Share News

బంగారు బందరే మన లక్ష్యం

ABN , Publish Date - Apr 14 , 2025 | 12:47 AM

జిల్లా కేంద్రంగా దశాబ్దాల చరిత్ర కలిగిన బందరు నగరం అభివృద్ధిలో మాత్రం ఇంకా వెనుకబడే ఉంది. విస్తారమైన తీర ప్రాంతం ఉన్నా ఎటువంటి ప్రయోజనం లేకుండాపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో బందరు అభివృద్ధే లక్ష్యంగా మంత్రి కొల్లు రవీంద్ర అడుగులు ముందుకు వేస్తున్నారు. బంగారు బందరు కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. 2026 డిసెంబరు నాటికి పోర్టు పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. సముద్ర అలల ఉధృతిని తగ్గించి, పర్యాటకులను ఆకర్షించేందుకు బీచ్‌లో రక్షణ గోడ, రూ.50 కోట్లతో మల్టీపర్పస్‌ స్టేడియం, 300 ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటు, రూ.164 కోట్లతో డ్రెయిన్ల పునరుద్ధరణ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మే 15 నుంచి 18 వరకు భారీ స్థాయిలో మంగినపూడి బీచ్‌లో బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహించనున్నారు. అన్నిరంగాల్లో బందరు నగరం అభివృద్ధి సాధించడానికి అవసరమైన సలహాలు, సూచనలు తీసుకోవడానికి నగర ప్రముఖులతో సమావేశమయ్యారు. బంగారు బందరే మన లక్ష్యమని ప్రకటించారు.

బంగారు బందరే మన లక్ష్యం

- 2026 డిసెంబరు నాటికి పోర్టు పనులు పూర్తి

- సముద్ర అలల ఉధృతిని తగ్గించేందుకు బీచ్‌లో రక్షణగోడ

- రూ. 50 కోట్లతో మల్టీపర్పస్‌ స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు

- గిలకలదిండి-కరగ్రహారం మధ్య 300 ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటు

- సీఎం దృష్టికి రూ.164 కోట్లతో డ్రెయిన్‌ల పునరుద్ధరణ పనులు

- మే 15 నుంచి 18 వరకు మంగినపూడి బీచ్‌లో బీచ్‌ ఫెస్టివల్‌

- యువతకు ఉపాధే లక్ష్యంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు

- సీఆర్‌డీఏ పరిధిలోకి జిల్లాలోని అన్ని ప్రాంతాలను చేర్చేందుకు ప్రతిపాదన

- బందరు అభివృద్ధి ప్రణాళిక వెల్లడించిన మంత్రి కొల్లు రవీంద్ర

- ‘బంగారు బందరు సాకారం’పై నగర ప్రముఖులు, అధికారులతో ఆత్మీయ సమావేశం

- అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి

జిల్లా కేంద్రంగా దశాబ్దాల చరిత్ర కలిగిన బందరు నగరం అభివృద్ధిలో మాత్రం ఇంకా వెనుకబడే ఉంది. విస్తారమైన తీర ప్రాంతం ఉన్నా ఎటువంటి ప్రయోజనం లేకుండాపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో బందరు అభివృద్ధే లక్ష్యంగా మంత్రి కొల్లు రవీంద్ర అడుగులు ముందుకు వేస్తున్నారు. బంగారు బందరు కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. 2026 డిసెంబరు నాటికి పోర్టు పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. సముద్ర అలల ఉధృతిని తగ్గించి, పర్యాటకులను ఆకర్షించేందుకు బీచ్‌లో రక్షణ గోడ, రూ.50 కోట్లతో మల్టీపర్పస్‌ స్టేడియం, 300 ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటు, రూ.164 కోట్లతో డ్రెయిన్ల పునరుద్ధరణ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మే 15 నుంచి 18 వరకు భారీ స్థాయిలో మంగినపూడి బీచ్‌లో బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహించనున్నారు. అన్నిరంగాల్లో బందరు నగరం అభివృద్ధి సాధించడానికి అవసరమైన సలహాలు, సూచనలు తీసుకోవడానికి నగర ప్రముఖులతో సమావేశమయ్యారు. బంగారు బందరే మన లక్ష్యమని ప్రకటించారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

బంగారు బందరు రూపకల్పనకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామని, ప్రతి ఒక్కరూ తమ తమ వంతు సహకారం అందించాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. ‘బంగారు బందరు సాకారం’ అనే కార్యక్రమంపై జడ్పీ కన్వెన్షన్‌హాలులో నగర ప్రముఖులు, అధికారులతో ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బందరు అభివృద్ధి కోసం రూపొందించిన ప్రణాళికలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా మంత్రి వివరించారు. జిల్లా కేంద్రంగా ఉన్న బందరు కాలక్రమంలో కొంత మేర నిర్లక్ష్యానికి గురైందని తెలిపారు. ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో విద్య, వైద్యం, ఉపాధి రంగాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించామన్నారు. బందరు అభివృద్ధిని కాంక్షించేవారు మరిన్ని సలహాలు, సూచనలు అందించి నగర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. సీఆర్‌డీఏ పరిధిలోకి జిల్లాలోని అన్ని ప్రాంతాలను కలపాలని సీఎం చంద్రబాబు వద్ద ప్రతిపాదన పెట్టినట్లు మంత్రి వివరించారు. మరిన్ని వివరాలు మంత్రి మాటల్లో..

