Share News

మెరుగైన ఫలితం

ABN , Publish Date - Apr 13 , 2025 | 01:16 AM

ఇంటర్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు దుమ్ములేపారు. గతేడాది కంటే ఈ ఏడాది అధిక ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలు పైచేయి సాధించి భళా అనిపించారు.

మెరుగైన ఫలితం

ఇంటర్‌లో గతేడాది కన్నా అధిక ఉత్తీర్ణత

జిల్లాలో బాలికలు టాప్‌

ద్వితీయ సంవత్సరంలో 79శాతం.. ప్రథమ సంవత్సరంలో 63శాతం మంది పాస్‌

రాష్ట్రస్థాయిలో మాత్రం వెనకే

ఇంటర్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు దుమ్ములేపారు. గతేడాది కంటే ఈ ఏడాది అధిక ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలు పైచేయి సాధించి భళా అనిపించారు. ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 79శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో 16వ స్థానంలో, ప్రథమ సంవత్సరం విద్యార్థులు 63శాతం పాసై 19వ స్థానంలో నిలిచారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు రెండింటిలోనూ రాష్ట్ర సగటు కంటే తక్కువ ఉత్తీర్ణతతో జిల్లా వెనుకంజలో ఉంది.

ఒంగోలు విద్య, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో శనివారం విడుదలైన ఇంటర్‌ ఫలితాలలో జిల్లా విద్యార్థులు మెరుగుపడ్డారు. ద్వితీయ సంవత్సరంలో రాష్ట్రంలో సగటున 83శాతం మంది ఉత్తీర్ణులు కాగా జిల్లాలో మాత్రం 4శాతం తక్కువ ఉత్తీర్ణతతో 79శాతం మంది మాత్రమే పాసయ్యారు. జిల్లాలో 16,236 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 12,863 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు సగటున 80శాతం, బాలికలు సగటున 86శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌ విద్యార్థులు, జనరల్‌ విద్యార్థుల కంటే ఆరుశాతం తక్కువగా 73శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో ఒకేషనల్‌ విద్యార్థులు 1,540 మంది పరీక్షలకు హాజరు కాగా 1,168 (73శాతం) మంది పాసయ్యారు.

ప్రథమ సంవత్సరంలో 63శాతం

ఇంటర్మీడియేట్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 63శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. జనరల్‌ విద్యార్థులు 18,715 మంది పరీక్షకు హాజరు కాగా 11,798 మంది పాసయ్యారు. రాష్ట్రంలో 19వ స్థానంలో నిలిచారు. ఒకేషనల్‌ విద్యార్థులు 1,629 మంది పరీక్షకు హాజరు కాగా 913 మంది పాసై 56 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో బాలుర కంటే బాలికలే అధికమంది ఉత్తీర్ణులయ్యారు.

ప్రభుత్వ యాజమాన్యంలో 75.3శాతం

ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యంలోని జూనియర్‌ కళాశాలల్లో వివిధ మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీలు, హైస్కూలు ప్లస్‌లు, ఎయిడెడ్‌, ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌, ఏపీటీడబ్ల్యూఆర్‌ల్లో విద్యార్థులు సగటున 75.3శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ విద్యార్థులు మొత్తం 3,346 మంది పరీక్షకు హాజరు కాగా 2,516 మంది పాసయ్యారు.

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 1,761 మంది పరీక్షకు హాజరు కాగా 1,314 మంది (68.2శాతం) పాసయ్యారు.

ఏపీ మోడల్‌ స్కూళ్లలో 391 మందికి 317 మంది (81.1శాతం) ఉత్తీర్ణులయ్యారు.

హైస్కూలు ప్లస్‌లో 110 మందికి 62 మంది (56.4శాతం)పాసయ్యారు

కేజీబీవీల్లో 450 మందికి 346 మంది (76.9శాతం) ఉత్తీర్ణులయ్యారు.

ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 527 మందికి 510 మంది (96.8శాతం) పాసయ్యారు.

ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 57కు 51మంది (89.5శాతం) ఉత్తీర్ణులయ్యారు.

ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో 45మందికి కేవలం 20మంది (44.4శాతం) మాత్రమే పాసయ్యారు.

ప్రథమ సంవత్సరంలో 54.8శాతం

ప్రభుత్వ విద్యాసంస్థలకు సంబంధించి ప్రథమ సంవత్సరం పరీక్షలకు 4,343 మంది హాజరు కాగా 2,379 మంది (54.8శాతం) పాసయ్యారు.

ప్రభుత్వ బాలికల కళాశాలల్లో 2,118 మందికి 977 మంది (46.1శాతం) ఏపీ మోడల్‌ స్కూళ్లలో 429 మందికి 281 మంది (65.5శాతం), హైస్కూల్‌ ప్లస్‌లో 224 మందికి కేవలం 53మంది (23.6శాతం) పాసయ్యారు. కేజీబీవీలో 691 మందికి 395 మంది (57.2శాతం), ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌లో 679 మందికి 584 మంది (86శాతం), ఏపీటీడబ్ల్యూఆర్‌లో 80 మందికి 42 మంది (52.5శాతం), ఎయిడెడ్‌లో 122 మందికి 47 మంది (38.5శాతం) ఉత్తీర్ణులయ్యారు.


తొమ్మిది ప్రభుత్వ కళాశాలల్లో 100శాతం ఉత్తీర్ణత

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో తొమ్మిది ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు 100శాతం ఉత్తీర్ణత సాధించి సత్తాచాటాయి. తాళ్లూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, త్రిపురాంతకం, అర్ధవీడు, దోర్నాల, పామూరు కేజీబీవీలు, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం కొండపి, దర్శి, చీమకుర్తి కళాశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించి అగ్రభాగాన నిలిచాయి. త్రిపురాంతకం 98శాతం, అర్ధవీడు 90శాతం ఉత్తీర్ణత సాధించగా దోర్నాల ఏపీ మోడల్‌ స్కూళ్లలో 96.9శాతం, దర్శి మోడల్‌ స్కూలు 87.5శాతం, పాకల హైస్కూలు ప్లస్‌ 90శాతం, కె.ఉప్పలపాడు హైస్కూలు ప్లస్‌ 87.5శాతం ఉత్తీర్ణత సాధించాయి. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఒక్క కళాశాలలోనూ వందశాతం ఉత్తీర్ణత సాధించలేదు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలు దోర్నాల 76.5శాతం, అర్ధవీడు 76.3శాతం, త్రిపురాంతకం 76.2 శాతం, ఏపీమోడల్‌ స్కూలు రాచర్ల 81.8, దోర్నాల 80.7శాతం, హైస్కూలు ప్లస్‌ కె.ఉప్పలపాడు 80.0, పాకల 62.5శాతం, కేజీబీవీల్లో పుల్లలచెరువు 83.7, త్రిపురాంతకం 77.4, సీఎస్‌పురం 72.4, ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల్లో కొండపి 98.7, దర్శి 97.8, అర్ధవీడు 97శాతం ఉత్తీర్ణత సాధించాయి.

Updated Date - Apr 13 , 2025 | 01:19 AM