Police Reply to Jagan: జగన్‌ది ప్రజాస్వామ్యంపై దాడే
ABN , Publish Date - Apr 10 , 2025 | 03:09 AM
జనకుల శ్రీనివాసరావు, రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు, జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పోలీసుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆయన వ్యాఖ్యలు చేసినట్టు చెప్పి, బహిరంగ క్షమాపణలు ఇవ్వాలని హెచ్చరించారు

క్షమాపణ చెప్పకుంటే న్యాయ పోరాటం: రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం
అమరావతి, విజయవాడ (గాంధీనగర్), ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా పర్యటనలో ‘పోలీసుల బట్టలు ఊడదీసా’్త అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యల్ని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ‘జగన్ చేసిన వ్యాఖ్యలు పోలీసుల మనోభావాలు, ఆత్మస్థ్యైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. పోలీసులు రాజకీయ, వర్గ, రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వర్తిస్తూ.. రూల్ ఆఫ్ లాను పారదర్శకంగా అమలు చేస్తున్నారు. జగన్ తన రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. పోలీసులను బెదిరించడం.. ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే. ప్రజాస్వామ్యంపై ఆయనకు కనీస గౌరవ లేకపోవడం శోచనీయం’ అని అన్నారు. ‘మీ తండ్రి ప్రభుత్వంలో.. మీ పాలనలోనూ పని చేశాం.. మా ఉద్యోగం మేం చేస్తే తప్పా? మా యూనిఫామ్ మాకు ఉక్కు కవచం. తొలగించడం అంత సులభం కాదు. రాజకీయ మైలేజీ కోసం ఊగిపోతూ మమ్మల్ని అంటే ఊరుకోం. బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే కచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం’ అని హెచ్చరించారు. మహిళా పోలీసుల మనోభావాలను దెబ్బతీసేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.