అభివృద్ధి ప్రణాళిక ఇలా..

డిసెంబరు 2026 నాటికి బందరు పోర్టు పనులను పూర్తి చేసి ఇక్కడి నుంచి ఎగుమతులు, దిగుమతులు ప్రారంభిస్తారు. పోర్టు ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేస్తే జిల్లాకు చెందిన యువతకు ఇక్కడే ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి సహకారంతో మచిలీపట్నం-రేపల్లె మధ్య రైలు మార్గాన్ని కలుపుతారు. రాష్ట్రంలోనే మంగినపూడి బీచ్‌ అత్యంత సురక్షితమైనది. పర్యాటకులను ఆకర్షించేందుకు, బీచ్‌లో సముద్రపు అలల ఉధృతిని తగ్గించేందుకు రక్షణ గోడ నిర్మించనున్నారు. గోసంఘం వద్ద 13 ఎకరాల్లో స్విమ్మింగ్‌పూల్‌, అథ్లెటిక్‌ ట్రాక్‌, ఇతర క్రీడల కోసం రూ.50 కోట్ల అంచనాలతో మల్టీపర్సస్‌ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికను రూపొందించారు. గిలకలదిండి-కరగ్రహారం గ్రామాల మధ్య 300 ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా అనుబంధ పరిశ్రమలు, రోల్డ్‌గోల్డ్‌ నగల తయారీ, పడవల తయారీ, కలంకారీ తదితర సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు చేసే అలోచన చేస్తున్నారు. బందరు కోట, గరాలదిబ్బ, పోలాటి తిప్పలను కలుపుతూ వంతెనలు నిర్మించేందుకు ప్రణాళికను రూపొందించారు.

రూ.164 కోట్లతో డ్రెయిన్‌ల పునరుద్ధరణ

నగరంలో డ్రెయిన్‌ల పునరుద్ధరణకు రూ.164 కోట్ల అంచనాలు రూపొందించారు. ఈ నిధుల విడుదలపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి, సాఽధ్యమైనంత త్వరగా నిఽధులు తెచ్చి డ్రెయున్‌లను పూర్తిస్థాయిలో నిర్మాణం చేయనున్నారు. నగరంలో డ్రెయిన్‌లకు సంబంధించి లింక్‌లను కలిపేందుకు రూ.13 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించారు. నగరంలో పశువుల సంచారాన్ని నిలువరించేందుకు మంగినపూడి బీచ్‌ ప్రాంతంలో 10 ఎకరాల భూమిని కేటాయించారు. రోడ్లపై తిరిగే పశువులను అక్కడకు తరలిస్తారు. నగరంలో రోజుకు 90 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. ఈ చెత్తను గుంటూరు జిల్లాలోని పవర్‌ ప్రాజెక్టుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరు 2వ తేదీ నాటికి మచిలీపట్నం డ ంపింగ్‌ యార్డును అందమైన పార్కుగా రూపొందించనున్నారు. మే 15 నుంచి 18వ తేదీ వరకు మంగినపూడి బీచ్‌లో బీచ్‌ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లాలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు తెలిపారు. బందరు పోర్టును ఉద్యమాలు చేసి సాధించుకున్నామని, పోర్టు పనులు పూర్తయితే, పోర్టుకు అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు అవుతాయన్నారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ద్వారా యువతకు తగుశిక్షణ ఇప్పించి ఇక్కడే ఉద్యోగులు ఇస్తామని తెలిపారు. కలెక్టర్‌ బాలాజీ మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈ, ఏపీఐఐసీ ద్వారా జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికను రూపొందించామన్నారు. ముడా చైర్మన్‌ మట్టా ప్రసాద్‌ మాట్లాడుతూ మచిలీపట్నంలో ప్రయోగాత్మకంగా రోబో టెక్నాలజీతో పనిచేసే గోడౌన్‌లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్‌ మాట్లాడుతూ 216-ఎ జాతీయ రహదారి పోరాటాల ద్వారానే సాధించుకున్నామని, ముందు చూపుగల ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో జిల్లా అన్ని రంగాల్లో ముందంజలో నడుస్తుందని తెలిపారు. టీడీపీ, జనసేన నాయకులు బండి రామకృష్ణ, మాదివాడ రాము, గొర్రెపాటి గోపీచంద్‌, మోటమర్రి బాబాప్రసాద్‌, కాగిత వెంకటేశ్వరరావు, గోపు సత్యనారాయణ, పలువురు పురప్రముఖులు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2025 | 12:48 AM