‘భూ’చోళ్లు
ABN , Publish Date - Apr 13 , 2025 | 01:14 AM
కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. ఖాళీ స్థలం కనిపిస్తే ‘భూ’చోళ్లు కాజేస్తున్నారు. తాజాగా ఒంగోలు సమీపంలోని ముక్తినూతలపాడు సర్వే నంబర్ 15లో ఉన్న డొంక పోరంబోకుపై కొందరి కన్నుపడింది.

ముక్తినూతలపాడు సర్వే నెం.15లో డొంక పోరంబోకు ఆక్రమణ
కోర్టు వివాదంలో ఉన్న 5.6 ఎకరాలకు ఎసరు
ఒంగోలు కార్పొరేషన్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. ఖాళీ స్థలం కనిపిస్తే ‘భూ’చోళ్లు కాజేస్తున్నారు. తాజాగా ఒంగోలు సమీపంలోని ముక్తినూతలపాడు సర్వే నంబర్ 15లో ఉన్న డొంక పోరంబోకుపై కొందరి కన్నుపడింది. ఏకంగా 20.60 ఎకరాల భూమికి ఎసరు పెట్టారు. శుక్రవారం రాత్రి 5.6 ఎకరాలను ఆక్రమించారు. రూ.కోట్ల విలువ చేసే భూమికి కంచె వేశారు. వివరాల్లో కెళితే.. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని ముక్తినూతలపాడు సర్వే నెం.15లోని భూమి రెవెన్యూ రికార్డులలో డొంక పోరంబోకుగా ఉంది. అయితే ఆక్రమణదారులు కొందరు వ్యక్తుల వద్ద కొనుగోలు చేశామంటూ కథ అల్లారు. ఇదిలా ఉంచితే 1978లో ఈ స్థలంలో కొందరు మాజీ సైనికులకు పట్టాలు ఇచ్చారని కొంతమంది వెల్లడిస్తున్నారు. వారు ఎవరో.. ఎక్కడ ఉంటారో కూడా తెలియని పరిస్థితి. మరికొందరు భూమిని తమ స్వాధీనంలో ఉంచుకోగా, మిగిలిన 5.6 ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలో ఉంది. దీంతో దళిత సంఘ నేత ఒకరు 2009లో డొంక భూమి ప్రభుత్వ పరిధిలో ఉందని, అందులో ఎస్సీ, ఎస్టీలకు స్థలాలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అప్పటి రెవెన్యూ అధికారులు అది వీలుపడదనడంతో దళిత నేత కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ వివాదం కోర్టులో నడుస్తోంది. దళితనేత మరణించడంతో కేసు నెమ్మదించింది. దీంతో ఆ భూమిపై కన్నేసిన కొందరు తమకు పట్టాలు ఉన్నాయని, వాటిని కొందరు వ్యక్తుల వద్ద కొనుగోలు చేశామని చెబుతూ కంచె వేస్తున్నారు. ఇదే విషయమై రెవెన్యూ అధికారులతో మాట్లాడగా, ప్రస్తుతం 5.6 ఎకరాల భూమి విషయం కోర్టులో వాదనలు నడుస్తున్న మాట వాస్తవమేనన్నారు. అయితే గతంలో మాజీ సైనికులకు పట్టాలు ఇచ్చారని కొందరు అంటున్నారని, అందుకు సంబంధించి ఎలాంటి రికార్డులు తమ వద్ద లేవని వెల్లడిస్తున్నారు.