Share News

కొనుగోళ్ల పరిశీలన.. రైతులతో భేటీ

ABN , Publish Date - Apr 09 , 2025 | 01:19 AM

జిల్లాలోని పలు పొగాకు వేలం కేంద్రాలను బోర్డు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) బి.విశ్వశ్రీ మంగళవారం సందర్శించారు. కొనుగోళ్ల తీరును పరిశీలించడంతోపాటు రైతులతో సమావేశాలు నిర్వహించారు. పక్షంరోజుల క్రితం బాధ్యతలు స్వీకరించిన విశ్వశ్రీ తొలిసారి జిల్లాలోని వేలం కేంద్రాల సందర్శనకు రాగా పొగాకు రైతులు ఘనస్వాగతం పలికారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సమస్యలను కూడా ఆమె దృష్టికి తీసుకెళ్లారు.

కొనుగోళ్ల పరిశీలన.. రైతులతో భేటీ
త్రోవగుంట వద్ద ఉన్న ఒంగోలు-2 వేలం కేంద్రంలో పొగాకు కొనుగోళ్లను పరిశీలిస్తున్న బోర్డు ఈడీ విశ్వశ్రీ, అధికారులు

పొగాకు వేలం కేంద్రాలను సందర్శించిన బోర్డు ఈడీ విశ్వశ్రీ

నోబిడ్లు లేకుండా చూడాలని, ధరలు పెంచాలని రైతుల వినతి

ఒంగోలు, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు పొగాకు వేలం కేంద్రాలను బోర్డు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) బి.విశ్వశ్రీ మంగళవారం సందర్శించారు. కొనుగోళ్ల తీరును పరిశీలించడంతోపాటు రైతులతో సమావేశాలు నిర్వహించారు. పక్షంరోజుల క్రితం బాధ్యతలు స్వీకరించిన విశ్వశ్రీ తొలిసారి జిల్లాలోని వేలం కేంద్రాల సందర్శనకు రాగా పొగాకు రైతులు ఘనస్వాగతం పలికారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సమస్యలను కూడా ఆమె దృష్టికి తీసుకెళ్లారు. తొలుత త్రోవగుంట సమీపంలోని ఒంగోలు-2 వేలం కేంద్రానికి వచ్చిన విశ్వశ్రీకి అక్కడి రైతు ప్రతినిధులు వడ్డెళ్ళ వరప్రసాద్‌, మండవ శివన్నారాయణ, పెనుబోతు సునీల్‌, యర్రంనేని శేషయ్య, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆమె అక్కడ పొగాకు కొనుగోళ్లను పరిశీలించారు. ఆతర్వాత టంగుటూరు, కొండపి, ఒంగోలు-1, వెల్లంపల్లి వేలం కేంద్రాలను కూడా సందర్శించారు. కొనుగోళ్ల తీరు, మార్కెట్‌లోకి వస్తున్న పొగాకు బేళ్ల నాణ్యత, లభిస్తున్న ధరలు, ఏ కంపెనీ బయ్యర్లు ఏ తరహా పొగాకు కొంటున్నారు.. తదితర అంశాలను ఆమె పరిశీలించారు. పలుచోట్ల తిరస్కరణకు గురైన బేళ్లను, వాటి గ్రేడ్లను చూసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా వేలం కేంద్రాల్లో నిర్వహించిన సమావేశాల్లో పలువురు రైతు ప్రతినిధులు మాట్లాడుతూ కొన్నిరకాల బేళ్లు తిరస్కరణకు గురవుతున్న విషయాన్ని ఈడీ విశ్వశ్రీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇస్తున్న ధరలు బాగా ఉన్నట్లుగా కనిపిస్తున్నా ఈ ఏడాది ఉత్పత్తి ఖర్చులు గణనీయంగా పెరిగాయన్నారు. ఈనేపథ్యంలో ధరలను మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సగటు ధరలు పెరిగేలా చూడటంతోపాటు నోబిడ్‌లు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల వినతిపై స్పందించిన ఈడీ విశ్వశ్రీ.. వచ్చే వారం వ్యాపారప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి ధరల విషయమై చర్చిస్తామని హామీ ఇచ్చారు. నోబిడ్‌ బేళ్లపై స్పందిస్తూ ప్రస్తుతం మార్కెట్లో కొనుగోళ్లు జరుగుతున్న గ్రేడ్ల రకంను వేలానికి తీసుకురావాలని సూచించారు. పొగాకు బోర్డు వైస్‌చైర్మన్‌ బ్రహ్మయ్య, బోర్డు సెక్రటరీ దివి వేణుగోపాల్‌, సభ్యుడు పొద వరప్రసాదరావు, ఆర్‌ఎం లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 01:19 AM