Adilabad Airport: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టుకు భారత వాయుసేన గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Apr 03 , 2025 | 05:58 AM
రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలో నిర్మించతలపెట్టిన విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది.

తెలంగాణ ప్రభుత్వానికి లేఖ
ప్రధానికి కోమటిరెడ్డి కృతజ్ఞతలు
హైదరాబాద్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలో నిర్మించతలపెట్టిన విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి భారత వాయుసేన(ఇండియన్ ఎయిర్‌ఫోర్స్) మంగళవారం లేఖను పంపింది. ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయాన్ని నిర్మించేందుకు అనుమతులు ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం 2024 డిసెంబరు 18న భారత వాయుసేనకు లేఖ రాసింది. దానిపై పరిశీలన జరిపిన వాయుసేన తాజాగా విమానాశ్రయ నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. విమానాశ్రయంతో పాటు ఎయిర్‌ఫోర్స్ విమానాల రాకపోకలకు అనుగుణంగా ఒక జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. పౌర విమానాల రాకపోకలకు అనువుగా రన్‌వేను నిర్మించడం, టెర్మినల్ ఏర్పాటు, ఎయిర్‌క్రాఫ్ట్ (విమానాల పార్కింగ్, ఇతర విమానయాన కార్యకలాపాలకు ఉపయోగించే నిర్ధిష్ట ప్రాంతం) వంటి మౌలిక వసతులను కల్పించాలని లేఖలో పేర్కొంది. కాగా ఇప్పటికే వరంగల్ జిల్లాలోని మామునూరులో విమానాశ్రయానికి ఇటీవలే కేంద్రం అనుమతినివ్వగా, తాజాగా మరో ఎయిర్‌పోర్టుకు అనుమతినిచ్చింది.
ప్రభుత్వ కృషికి దక్కిన ఫలితం..
‘‘ఆదిలాబాద్‌లో విమానాశ్రయ నిర్మాణానికి భారత వాయుసేన నుంచి అనుమతులు సాధించడం ఆనందంగా ఉంది. ఆదిలాబాద్‌లో భవిష్యత్తులో వాయుసేన శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పేందుకు కృషి చేస్తాం. తెలంగాణలో విమానాశ్రయాల నిర్మాణానికి సహకరిస్తున్న ప్రధాని మోదీ, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడుకు, రాష్ట్రంలో ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు అండగా నిలబడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు.’’
- ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి