రూ.229 కోట్ చేసి.. అధిక ధరకు అమ్ముతారా?
ABN , Publish Date - Mar 16 , 2025 | 03:59 AM
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో కలెక్టర్ పి.ప్రశాంతి అధ్యక్షతన శనివారం జరిగిన జిల్లా ఇసుక కమిటీ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఉచిత ఇసుక సరఫరా విధానంపై రాష్ట్రంలోని 60 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, మిగతా 40 శాతం మంది కూడా సంతృప్తి చెందేవిధంగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్టు తెలిపారు.

సాధ్యం కాకపోతే ఆ ధర ఎందుకు కోట్ చేశారు?
ఉచిత ఇసుక విధానంలో నిబంధనలు పాటించాల్సిందే
తేడా వస్తే చర్యలు తప్పవు: మైన్స్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్
రాజమహేంద్రవరం, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ‘ర్యాంపుల నిర్వాహకులు టన్ను ఇసుకను రూ.229కి సరఫరా చేస్తామని కోట్ చేసి అంతకంటే ఎక్కువ ధరకు ఎందుకు విక్రయిస్తున్నారు?. సాధ్యం కాకపోతే ఆ ధరను ఎందుకు కోడ్ చేశారు?’ అని రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ కమిషనర్, తూర్పుగోదావరి జిల్లా ప్రత్యేకాధికారి ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో కలెక్టర్ పి.ప్రశాంతి అధ్యక్షతన శనివారం జరిగిన జిల్లా ఇసుక కమిటీ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఉచిత ఇసుక సరఫరా విధానంపై రాష్ట్రంలోని 60 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, మిగతా 40 శాతం మంది కూడా సంతృప్తి చెందేవిధంగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్టు తెలిపారు. గత ప్రభుత్వం టన్ను ఇసుకను రూ.475 కంటే ఎక్కువగా విక్రయిస్తే.. సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక విధానం తెచ్చారని, కానీ ఇసుక నిర్వహణ ఏజెన్సీలు రూ.400 కంటే ఎక్కువకు అమ్ముతున్నాయని చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలన్నారు. దీనిపై ప్రతి నెలా సీఎం సమీక్షిస్తున్నారన్నారు. ఐవీఆర్‌ఎ్‌సలో వచ్చిన ఫిర్యాదులను కూడా చదివి వినిపించారు. ఇకపై తప్పులు జరక్కుండా చూడాలని, రీచ్‌లలో త్వరలో ప్రభుత్వ ఉద్యోగులను నియమిస్తున్నామని తెలిపారు. ఫిర్యాదులు వస్తే తానే స్వయంగా వినియోగదారులతో మాట్లాడి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ విధానంలో ఇసుక సరఫరా, రవాణా ఉండాలని స్పష్టం చేశారు. కొన్ని ఏజెన్సీలు సరైన పనితీరు చూపకపోవడంతో షోకాజ్ నోటీసులు ఇచ్చామని, వాటికి అందరూ సకాలంలో జవాబు ఇవ్వాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఽధిక్కరిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని, ఎన్జీటీ, సుప్రీంకోర్టు కఠినంగా వ్యవహరిస్తున్నాయని హెచ్చరించారు. సమావేశంలో ఎస్పీ డి.నరసింహ కిశోర్, మునిసిపల్ కమినర్ కేతన్‌గార్గ్, మైన్స్ ఏడీ డి.ఫణిభూషణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.