Stalled Projects: అభివృద్ధికి మళ్లీ మోక్షం!
ABN , Publish Date - Mar 17 , 2025 | 04:38 AM
వైసీపీ విధ్వంసక పాలనలో నిలిచిపోయిన ఎన్నో అభివృద్ధి పనులకు మళ్లీ మోక్షం కలుగుతోంది. గత జగన్ సర్కారు అడ్డగోలు అప్పులు, తాకట్టులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చినా...

జగన్ ఏలుబడిలో ఆగిన ఎన్నో పనులు ఇప్పుడు పట్టాలపైకి
నిధుల కొరత ఉన్నా కూటమి ప్రభుత్వం చొరవ
రోడ్లు, భవనాలు, కాలువలు వంతెనల పనులు చకచకా
పెండింగ్ బిల్లులూ చెల్లింపు
ప్రారంభించని పనులూ పూర్తి చేయాలని స్థానికుల ఎదురు చూపులు
పునాదులు, గోడలకే పరిమితమైన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు... అర్ధంతరంగా ఆగిపోయిన రహదారుల పనులు... అసంపూర్తిగా వదిలేసిన కాలువలు, వంతెన నిర్మాణాలు... ఇలా వైసీపీ విధ్వంసక పాలనలో నిలిచిపోయిన ఎన్నో అభివృద్ధి పనులకు మళ్లీ మోక్షం కలుగుతోంది. గత జగన్ సర్కారు అడ్డగోలు అప్పులు, తాకట్టులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చినా... కూటమి ప్రభుత్వం మళ్లీ వాటిని పట్టాలెక్కిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభమై వైసీపీ సర్కారు ఆపేసిన పనులు... వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించి బిల్లులు ఇవ్వకపోవడంతో ఆగిపోయిన పనులు... ఎన్నింటినో కూటమి ప్రభుత్వం మళ్లీ చేపట్టింది. కొన్ని ప్రారంభోత్సవ దశకు చేరుకోగా, మరికొన్ని చురుగ్గా సాగుతున్నాయి. అయినా ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంది. నిధుల కోసం అధికారులు ఎదురు చేస్తున్నారు. గత జగన్ ప్రభుత్వంలో ఆగిపోయిన పలు అభివృద్ధి పనులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..
పురోగతిలో హైలెవెల్ బ్రిడ్జి
వైసీపీ ప్రభుత్వంలో కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి ఆర్టీపీపీ మార్గంలో పెన్నానదిపై రూ.52 కోట్లతో హైలెవెల్ వంతెన పనులు మంజూరయ్యాయి. రూ.14 కోట్ల మేర పనులు చేసినా పైసా కూడా నిధులు విడుదల కాలేదు. దీంతో పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రూ.14 కోట్ల బిల్లులు కాంట్రాక్టరుకు చెల్లించింది. దీంతో పెన్నానదిపై హైలెవెల్ వంతెన పనులు వేగంగా జరుగుతున్నాయి. జూలై నాటికి బ్రిడ్జి పనులు పూర్తవుతాయని ఆర్‌అండ్‌బీ అధికారులు తెలిపారు.
వేగంగా తమ్మిలేరు పనులు
వైసీపీ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఏలూరు జిల్లాలోని తమ్మిలేరు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు.. కూటమి ప్రభుత్వం వచ్చాక శరవేగంగా జరుగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018లో రూ.16 కోట్లు జైకా నిధులు మంజూరయ్యాయి. పనులు ప్రారంభించే సమయానికి 2019 ఎన్నికల కోడ్ రావటంతో బ్రేక్ పడింది. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఎడమ కాలువలో కేవలం రూ.1.64 కోట్ల పనులు జరిగాయి. బిల్లులు ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయాయి. మంత్రి పార్థసారథి చొరవతో వర్షాకాలం నాటికి అధిక శాతం పనులు పూర్తిచేయటానికి కృషి చేస్తున్నారు.
