Share News

Pawan Kalyan: నిలిచి గెలిచాం!

ABN , Publish Date - Mar 15 , 2025 | 03:59 AM

దేశమంతా తలతిప్పి తిరిగి చూసేలా వంద శాతం స్టైక్‌రేట్‌తో ఘన విజయం సాధించాం. ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలబెట్టాం. ఈ రోజు జయకేతనం ఎగరేస్తున్నాం’ అని జనసేన అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కాకినాడ జిల్లా పిఠాపురం చిత్రాడలో నిర్వహించిన ‘జయకేతనం’ సభలో ఆయన ప్రసంగించారు. తొలుత తమిళంలో ప్రసంగం మొదలుపెట్టారు.

Pawan Kalyan: నిలిచి గెలిచాం!

అసెంబ్లీ గేటును కూడా తాకలేవని సవాల్‌ చేశారు

చరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం: పవన్‌ కల్యాణ్‌

100% స్ట్రైక్‌ రేటుతో ఘన విజయం సాధించాం

నిలబడ్డాం.. 4 దశాబ్దాలటీడీపీని నిలబెట్టాం

21 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో, ఇద్దరు ఎంపీలతో పార్లమెంటులో అడుగుపెట్టాం

ఇప్పుడు జయకేతనం ఎగరేస్తున్నాం.. వైసీపీ వాళ్లు మళ్లీ వస్తే తప్పు మనదే అవుతుంది

రాజకీయాల్లోకి వచ్చి వేల కోట్లు సంపాదన.. ఆ డబ్బు కోసం అన్నాచెల్లెళ్లు కొట్టుకుంటే

మనకు సమస్య ఎలా అవుతుంది?.. జనసేనకు తెలంగాణ జన్మస్థలం.. ఆంధ్ర కర్మ స్థానం

అసెంబ్లీ గేటును కూడా తాకలేవని మనల్ని చాలెంజ్‌ చేసి.. చరిచిన ఆ తొడల్ని బద్దలుకొట్టాం.. అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలు, పార్లమెంటులో ఇద్దరు ఎంపీలతో అడుగుపెట్టాం. దేశమంతా తలతిప్పి తిరిగి చూసేలా వంద శాతం స్ర్టైక్‌రేట్‌తో ఘన విజయం సాధించాం. ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలబెట్టాం. ఈ రోజు జయకేతనం ఎగరేస్తున్నాం.

- పవన్‌ కల్యాణ్‌

అమరావతి, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ‘అసెంబ్లీ గేటును కూడా తాకలేవని మనల్ని చాలెంజ్‌ చేసి.. చరచిన ఆ తొడల్ని బద్దలుకొట్టాం.. అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలు, పార్లమెంటులో ఇద్దరు ఎంపీలతో అడుగుపెట్టాం. దేశమంతా తలతిప్పి తిరిగి చూసేలా వంద శాతం స్టైక్‌రేట్‌తో ఘన విజయం సాధించాం. ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలబెట్టాం. ఈ రోజు జయకేతనం ఎగరేస్తున్నాం’ అని జనసేన అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కాకినాడ జిల్లా పిఠాపురం చిత్రాడలో నిర్వహించిన ‘జయకేతనం’ సభలో ఆయన ప్రసంగించారు. తొలుత తమిళంలో ప్రసంగం మొదలుపెట్టారు.

DSG.jpg

రాజకీయ వైరుధ్యాలు, భాషాయుద్ధాలు, జనసేన విజయాలు.. పలు అంశాలను స్పృశించారు.


