Share News

ఉత్తమ విలువలతో జీవితం సాగించాలి

ABN , Publish Date - Apr 01 , 2025 | 12:49 AM

ప్రతి ముస్లిం ఉపవాసి మాదిరిగానే ఉత్తమ నైతిక విలువలతో జీవితం కొనసాగించాలని మత పెద్దలు మౌలానా మొహమ్మద్‌ అజీజ్‌ ఉద్దిన్‌ సిద్దిఖీ పేర్కొన్నారు.

ఉత్తమ విలువలతో జీవితం సాగించాలి

లబ్బీపేట, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ప్రతి ముస్లిం ఉపవాసి మాదిరిగానే ఉత్తమ నైతిక విలువలతో జీవితం కొనసాగించాలని మత పెద్దలు మౌలానా మొహమ్మద్‌ అజీజ్‌ ఉద్దిన్‌ సిద్దిఖీ పేర్కొన్నారు. రంజాన్‌ పండుగ సందర్బంగా ఇందిరాగాందీ స్టేడియంలో సోమవారం ఉదయం ఈద్‌ కమిటీ ఆధ్వర్యంలో ఈద్‌ నమాజ్‌ నిర్వహించారు. పవిత్ర రంజాన్‌ పురస్కరించుకుని ముస్లిం సోదరులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్‌ నెలంతా ఎంతో నిష్టతో పరిశుద్ధ నైతిక జీవితం గడుపుతాడో అలాగే మిగిలిన 11 నెలలు సైతం అదే జీవితాన్ని గడపాలన్నారు. ఇతరులతో చెడుగా ప్రవర్తించకుండా, మాట్లాడకుండా నైతిక విలువలతో కూడిన జీవితం గడిపేవాడే ముస్లిం అని అన్నారు. ఈ సందర్బంగా ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు పిలుపుతో ముస్లింలు నల్లరిబ్బన్లు ధరించి పాల్గొన్నారు. నాగుల్‌ మీరా, దేవినేని అవినాష్‌ పాల్గొన్నారు.

సర్వమత సౌభ్రాతృత్వానికి ప్రతీక: అహ్మద్‌

చిట్టినగర్‌: సర్వమత సౌభ్రాతృత్వానికి ప్రతీక రంజాన్‌ అని మోతీ మస్జీద్‌ ఇమామ్‌ నజీర్‌ అహ్మద్‌ తెలిపారు. రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం చిట్టినగర్‌ మోతీమస్జీద్‌, అల్లీనగర్‌ మసీదులో వేలసంఖ్యలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఇమామ్‌ నజీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ ఇస్లాం ధర్మం సర్వమత సౌభ్రాతృత్వాన్ని, శాంతిని ప్రబోధిస్తోందన్నారు. ప్రపంచశాంతి కోసం ప్రతి ఒక్కరూ తోడ్పడాలన్నారు. ఇస్ల్లాం ప్రబోధాలు సర్వమానవాళికి మార్గదర్శకమన్నారు. రంజాన్‌ మాసంలో మాత్రమే దీక్షగా ఉంటే సరిపోదని, ప్రతిరోజు ఐదు పూటల నమాజ్‌ చేయాలని సూచించారు. అనంతరం ఒకర్నొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలువురు ముస్లిం సోదరులు వక్ఫ్‌బోర్డు జీవోలను వ్యతిరేకిస్తూ నల్ల రిబ్బన్‌లు చేతికి కట్టుకొని ప్రార్థనలో పాల్గొన్నారు.

రంజాన్‌ తోఫా పంపిణీ

రంజాన్‌సందర్భంగా బీజేపీ జిల్లా కోశాధికారి అవ్వారు బుల్లబ్బాయి ఆధ్వర్యంలో సోమవారం అప్పికట్ల జోషఫ్‌ వీధి బుల్లబ్బాయి ఇంటి వద్ద ముస్లిం సోదరులకు రంజాన్‌ తోఫా పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్‌ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి నాయకత్వంలో రాష్ట్రం పురోగమిస్తుందన్నారు. అవ్వారు బుల్లబ్బాయి మాట్లాడుతూ సుజనా ఫౌండేషన్‌ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు రంజాన్‌తోఫాను పంపిణీ చేసినట్టు తెలిపారు. బీజేపీ జిల్లా కార్యదర్శి ఉమాకాంత్‌, మండలాధ్యక్షుడు దేవిన హరిప్రసాద్‌, కార్యదర్శి మరడాన జోజిబాబు, షాహిర, సుమయ్య, నమ్మి భానుప్రకాష్‌ యాదవ్‌, సాదిక్‌ పాల్గొన్నారు.

56వ డివిజన్‌లో..

పాత రాజరాజేశ్వరిపేట: రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని 56వ డివిజన్‌లో రంజాన్‌ కిట్ల పంపిణీ సోమవారం జరిగింది. బీజేపీ మండలాధ్యక్షుడు మాగులూరి లావిన్‌బాబు, సెక్రటరీ నున్న కృష్ణ 100 మందికి రంజాన్‌ కిట్లను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎంఎస్‌ బేగ్‌కు సత్కారం

రంజాన్‌ పండుగ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్‌ బేగ్‌ను ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గ వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ధనేకుల వెంకట హరికృష్ణ సోమవారం ఆయన నివాసంలో కలిసి దుశాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఎంఎస్‌ బేగ్‌ భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్‌ జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు బబ్బూరి శ్రీనివాస్‌, పార్టీ నేతలు మక్కిన భాస్కర్‌, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

సామరస్యానికి, స్నేహానికి ప్రతీక

వన్‌టౌన్‌: శాంతి, సామరస్యం, స్నేహానికి రంజాన్‌ ప్రతీక అని పలువురు ముస్లిం మత పెద్దలు అన్నారు. సోమవారం రంజాన్‌ పండుగను పురస్కరించుకుని వన్‌టౌన్‌లోని గాంధీజీ హైస్కూల్‌ ప్రాంగణంలో వన్‌టౌన్‌ హమీద్‌ స్ర్టీట్‌లోని మార్కస్‌ మసీదు కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈ సందర్భంగా పలువురు ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ అల్లాహ్‌ సూచించిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. టీడీపీ నేతలు ఎంఎస్‌ బేగ్‌, కమిటీ ప్రెసిడెంట్‌ ఇసుబ్‌ ఖాన్‌తో పాటు కమిటీ సభ్యులు, పెద్ద ఎత్తున ముస్లిం సోదర, సోదరీమణులు పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. కాగా, వించిపేట, విద్యాధరపురం, భవానీపురం ప్రాంతాల్లో జరిగిన ప్రార్థనల్లో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొని ఒకరికొకరు రంజాన్‌ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

క్రమశిక్షణ, దాతృత్వం, ఆధ్యాత్మిక చింతనే రంజాన్‌: ఎమ్మెల్యే ఉమా

పాయకాపురం: క్రమశిక్షణ, దాతృత్వం, ఆధ్యాత్మిక చింతనల కలయికే రంజాన్‌ పండుగ అని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. పాయకాపురం, అజిత్‌సింగ్‌నగర్‌లలోని పలు మసీదుల్లో జరిగిన రంజాన్‌ ఈదుల్‌ ఫితర్‌ నమాజ్‌లలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ పవిత్ర గ్రంఽథం ఖురాన్‌ ఆవిర్భవించిన మాసం రంజాన్‌ అని, ఈ రోజును ఆనందోత్సాహాలతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అనంతరం రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.

Updated Date - Apr 01 , 2025 | 12:49 AM