అభివృద్ధిలో పురోగతి
విల్లాలు.. చకచకా
గత ప్రభుత్వంలో విశాఖ నగర నడిబొడ్డున కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో అంకోశా ఫంక్షన్ హాల్ వెనుక ఆంధ్రా మెడికల్ కాలేజీకి చెందిన భూమిలో ఉన్న పాడుబడిన డాక్టర్ల క్వార్టర్లను కూల్చేసి విల్లాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.8.7 కోట్లతో ఏడు విల్లాలు... ఒక్కొక్కటి 5 వేల చ.అ. విస్తీర్ణంలో నిర్మించాలని పనులు ప్రారంభించారు. ఏడాది పాటు పనులు చాలా వేగంగా జరిగాయి. ఆ తరువాత నిర్మాణాలకు నిధులు ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం రూ.2.47 కోట్లు మంజూరు చేయడంతో ఆ నిర్మాణాలన్నీ ఓ కొలిక్కి వచ్చాయి. రెండు నెలల్లో మిగిలిన పనులు పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
శరవేగంగా ‘భోగాపురం’..
విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో నూతనంగా నిర్మిస్తున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులు మందకొడిగా జరగగా... కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వేగవంతమయ్యాయి. రూ.4,650 కోట్లతో జీఎమ్మార్ సంస్థ పనులు చేపడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సమీక్షలు నిర్వహిస్తున్నారు. 2026 జూన్ నాటికి ఈ విమానాశ్రయాన్ని వినియోగంలోకి తెస్తామని రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.
అద్దంలా రహదారి
2018లో నాటి టీడీపీ ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం నుంచి సామర్లకోట వరకు ఏడీబీ రోడ్డును ప్రపంచ బ్యాంక్ నిధులతో నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి పనులు ప్రారంభించింది. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండర్ల పేరుతో పనులు ఆగిపోయాయి. ఈ రోడ్డు అధ్వానంగా తయారు కావడంతో అనేక ప్రమాదాలు జరిగాయి. కూటమి అధికారంలోకి వచ్చాక 30 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్డు పనులు వేగవంతమయ్యాయి.
విశాఖ మిలీనియం టవర్‌లో టీసీఎస్
విశాఖలో రుషికొండ ఐటీ పార్కులోని హిల్ నంబరు 3పై రూ.160 కోట్లతో టవర్-ఏ, టవర్-బీ పేరుతో ఐకానిక్ భవనం నిర్మించారు. 2014-19లో టీడీపీ హయాంలో టవర్-ఏ నిర్మాణం పూర్తి చేశారు. సీఎం చంద్రబాబు అందులో నాలుగు అంతస్థులు కాండ్యుయెంట్ కంపెనీకి ఇచ్చి, ఆ సంస్థను 2019లో ప్రారంభించారు. ఆ తరువాత అధికారం చేపట్టిన వైసీపీ టవర్-బీ పూర్తి చేసి రెండేళ్లు ఖాళీగా ఉంచింది. టవర్-ఏలో మిగిలిన నాలుగు అంతస్థులు ఐదేళ్లు ఎవరికీ ఇవ్వకుండా ఖాళీగా వదిలేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు టవర్-ఏ, టవర్-బీలలో మొత్తం 2.08 లక్షల చదరపు అడుగుల స్థలం కేటాయించింది. టీసీఎస్ మొత్తం పది వేలమందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించింది.
పవన్ చొరవతో...
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు తహశీల్దార్ కార్యాలయానికి నూతన భవనాల నిర్మాణానికి 2018లో రూ.60 లక్షలు మంజూరయ్యాయి. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బిల్లులు ఇవ్వకపోవడంతో పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం రాగానే డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చొరవ తీసుకుని పెండింగ్ బిల్లులు చెల్లించేలా చేశారు. పనులు పూర్తి చేసేందుకు రూ.28 లక్షల సీఎ్‌సఆర్ నిధులు మంజూరు చేయించారు. ప్రస్తుతం పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది.
అర్బన్ హెల్త్ సెంటర్ భవనం
గొల్లప్రోలులో అర్బన్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి వైసీపీ హయాంలో కేంద్రం నిధులు రూ.75 లక్షలు మంజూరయ్యాయి. కాంట్రాక్టరుకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిపివేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చొరవ తీసుకుని రూ.20.9 లక్షలు మంజూరు చేయించారు. ఈ నిధులతో పనులు పూర్తి చేయడంతో పాటు ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు.
