Share News

వైసీపీ కాలంలో డీసీసీబీలో భారీ అక్రమాలు

ABN , Publish Date - Mar 18 , 2025 | 01:32 AM

గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో డీసీసీబీలతోపాటు అప్కాబ్‌ నుంచి పీఏసీఎస్‌ల వరకు భారీగా అక్రమాలు, అవినీతి జరిగాయని పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ధ్వజమెత్తారు. ఆ సందర్భంగా ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో పెద్దఎత్తున దోపిడీ జరిగిందని, ప్రభుత్వ పథకాల పేరుతో నాటి వైసీపీ నాయకులు, అధికారులు రైతుల ధనాన్ని దోచుకున్నారని గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు.

వైసీపీ కాలంలో డీసీసీబీలో భారీ అక్రమాలు

అసెంబ్లీలో ప్రస్తావించిన పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల

రాష్ట్రవ్యాప్తంగా సహకార సంస్థల్లో అక్రమాలపై విస్తృత చర్చ

ఒంగోలు మార్చి 17(ఆంధ్రజ్యోతి) : గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో డీసీసీబీలతోపాటు అప్కాబ్‌ నుంచి పీఏసీఎస్‌ల వరకు భారీగా అక్రమాలు, అవినీతి జరిగాయని పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ధ్వజమెత్తారు. ఆ సందర్భంగా ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో పెద్దఎత్తున దోపిడీ జరిగిందని, ప్రభుత్వ పథకాల పేరుతో నాటి వైసీపీ నాయకులు, అధికారులు రైతుల ధనాన్ని దోచుకున్నారని గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. అక్రమాలపై కలెక్టర్‌ ప్రభుత్వానికి పంపిన నివేదికను ఉటంకిస్తూ చర్యలకు డిమాండ్‌ చేశారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, పీఏసీఎస్‌లు, అప్కాబ్‌ వంటి సహకార సంస్థలలో గత వైసీపీ హయంలో జరిగిన అవినీతి, అక్రమాలపై చర్చ సాగింది. పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్రతోపాటు ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు బి.రామాంజనేయులు, కూన రవికుమార్‌, యార్లగడ్డ వెంకట్రావు, బొలిశెట్టి శ్రీనివాస్‌ తదితరులు ఈ చర్చలో పాల్గొన్నారు. అందరూ తమ తమ ప్రాంతాల్లో జరిగిన అక్రమాలను సభలో ఏకరువు పెట్టారు. ఆ సందర్భంగా గుంటూరు డీసీసీబీతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని సహకార సంస్థల్లో అక్రమాలపై పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర మాట్లాడారు. ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా కేంద్ర బ్యాంకు అంశాలపై మాట్లాడారు. పీడీసీసీ బ్యాంకులో సుమారు రూ.11కోట్ల మేర జగనన్న పాల వెల్లువ పేరుతో రుణాలు ఇచ్చారన్న నరేంద్ర.. అమూల్‌ సంస్థ సేవ కోసం ఈ తరహా రుణాలు ఇవ్వగా వాటిని బినామీలు బొక్కేశారన్నారు. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా తిరిగి జమకాలేదని దీనికి నాటి ఉన్నతాధికారులు, వైసీపీ నాయకులు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. బ్యాంకులో జరిగిన అక్రమాలపై ఇటీవల కలెక్టర్‌ అన్సారియా ప్రభుత్వానికి నివేదిక పంపారన్నారు. అందులో పాలవెల్లువ రుణాలతోపాటు జగనన్న తోడు పథకం కింద రూ.20 కోట్లు, ఫిష్‌ ఆంధ్ర, వ్యవసాయ యంత్ర పరికరాల పేరుతో భారీగా నిబంధనలకు విరుద్ధంగా రైతుల డబ్బును రుణాలుగా ఇచ్చి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆప్కాబ్‌ ఎండీ నుంచి జిల్లా బ్యాంకు, పీఏసీఎస్‌ సెక్రటరీల వరకు అందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మొత్తం అంశంపై సహకారశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు సమాధానం ఇస్తూ.. పీడీసీసీబీలో అక్రమాలపై చర్యలకు కలెక్టర్‌ను ఆదేశించామన్నారు.

Updated Date - Mar 18 , 2025 | 01:32 AM