‘భయం లేదు. భయం లేదు.. భయమన్నది లేనే లేదు. ఒక దుర్నీతి దుర్జన లోకమంతా ఎదురొచ్చినా భయం లేదు.. భయం లేదు కాబట్టే అసలే చీకటి.. గాఢాంధకారమైన వెళ్లే దారంతా గోతులు గుంతలు, లోయలు అగాధాలున్నా.. ఇళ్లేమో దూరమైనా... చేతిలో దీపం లేకపోయినా గుండె ధైర్యమే కవచంగా ధరించిన వాడిని గనుకే.. అన్నీ ఒక్కడినే అయి.. 2014లో జనసేన స్థాపించా. ఓటమి భయం లేదు కాబట్టి 2019లో పోటీ చేశాం. ఓడినా అడుగు ముందుకే వేశాం. మనం నిలబడ్డాం. పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకున్నాం.. నిలదొక్కుకోవడమే కాకుండా నాలుగు దశాబ్దాల టీడీపీ పార్టీని నిలబెట్టాం. మనం 2019లో ఓడినప్పుడు మీసాలు మెలేశారు.. జబ్బలు చరిచారు.. తొడలు కొట్టారు.. ఆడపడుచులను అవమానించారు..ప్రజలను నిరంతరం హింసించారు. ఇదేం న్యాయమని ప్రశ్నిస్తే గొంతెత్తితే వారిపై కేసులు పెట్టారు.. జైల్లో పెట్టారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అక్రమ కేసుల్లో బంఽధించారు. టీడీపీ కార్యకర్తలు, సీనియర్‌ నాయకులు రోడ్డు మీదకు రావాలంటేనే భయపడేలా చేశారు. ఇక నాలాంటి వాడిని తిట్టని తిట్టు లేదు. పాల్జేయని అవమానం లేదు.. చేయని కుట్ర లేదు.. వేయని కుతంత్రం లేదు’ అని అన్నారు. దేశం కోసం చనిపోవడానికి సంసిద్ధంగా ఉన్నాననన్నారు. ఇంకా ఏమన్నారంటే..

FDHB.jpg

నాపై రాతలు..

పవన్‌ కల్యాణ్‌ అవసరాలకు ఎలా పడితే అలా మార్చేస్తారని.. లెఫ్ట్‌, రైట్‌, సెంటర్‌ అంటూ మారిపోతున్నారని ఓ హిందీ పత్రికలో ప్రచురించారు. నేను చేగువేరాను ప్రేమిస్తా.. నారాయణగురును గౌరవిస్తా. నేను ఎలా పడితే అలా మార్చేస్తే ఏడు సినిమాలతో సూపర్‌ స్టార్‌ అవుతానా? 2007లో కామన్‌ మ్యాన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ పెట్టాను. అప్పుడు చేగువేరా, జయప్రకాశ్‌ నారాయణ, బాలగంగాధర్‌ తిలక్‌, మదర్‌ థెరిస్సా, భగత్‌సింగ్‌ను స్ఫూర్తిగా తీసుకున్నాను. నేను కాలేజీలు, యూనివర్సిటీలకు వెళ్లలేదు. కానీ జ్ఞానాన్ని సముపార్జించడాన్ని చిన్నప్పటి నుంచీ ఆపలేదు. నిత్యం నేర్చుకుంటూనే ఉన్నాను. చరిత్ర, సంస్కృతి, విదేశీ వ్యవహారాలు, ఫిలాసఫీ, సామాజిక, చారిత్రక, రాజకీయ అవగాహన లేకుండా ఎందుకు పార్టీ పెడతాను? దేశ విభజన, తిరుగుబాటు, విప్లవవీరుల గురించి చదవకుండా, అర్థం చేసుకోకుండా పార్టీ పెట్టేస్తామా? వీటి కోసం ప్రత్యేకంగా తెల్లగెడ్డం. సామాన్యుడికి అర్థం కాని లిటరేచర్‌తో మాట్లాడాలా?

మీరే నా బంధం.. అనుబంధం..