పనుల్లో వేగం
వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రోడ్ల విస్తరణ, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టారు. పూర్తి చేయకుండా ఎక్కడి పనులు అక్కడే ఆపేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆ పనులకు మోక్షం కలిగింది. పట్టణంలోని వాల్మీకి సర్కిల్ నుంచి టీ సర్కిల్ వరకు రోడ్డు విస్తరణ, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు జోరుగా సాగుతున్నాయి. పాత బస్టాండు వద్ద అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కాలువ పనులకు రూ.2.35 కోట్లు, ఇతర ప్రాంతాల్లో కల్వర్టు, అండర్‌గ్రౌండ్ డైనేజీ నిర్మాణం కోసం రూ.6.30 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
రోడ్లకు మహర్దశ
వైసీపీ పాలనలో అనంతపురం జిల్లా యల్లనూరు మండలం గడ్డవారిపల్లి, వెన్నపూసపల్లి, మల్లాగుండ్ల గ్రామాల రహదారులు ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం కింద సుమారు రూ.5 కోట్లతో చేపట్టి మధ్యలోనే వదిలేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తిరిగి పనులు ప్రారంభమయ్యాయి. రహదారులపై కంకర తోలి రోలింగ్ పనులు పూర్తి చేశారు. తారు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మరో నెల రోజుల్లో రహదారులు అందుబాటులోకి వస్తాయి.
గురుకులానికి తొలగని గ్రహణం
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పెదతురకపాలెంలో ముస్లిం మైనార్టీ విద్యార్థుల కోసం చేపట్టిన రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం నిలిచిపోయింది. గత టీడీపీ ప్రభుత్వం నిర్మాణం చేపట్టగా.. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిలిపివేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ముస్లిం మైనార్టీ విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
పునాదుల్లోనే శీతల గిడ్డంగి
నరసరావుపేట మార్కెట్ యార్డులో మిరప రైతుల ప్రయోజనాల కోసం గత టీడీపీ ప్రభుత్వం రూ.5 కోట్లతో శీతల గిడ్డంగి నిర్మాణం చేపట్టింది. పునాదుల వరకు పనులు పూర్తయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ పనులను నిలిపివేశారు. ఈ ప్రాంత రైతులు పండించే మిరప పంటను గుంటూరు తరలించి అక్కడి శీతల గిడ్డంగులలో నిల్వ చేసుకోవాల్సి వస్తోంది. దీంతో రైతులు వ్యయప్రయాసలకు గురౌతున్నారు. కూటమి ప్రభుత్వం శీతల గిడ్డంగి నిర్మాణాన్ని పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.
మధ్యలో ఆగిన మార్కెట్ నిర్మాణం
గత వైసీపీ ప్రభుత్వంలో ప్రొద్దుటూరు నడిబొడ్డున శివాలయం సర్కిల్లో పాత కూరగాయల మార్కెట్ కూల్చి రూ.50.9 కోట్లతో కొత్తగా నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు రూ.20 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. గత ప్రభుత్వంలో రూ.5 కోట్లు మాత్రమే బిల్లులు మంజూరయ్యాయి. మరో రూ.15 కోట్ల బిల్లులు సీఎఫ్ఎంఎస్లో నిలిచిపోయాయి. గుడ్‌విల్ పద్ధతుల్లో గానీ రుణం తీసుకుని గానీ మున్సిపాలిటీనే మార్కెట్ నిర్మాణ పనులను పూర్తి చేసుకోవాలని కూటమి ప్రభుత్వం నోట్ పంపింది.
