Share News

మహిళా సమాఖ్య ఎన్నికల్లో అక్రమాలెన్నో..

ABN , Publish Date - Mar 18 , 2025 | 01:28 AM

జిల్లా మహిళా సమాఖ్య ఎన్నికల్లో అధికారుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఎన్నికలను పూర్తిగా సహకార చట్టం పరిధిలోనే అధికారులు నిర్వహించాల్సి ఉంది. కొత్తగా ఎన్నికలు నిర్వహిస్తే ఉన్న కార్యవర్గ సభ్యుల్లో సగం మంది పాతవారికి, మూడొంతులు కొత్త వారికి కార్యవర్గంలో అవకాశం కల్పించాలి.

మహిళా సమాఖ్య ఎన్నికల్లో అక్రమాలెన్నో..
జిల్లా మహిళా సమాఖ్య నూతన కార్యవర్గం (ఫైల్‌)

మండల సమాఖ్య అధ్యక్షుల స్థానంలో బినామీలతో ఓట్లు వేయించిన అధికారులు

తాము అనుకున్న వారే ఎన్నికయ్యేలా బరితెగింపు

ఒంగోలు నగరం, మార్చి 17 (ఆంధ్రజ్యోతి) : జిల్లా మహిళా సమాఖ్య ఎన్నికల్లో అధికారుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఎన్నికలను పూర్తిగా సహకార చట్టం పరిధిలోనే అధికారులు నిర్వహించాల్సి ఉంది. కొత్తగా ఎన్నికలు నిర్వహిస్తే ఉన్న కార్యవర్గ సభ్యుల్లో సగం మంది పాతవారికి, మూడొంతులు కొత్త వారికి కార్యవర్గంలో అవకాశం కల్పించాలి. ఇతర జిల్లాకు చెందిన సమాఖ్య నుంచి ఇక్కడ జరిగే ఎన్నికలకు రిటర్నింగ్‌ అధికారిని నియమించాలి. కానీ ఈ నిబంధనలను ఏమాత్రం పాటించకుండా అధికారులు రాచర్ల వెలుగు ఏపీఎం రమేష్‌ను ఎన్నికల అధికారిగా నియమించారు. జిల్లా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శి, ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకునేందుకు జిల్లాలోని 38 మండలాల సమాఖ్య అధ్యక్షులు ఓటుహక్కు కలిగి ఉంటారు. కానీ ఈనెల 12న వెలుగు అధికారులు నిర్వహించిన ఎన్నికల్లో మండల సమాఖ్య అధ్యక్షులు కొంతమంది రాకపోయినా వారి స్థానంలో బినామీలతో ఓట్లు వేయించారు. తాము అనుకున్న వారినే నూతన కార్యవర్గంలో ఎన్నిక చేసేందుకు, ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు అధికారులు ప్రయత్నించారు. కానీ పలువురు మండల సమాఖ్య అధ్యక్షులు అధికారుల తీరును ప్రశ్నిస్తూ నిలదీశారు. అయినప్పటికీ ఎన్నికల్లో టంగుటూరు మండల సమాఖ్య అధ్యక్షురాలు గడ్డం కవిత గెలుపొందినట్లు ప్రకటించారు.

కొందరు రాకపోయినా ఓటు వేశారు

జిల్లా సమాఖ్య అధ్యక్షురాలిగా గడ్డం కవిత గెలుపొందటానికి వెలుగు అధికారులు సంపూర్ణ సహకారం అందించారు. కొన్ని మండలాలకు చెందిన సమాఖ్య అధ్యక్షులు ఎన్నికలకు హాజరు కాకపోయినా వారి స్థానంలో బినామీలను పెట్టి ఆమెకు ఓట్లు వేయించారు. ఈ విషయం రెండు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. హెచ్‌ఎంపాడు మండల సమాఖ్య అధ్యక్షురాలు మరియమ్మ, కనిగిరి మండల అధ్యక్షురాలు నాగలక్ష్మి, పుల్లలచెరువుకు చెందిన సంతోషమ్మ కార్యక్రమానికి హాజరు కాలేదు. కానీ ఈనెల 12వ తేదీ జరిగిన ఎన్నికల్లో ఈ ముగ్గురు ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ విషయం ఆయా మండలాల అధ్యక్షుల ద్వారా తెలియడంతో వారు ఉన్నతాఽధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదేవిధంగా ఇంకా పలు మండలాలకు చెందిన మహిళా సమాఖ్య అధ్యక్షులు రాకపోయినా బినామీలతోనే ఓట్లు వేయించినట్లు అనుమానిస్తున్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేపడితే జిల్లా సమాఖ్య ఎన్నికల్లో వెలుగు అధికారులు చేసిన అక్రమాలు మరిన్ని వెలుగుచూసే అవకాశం ఉందని పొదుపు సంఘాల మహిళలు అంటున్నారు. ఈనెల 12న జరిగిన జిల్లా మహిళా సమాఖ్య ఎన్నికల్లో అధికారుల తీరును తప్పుబట్టి ఎక్కువమంది మహిళలు ఎన్నికల కార్యక్రమాన్ని బహిష్కరించి బయటకు వచ్చేశారు. అయినా అధికారులు పూర్తిస్థాయి కార్యవర్గం ఏకగ్రీవంగా జరిగినట్లు ప్రకటించేశారు. ఈ తతంగం మొత్తాన్ని పరిశీలిస్తే ఎన్నికల విధుల్లో ఉన్న వెలుగు అధికారులు మహిళల్ని తప్పుదారి పట్టించి, అక్రమ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించినట్లు తేటతెల్లమవుతోంది.

Updated Date - Mar 18 , 2025 | 01:28 AM