీపీ అభ్యర్థి కాగా, 40 మంది వైసీపీ, ఒకరు ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నా రు. అందులో ఒక మహిళా కౌన్సిలర్ ఇటీవల మరణించగా, ఐదుగురు కౌన్సిలర్లు వైసీపీపై అసంతృప్తితో సార్వత్రిక ఎన్నికల అనంతరం బీజేపీకి మద్దతుదారులుగా కొనసాగుతున్నారు. వీరిలో ఒక కౌన్సిలర్ వసీం బల పరీక్షకు ఒక రోజు ముందు హఠాత్తుగా తిరిగి వైసీపీ గూటికి చేరుకున్నారు.
స్పందించని వైసీపీ అధిష్ఠానం
తన తప్పేమీ లేకపోయినా, అవినీతి ఆరోపణలు రాకున్నా తనపై అవిశ్వాస తీర్మానం ప్రకటించడంపై జగన్నా.. న్యాయం చెప్పన్నా.. అంటూ బ్యానర్ తగిలించుకొని చైర్‌పర్సన్ శాంత రోడ్డుపై 15 రోజుల పాటు నిరసన దీక్ష చేసినా పార్టీ అధిష్ఠానం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీనితో అవిశ్వాస తీర్మానానికి రెండు రోజుల ముందు పట్టణం లోని ప్రధాన కూడళ్లలో బీజేపీతో పాటు ఆ పార్టీకు మద్దతుగా ఉన్న కౌన్సిలరులు వీధి సమావేశాలు నిర్వహించి శాంతకు జరుగు తున్న అన్యాయం గురించి ప్రజలకు వివరించారు.
రెండోసారి అవిశ్వాసం
రాష్ట్రంలోనే 160 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ మున్సిపాలిటీలో కౌన్సిల్ చైర్ పర్సన్‌పై అవి శ్వాస తీర్మానం ప్రతిపా దించడం ఇది రెండోసారి. 40 సంవత్సరాల క్రితం చైర్ పర్సన్‌గా ఉన్న విట్టా కిష్టప్పపై మొదటిసారిగా రాచోటి రామయ్య (మాజీ ఎమ్మెల్యే) గ్రూప్ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు. అప్పటి పారిశ్రామిక కుటుంబం టీజీ గ్రూప్ వారి మద్దతుతో అవిశ్వాస తీర్మానం విగిపోయి విట్టా కిష్టప్పనే చైర్మన్‌గా కొనసాగారు.
కౌన్సిలర్లకు విప్ జారీ
కౌన్సిలరులు చేజారి పోకుండా వైసీపీ అధిష్టానం తమ కౌన్సిలర్లకు విప్ జారీ చేసింది. కౌన్సిలర్ వైజీ బాలాజీ వైసీపీ కౌన్సిలరులు అందరికీ స్వయంగా విప్ కాగితాలను అందించారు. బీజేపీకు మద్దతుగా ఉన్న తమ పార్టీకి చెందిన కొందరు కౌన్సిలరులు అందుబాటులో లేకపోవడంతో వారి ఇంటి గోడలకు వాటిని అంటించారు. ఆదోని మున్సిపాలిటీలో రెండోసారి జరగనున్న అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన చర్చలు సర్వత్రా ఉత్కంఠం రేకెత్తిస్తున్నాయి.