ఆగిన వారధి
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలోని ములకల్లంక మధ్య గోదావరి పాయపై 2020లో ఆరంభించిన బ్రిడ్జి పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఈ లంకలో సుమారు 10 గ్రామాల ప్రజలు వ్యవసాయ, పశుపోషణల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ లంకలో సుమారు 70 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గోదావరికి వరద వచ్చిన ప్రతి ఏటా ఈ లంక మునిగిపోతూ ఉంటుంది. గత వైసీపీ ప్రభుత్వం రూ.35 కోట్లతో 300 మీటర్ల మేర బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కొన్ని పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యాక బిల్లులు ఇవ్వకపోవడంతో పను లు ఆగిపోయాయి. సుమారు రూ.15 కోట్ల బిల్లులు బకాయిలు ఉన్నాయు. ఈ వారధి పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
అసంపూర్తిగా గోదాములు
కర్నూలు వ్యవసాయ మార్కె ట్ యార్డులో ఉల్లి రైతుల కోసం 2018-19లో రూ.5 కోట్లతో నాలుగు అంతస్తుల (జీ+3) శీతల గిడ్డంగి నిర్మాణం పనులు చేపట్టారు. పిల్లర్లు, స్లాబుల వరకు దాదాపు రూ.2.50 కోట్లు ఖర్చు చేశారు. ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లుగా గంపెడు సిమెంట్ కూడా వేయలేదు. ఈ నిర్మాణాలు పూర్తి చేయాలంటే రూ.6 కోట్లు అవసరమని మార్కెటింగ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఉర్దూ వర్సీటీపై మళ్లీ ఆశలు
రాష్ట్ర విభజన తరవాత నాటి సీఎం చంద్రబాబు 2017-18లో కర్నూలు నగరంలో డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం ప్రారంభించారు. కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయం పక్కనే 144.92 ఎకరాల్లో ఫేజ్-1 కింద రూ.18 కోట్లతో పనులు చేపట్టారు. అకాడమిక్ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ 75 శాతం, ఫస్ట్‌ఫ్లోర్ 25 శాతం, బాలిక హాస్టళ్లు పునాది, పిల్లర్ల వరకు పనులు చేశారు. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు పేరు వస్తుందని పనులు ఆపేసింది. ఐదేళ్లలో ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో ఉర్దూ వర్సిటీ నిర్మాణంపై విద్యార్థుల్లో ఆశలు చిగురించాయి.
వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో...
నంద్యాల జిల్లా పంచాయితీరాజ్‌శాఖ పరిధిలో 415 సచివాలయాలకు గాను సుమారు రూ.180 కోట్లు గత ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో 361 సచివాలయాల నిర్మాణాలు మాత్రమే చేపట్టి 292 పూర్తిచేశారు. జిల్లాలో 394 రైతుభరోసా కేంద్రాలకు గాను దాదాపు రూ.94 కోట్లు మంజూరు చేశారు. వీటిలో 281 నిర్మాణాలు చేపట్టి 222 ఆర్బీకేలు పూర్తి చేశారు. మరో 59 రైతు భరోసా కేంద్రాలు అసంపూర్తిగా మిగిలాయి. ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో జిల్లా వ్యాప్తంగా 59 పనులు చేపట్టారు. వీటిలో 70 శాతం పనులే పూర్తయ్యాయి. కాగా రోడ్లు, భవనాలకు సంబంధించి గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు రూ.125.781 కోట్లు బిల్లులు చెల్లించలేదు. అలాగే రూ.5 కోట్లతో ఆళ్లగడ్డ-మాయలూరు మధ్యలో, రూ.2 కోట్లతో బ్రాహ్మణకొట్కూరు-మిడుతూరు మధ్యలో హైలెవల్ బ్రిడ్జి పనులు ప్రారంభించకపోవడంతో రద్దు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులను పూర్తిచేసేందుకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో సచివాలయాల నిర్మాణాలను పూర్తి చేయడం కోసం రూ.16.67 కోట్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు.
ముందుకు కదలని ‘నాడు-నేడు’
గత ప్రభుత్వంలో విశాఖ జిల్లాలోని 319 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నాడు-నేడు (ప్రస్తుతం దీనిపేరు మన బడి-మన భవిష్యత్తు) రెండో దశలో చేపట్టిన పనులకు అవసరమైన నిధులు విడుదల చేయకపోవడంతో ఏడాదిన్నర నుంచి నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ పనులపై సమీక్ష జరిగినా పురోగతి లేదు. మరో రూ.27 కోట్లు నిధుల విడుదలతో పాటు కొంత మెటీరియల్ సరఫరా చేస్తే వసతులు అందుబాటులోకి వస్తాయి.