మీరే నా బంధం.. అనుబంధం, జనసేనాని రక్తసంబంధం.. మనందరికి కీలక కర్తవ్యం ఉంది. రాజకీయ ప్రస్థానంలో అలుపెరిగిన పోరాటం చేసిన తర్వాత లభించిన చరిత్రాత్మక విజయం ఇది. ఈ విజయం పసిబిడ్డ లాంటిది. ఈ బిడ్డను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బాధ్యతతో కాపాడుకోవాలి. అలా కాపాడుకోగలిగితే అదే పెద్దదై సమాజాన్ని కాపాడుతుంది. ఈ బిడ్డను మనందరం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. జనసేన సైనికులూ.. మీరు జాగ్రత్తగా, బాగుంటే మేమూ బాగుంటాం. మీరే మమ్మల్ని కూడా క్రమశిక్షణలో పెట్టాలి.


దాశరథి మాటల బలం..

భరత భూమి నేర్పిందో.. ప్రజా కోర్టు నేర్పిందో.. నిజమేమిటో కానీ ఒంటి చేత్తో శత్రువుపై దుమికే శక్తి ఉంది.. అని చెప్పిన దాశరథి కృష్ణమాచార్య మాట బలం తెలంగాణకే కాదు.. నెల్లూరులో చదువుకున్న నాకు కూడా ఉంది. అందుకే అలా జనసేన స్థలం తెలంగాణ అయింది. కర్మ స్థలం ఆంధ్రా అయింది. రుద్రవీణ వాయిస్తా.. అగ్నిధారలు కురిపిస్తా. తిరుగుబాటు జెండా పట్టిస్తా.. దుష్టపాలన నుంచి విముక్తి కల్పిస్తా అన్న కృష్ణమాచార్య మాటలు.. నాకే కాదు.. మబ్బుల్లో పరుగెత్తే పిడుగులు. వేట కోసం బయటకు వచ్చిన కొదమ సింహాల్లాంటి పార్టీ నాయకులు, కార్యకర్తలకు కూడా ఊతం ఇచ్చాయి. ఊతమివ్వడం వల్లనే 2024 ఎన్నికల్లో దాష్టీక ప్రభుత్వాన్ని దించి. ఎన్డీయేని గెలిపించారు. అందుకే మీ అందరికీ గుండెల లోతుల్లో నుంచి ధన్యవాదాలు. కోటి దివిటీల కాంతి జ్యోతి తెలంగాణకు కరెంటు షాక్‌ తగిలి చనిపోబోయిన నాకు కొండగట్టు ఆంజనేయుడి దయ.. తెలంగాణ అన్నదమ్ముల దీవెన నాకు పునర్జన్మనిచ్చింది.అలాంటి తెలంగాణ తల్లికి వందనాలు.

గద్దర్‌ నాకు అన్న..

బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి.. ఏ బండిలో పోతావు కొడుకో.. నైజాము సర్కరోడా. అని గాలికి గజ్జె కట్టి చేత కర్ర పట్టి.. ఆటనే, పాటనే ఆయధంగా మరిలిచిన వాడు యువత గుండెల్లోపోరాట స్ఫూర్తి నింపినవాడు. నేను కనిపిస్తే ఎలా ఉన్నావు తంబి అని అప్యాయంగా పలకరించే. మన మధ్య లేని నా అన్న నా గద్దరన్న నేల నుంచి వచ్చిన నా తెలంగాణ జనసైనికులు, నాయకులు, వీరమహిళలకు హృదయపూర్వక శుభాకాంక్షలు.


ఈ హోలీ యాదృచ్ఛికం కాదు..

కొణతాల రామకృష్ణ చెప్పినట్లు హోలీ పండుగ. హోలీ అంటే రంగులు, ఉత్సాహం, మైత్రిని పంచే పండుగ. చెడుపోయింది మంచి వచ్చిందని రంగులు జల్లుకునే పండుగ. మన జయకేతనం ఎగరవేసిన రోజునే హోలీ రావడం యాదృచ్ఛికం కాదు.. భగవంతుడి నిర్ణయం. అందుకే దేశ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు. జయకేతన సభకు తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఒడిశా నుంచీ వచ్చారు. నా సినిమాలను కాదు.. సిద్ధాంతాలను నమ్మి 400 మందికిపైగా చనిపోయారు. వారి గౌరవం కోసం సినిమాల గురించి ఈ సభలో మాట్లాడకూడదు. జనసైనికులూ నా మాట వినండి. నా మాట వినకపోవడం వల్ల 151 సీట్లు వచ్చిన పార్టీ ఓడిపోయింది.

