అంతా రామమయం
ABN , Publish Date - Apr 06 , 2025 | 10:41 PM
శ్రీరామ నవమి పండుగను నియోజకవర్గ ప్రజలు ఆనందంగా.. భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. అన్ని ఆలయాలు, వీధులు రామ నామంతో మార్మోగాయి. పెద్ద ఎత్తున పందిళ్లు ఏర్పాటు చేసి శ్రీసీతారాముల కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో శ్రీరామ నవమి పండుగ
కనులపండువగా సీతారాముల కల్యాణం
పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొండయ్య దంపతులు
పలుచోట్ల ఆకట్టుకున్న ప్రవచనాలు
పెద్దఎత్తున అన్నదానాలు
చీరాల, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి) : శ్రీరామ నవమి పండుగను నియోజకవర్గ ప్రజలు ఆనందంగా.. భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. అన్ని ఆలయాలు, వీధులు రామ నామంతో మార్మోగాయి. పెద్ద ఎత్తున పందిళ్లు ఏర్పాటు చేసి శ్రీసీతారాముల కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. ఉదయం నుంచే నగరోత్సవం ఆకట్టుకుంది. వివిధ భక్త సమాజం వారి కోలాటం, భరత నాట్యంతో ఉత్సాహంగా వేడుకలు సాగాయి. పలుచోట్ల ప్రవచనాలు ఆకట్టుకున్నాయి. కొత్తపేట వివేకానంద కాలనీలో తాజాగా ఏఎంసీ చైర్మన్‌గా ఎన్నికైన కౌతవరపు జనార్దన్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన రాములవారి కల్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే కొండయ్య, బాల కొండమ్మ దంపతులు హాజరయ్యారు. ఈక్రమంలో ప్రత్యేక పూజలు జరిపారు. బోయినవారి పాలెం, శ్రీనివాసపురంలో నిర్వహించిన కల్యాణ మహోత్సవం, పట్టాభిషేకం మహోత్సవాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈపూరుపాలెం పద్మనాభునిపేటలో ఎస్సై చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. పట్టణంలో లయన్స్ క్లబ్ కార్యాలయంలో చీరాల ఆధ్యాత్మిక పీఠం వారి ఆధ్వర్యంలో బాల బతుకమ్మ అష్టలక్ష్మి సమాజంవారు సంకీర్తన ఆలపించారు. రామచంద్రుడు మూర్తీ భవించిన ధర్మ స్వరూపుడు అనే అంశంపై ప్రవచనం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు.
శింగరొండ ఆలయంలో వేడుక
అద్దంకి : శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణోత్సవం ఆదివారం వాడవాడలా కనులపండువగా నిర్వహించారు. శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం ముందు నెళ్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, రాధ దంపతుల ఆధ్వర్యంలో వరుసగా 14వ ఏట సీతారాముల కల్యాణోత్సవవాన్ని నిర్వహించారు. భక్తులు కల్యాణాన్ని చూసి తరించారు. ఈవో తిమ్మానాయుడు ప్రత్యే క పూజలు నిర్వహించారు. శింగరకొండలోని రామాలయం, లక్ష్మీనరశింహస్వామి దేవాలయం, శ్రీరామజీవన సంఘం అన్నదాన స త్రం, పట్టణంలోని రామాటాకీస్ బజారులో ఏర్పాటు చేసిన 3 చలువ పందిళ్లు, పాతగాంధీ బొమ్మ సెంటర్, అత్తులూరివారి వీధిలోని రామాలయం, కాకానిపాలెంలోని రామాలయం తదితర ప్రాంతాలలో సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాలలో సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
పంగులూరు : శ్రీరామనవమి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. రామాలయంలో జరిగిన స్వామివారి కల్యాణ మహోత్సవంలో రోటరీ ప్రతినిధి వీరరాఘవయ్య దంపతులు పాల్గొని కల్యాణం నిర్వహించారు. పంగులూరు పాత అంబేడ్కర్ కాలనీలోని రామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం శాస్ర్తోక్తంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు పానకం, వడపప్పు అందచే శారు.