2003లో పార్టీ పెడతానని చెబితే..

2003లో నేను పార్టీ పెడతానని మా నాన్నకి, అమ్మకి చెప్పాను. అప్పుడు వారిద్దరికీ నచ్చలేదు. శుభ్రమైన భవిష్యత్‌ పెట్టుకుని పిచ్చా అని అడిగారు. సినిమాను దృష్టిలో పెట్టుకుని నేను ఎదగలేదు. సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని ఎదిగాను. సినిమా ఉపకరణం అయింది.. అదే జీవితం కాలేదు. మీరంతా గద్దర్‌ రాజకీయాల ద్వారా పరిచయం కాలేదు. గద్దర్‌ ఖుషి సినిమా చూసి, అన్నయ్య దగ్గరకి వచ్చిన మీ తమ్ముడి కలవాలని అన్నారు. గద్దరంటే చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం. దేశం కోసం, సమాజం కోసం ఆలోచించేవాడివి. ఏ మేరా భరతమాతను సంకెళ్లలో బంధించి పెట్టావు కదా.. నీ భావం నాకు అర్థం అయిందన్నారు. ఆ రోజు నుంచి మా ఇద్దరికీ స్నేహం ఏర్పడింది. అన్నదమ్ముల బంధం అయింది.


నన్ను ఆడపిల్లలా పెంచారు..

చిన్నప్పుడు నన్ను ఆడపిల్లలా పెంచారు. బయటకు వెళ్తే ఏమైపోతాడో.. సున్నితమైన వ్యక్తి అని ఇంట్లో నుంచి కదలనివ్వకుండా, ఎక్కడికీ వెళ్లనివ్వకుండా పెంచారు. సగటు మనిషిగా ఉండడమే నాకు ఇష్టం. తన కుటుంబం వరకూ జీవితా న్ని కుదించుకుని సగటు మధ్యతరగతి మనిషిలా బతకడమే నా కోరిక. మా నాన్న నన్ను ఎస్సై కావడానికి డిగ్రీ వరకూ చదవాలని అడిగేవారు. కానీ డిగ్రీ పూర్తి చేయలేకపోయా.

భగవంతుడి మాయ..

పాలిటిక్స్‌ చేస్తానని, సినిమాల్లోకి వస్తానని ఎవరూ ఊహించలేదు. నేనూ ఊహించలేదు. తొలిప్రేమ సినిమా హిట్‌ తర్వాత ఒక రోజు నేను, ఆనంద్‌సాయి, మరో మిత్రుడితో కలిసి సెకండ్‌ షో సినిమాకి వెళ్లి.. ఇంటికి వచ్చేసరికి మా నాన్న ఇంటి బయట నా కోసం ఎదురుచూస్తున్నారు. ఆలస్యంగా వచ్చానని తిట్టారు. అప్పటికే మూడు సినిమాలు హిట్‌ అయ్యాయి.. తొలిప్రేమ విజయవంతంగా నడుస్తోంది.. ఇంకా నన్ను చిన్నపిల్లవాడిలా చూస్తే ఎలా అని అడిగాను. ఆ తర్వాత మరీ ఎక్కువగా తిట్టారు.

ఆ ప్రొఫెసర్‌కు ధన్యవాదాలు

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ శ్రీపతి రాముడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆయన జనసేన పార్టీ కాదు. బహుజన సిద్ధాంతాలు, అంబేడ్కర్‌ ఆశయాలు, అణగారిన వర్గాల కోసం నిలబడిన వ్యక్తి. చాలామంది విద్యార్థులను పీహెచ్‌డీల కోసం తయారు చేసే వ్యక్తి. ఆయన ఎప్పుడూ నా వెంటనే ఉన్నారు.


సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు..

2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించాం. కలిసి పోరాటం చేశాం. కష్టాలు ఉన్నప్పుడు చేయి అందించాం. అది గుర్తుపెట్టుకుని డిప్యూటీ సీఎంగా కలిసి ఒక వ్యక్తితో బలంగా ప్రయాణం చేస్తున్నాను. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు, హైటైక్‌ సిటీకి రూపకల్పన చేసిన దార్శనికుడు, క్లెమోర్‌ మైన్స్‌తో పేల్చేస్తే.. తర్వాతి రోజు చొక్కా దులుకుని వచ్చి డ్యూటీలో చేరిన బలమైన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయనకు, లోకేశ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు.

సనాతన ధర్మంపై సర్టిఫికెట్‌ అక్కర్లేదు..

సనాతన ధర్మం నా రక్తంలో ఉంది. 14 ఏళ్ల నుంచి దీక్షలు చేస్తున్నాను. అయ్యప్పస్వామి దీక్షా చేశాను. సనాతన ధర్మంపై నాకు సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. 219 దేవాలయాలను అపవిత్రం చేస్తే.. అంతర్వేది రథాన్ని కాల్చేస్తే.. రాముల వారి విగ్రహం నుంచి శిరసును వేరే చేస్తే ఎందుకు బయటకు రాలేదంటున్నారు. కానీ ఆ రోజే స్పందించాను. మా నాన్న 20 ఏళ్ల వయసులో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు.. తర్వాత రామభక్తుడు అయిపోయారు. మా ఇంట్లో నిత్యం రామనామం జపించేవారు. రాముడి విగ్రహం తల నరికేస్తే కోపం రాకూడదంటే ఎలా..? మహ్మద్‌ ప్రవక్తను దూషించి బతకగలరా..? ఏసుక్రీస్తు, మేరీమాతను అనగలరా..? పార్వతీదేవిని మాత్రం ఇష్టారాజ్యాంగా తిడతారు. నోరు మూసుకుని కూర్చోవాలా..? ఆ జనరేషన్‌ పోయింది. తప్పును తప్పుగానే చెబుతాను. 15 నిమిషాలు పోలీసులు కళ్లు మూసుకుంటే హిందువులకు తామంటే ఏమిటో చూపిస్తామంటూ ఓల్డ్‌ సిటీలో నాయకులు అంటే తప్పు పట్టకూడదా..? అల్లాను ద్వేషించమని సనాతన ధర్మం మాకు చెప్పలేదు. కుహనా సెక్యులర్‌వాదుల వల్ల ఇలా అవుతోంది. అన్ని మతాలకు శిక్ష ఒక్కటే ఉండాలి. గుజరాత్‌లో ముస్లింలు చనిపోతే.. దానికి దారి తీసిన పరిస్థితుల గురించి ఆలోచించాలి. గోద్రా మారణహోమం ఎందుకు జరిగిందని ఆలోచిస్తే.. రామభజన చేసినందుకు రైలును తగులబెట్టారు. రెండూ తప్పే.


అన్నీ దేశ భాషలే కదా!

ప్రస్తుతం భాష, సంస్కృతినీ తిడుతున్నారు. హిందీని రుద్దుతున్నారంటా హడావుడి చేస్తున్నారు. అన్నీ దేశ భాషలే కదా! తమిళనాడులో హిందీ వద్దని అంటున్నారు. అలాగైతే తమిళ సినిమాలను హిందీలోకి అనువదించకండి.. హిందీవాళ్ల డబ్బులు కావాలి. కానీ హిందీ భాష వద్దంటే ఎలా? భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదు. దేశానికి తమిళం సహా బహుళ భాషలు కావాలి. బహుభాషలే దేశానికి మంచిది. నార్త్‌, సౌత్‌ విభజన, కుల గణన, డీలిమిటేషన్‌, త్రిభాషా ఫార్ములా గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. ఆంధ్రాను విభజిస్తే దేశంలో ఉండమని చాలా మంది అప్పుడన్నారు. దేశాన్ని కట్‌ చేయడానికి ఇండియా కేకు ముక్కా? ఇండియా అంటే.. ఉత్తర భారతదేశం హిమాలయాల్లో పరమశివుడున్న కైలాసం దగ్గర నుంచి దక్షిణ భారతంలో మురుగన్‌ నివాసం వరకు. దేశాన్ని విడగొట్టే ధైర్యం, సాహసం ఎవరికైనా ఉందని నేను అనుకోను. రాజకీయ వైరుధ్యాలతో దేశాన్ని ముక్కలు చేయవద్దు. డీలిమిటేషన్‌పై చర్చ పెట్టండి. అంతేగానీ రూపీ సింబల్‌ మార్చేస్తాం. నా భాషలో పెడతానంటే! ఏ రాష్ట్రం వాళ్లు అలా అనుకుంటే ఎలా..? వివేకం, ఆలోచన ఉండాలి. విధ్వంసం చేయడం చాలా సులువు.. నిర్మాణం చాలా కష్టం. తమిళనాడులో చదువుతున్న సమయంలో నేనూ వివక్షకు గురయ్యాను. గోల్టి అని నన్ను పిలిచేవారు. గోల్టి అంటే తెలుగుకు రివర్స్‌ అని మా మాస్టర్‌ చెప్పారు.

బలమైన నాయకత్వం అవసరం

అల్లరి చిల్లరిగా ఉండే వారు నాకు అవసరం లేదు. నిలకడగా ఉండే వారే నా సైన్యం. డిప్యూటీ సీఎం అయ్యాక.. పుస్తకాల బరువుతో వీపు వంగిపోతున్న పిల్ల వాడికి ఆ బరువు తగ్గిస్తే ధన్యుడిని అనుకునేవాడిని. చుక్క నీటి కోసం ఏడ్చే గిరిజనులకు ఒక్క బిందెడు మంచి నీరు ఇస్తే బాగుంటుందనుకునేవాడిని. డోలీ మోతలతో ఇబ్బందులు పడే కొండ ప్రాంతాల్లో ఒక రోడ్డు వేయించగలమా అని అనుకునేవాడిని. మీ అందరి దయ, పట్టుదలతో నాలుగు వేల పైచిలుకు కిలోమీటర్ల రోడ్లు వేయించగలిగాం. రూ.2,500 కోట్లకు పైగా ఖర్చు చేసి రోడ్లు వేశాం. అనుకుంటే ఎంతైనా చేయగలం. నాకు ఈజీగా, గోల చేసే వ్యక్తులు వద్దు.. దేశం కోసం నిలబడే, చీల్చి చెండాడే యువత కావాలి. పాకిస్థాన్‌ విభజన ఎందుకు ఆపలేపోయారంటే యువరక్తాన్ని తయారుచేయలేకపోయామని సర్దార్‌ పటేల్‌ చెప్పారు. నేను వికసిత్‌ భారత్‌ ను నిర్మించగలిగే యువత నాయకత్వాన్ని ఆలోచిస్తున్నాను. ఊరికి వంద మంది నేతలను జాతీయ స్థాయికి పంపించడమే నా లక్ష్యం.. 2047కి విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉండాలి. దేశాన్ని, సమాజాన్ని నడిపే నేతలు మీలో నుంచి పుట్టాలి. ఏపీ, తెలంగాణ నుంచి దేశాన్ని ప్రభావితం చేసే వంద మంది యువ నాయకులను తయారుచేయాలి. దానికి పని చేద్దాం. సరైన నాయకుడు లేకపోతే చిల్లర, పనికిమాలిన వేషాలు వేస్తారు. వైసీపీ వాళ్లు మళ్లీ వచ్చారంటే తప్పు మనది. బలహీనత మనది అవుతుంది.


సైద్ధాంతిక బలం ఉండాలి..

రాజకీయాల్లో సైద్ధాంతిక బలం ఉండాలి. పదవి, అధికారం కోసం గూండాలను వాడుకుంటారు.. మర్దర్లు చేయిస్తారు. వేల కోట్లు దోచేస్తారు. కులాలను కెలికేస్తారు.. విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా లాభపడడం మరో పద్ధతి. కోడికత్తి దాడి లాంటివి ఎంచుకోలేదు. సైద్ధాంతిక రాజకీయాలు ఎంచుకున్నాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ అలాగే జీవించాను. నేను మార్పు కోసం వచ్చాను.. ఓట్ల కోసం కాదు. బాధ్యతగా లేకుండా ఇంత దూరంగా రాగలమా..? 151 సీట్లు ఉన్న పార్టీని 11 సీట్లకు రానివ్వగలిగాం. గెలిచిన మన ఎమ్మెల్యేలను ఇబ్చందులకు గురి చేశారు. అప్పుడే చాలా మంది నన్ను ప్రధాని మోదీకి చెప్పండని అన్నారు. ప్రజల్ని కాపాడడానికి వచ్చానని, నన్ను కాపాడాలని ఎవరినీ అడగనంటూ తిరస్కరించాను. ఇది నా పోరాటం.. నా నేల, నా మీద చేయి వేయమని చెప్పండి నేనేమిటో చెబుతా. ఎవరో వస్తారని ఎప్పుడూ ఏదీ చేయను. ఎంత నిలబడగలనో అంతే నిలబడతాను. ఆలోచించి అడుగు వేస్తాను.. నన్ను బూతులు తిట్టి, వాటిపై డిబేట్లు పెట్టారు. అప్పుడు నేను, నా జీవితం తప్ప వీరికేమీ లేవా అనుకునేవాడిని. ఒకరింట్లో ఆస్తి తగాదాలు, అన్నా చెల్లెళ్ల ఆస్తి గొడవతో రాష్ట్రానికి ఏం సంబంధం? వీరికి ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని ఆలోచించాలి. పవన్‌ ఒక్కడికే కోపం వస్తే ఇంత జరిగింది. ఇన్ని లక్షల మందికి కోపం వస్తే ఏం జరుగుతుందో చూడండి. సమాజంలో అన్యాయం మీద ప్రతి ఒక్కరికి కోపం రావాలి.

తండ్రి సీఎం అయి ఉండాలా..?

పార్టీ పెట్టాలంటే తండ్రి ముఖ్యమంత్రి అయి ఉండాలా..? మామయ్య కేంద్ర మంత్రి అయి ఉండాలా..? బాబాయిని చంపించాలా..? ఇలా చేయాలని ఎక్కడా రాసి లేదు. దశాబ్దం పాటు పార్టీని మోయాలంటే ఎన్ని తిట్లు తినాలి.. అవమానాలు భరించాలి..? నలగాలి.. జ్వలించుకుపోవాలి.. ఎన్ని పోగొట్టుకోవాలి..? వ్యక్తిగత జీవితం నుంచి ఆరోగ్యం వరకూ అన్ని పొగొట్టుకుని వచ్చాను. వీటన్నింటికి జయకేతనం నాకు గొప్ప ఆనందాన్ని అందించింది. నేను మార్షల్‌ ఆర్ట్స్‌ చేసే సమయంలో రాళ్లు గుండెలపై పెట్టుకుని పగులకొట్టించుకునేవాడిని.. ముగ్గురు పిల్లలను ఎత్తుకుని పరుగెత్తేవాడిని. ఇప్పుడు నా చిన్న కొడుకును కూడా ఎత్తుకోలేనంతా బలహీనపడిపోయాను. అయినా మీ అందరి ఆశీస్సులతో మళ్లీ బలం తెచ్చుకుంటాను.


ఇవి కూడా చదవండి..

Pawan Kalyan: స్టేట్ అయినా.. సెంట్రల్ అయినా.. ఆయన క్రేజే వేరు..

Putin - Modi ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణపై పుతిన్ కీలక వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 15 , 2025 | 03:59 AM