Danyam: దళారులు దోచేస్తున్నారు!
ABN , Publish Date - Apr 07 , 2025 | 11:27 PM
No rythu seva centers జిల్లాలోని ఈ ఏడాది రబీ సీజన్‌లో సుమారు 3వేల ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. జలుమూరు, నరసన్నపేట, సరుబుజ్జిలి, ఎల్.ఎన్.పేట, హిరమండలం, పాతపట్నం తదితర మండలాల్లో వరి పంట చేతికి అందివచ్చింది. జిల్లాలో సుమారు 20వేల మెట్రిక్ టన్నుల వరకూ ధాన్యం దిగుబడి వచ్చింది. కాగా రైతుసేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నుంచి ఇంతవరకూ అనుమతులు రాలేదు.

రబీలో కానరాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు
సిండికేట్‌గా మారిన కొందరు మిల్లర్లు, వ్యాపారులు
ఒక్కో బస్తాకు రూ.500 వరకు తగ్గిస్తున్న వైనం
తీవ్రంగా నష్టపోతున్న రైతులు
నరసన్నపేటలో నేతింటి వీధికి చెందిన శ్రీరాములు రబీ సీజన్‌లో ఎకరా పొలంలో వరిసాగు చేశారు. ఎన్నో కష్టాలు పడగా 25 బస్తాల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం ధాన్యం కొనేవారు లేకపోవడంతో రోడ్డుపై ధాన్యం ఆరబోశారు. ఖరీఫ్ మాదిరి కాకుండా రబీలో వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
.................
జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన ఎస్. రామన్న మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని వరిసాగు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి ఇంజన్ల సాయంతో సాగునీటిని పొలాలకు అందించి పండించారు. ప్రస్తుతం ధాన్యం దిగుబడి రాగా.. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రోడ్డుపై ఆరబెట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. బస్తా ధాన్యం రూ.2,300 ఉండగా.. దళారులు రూ.1,900కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.
..............
నరసన్నపేట, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఈ ఏడాది రబీ సీజన్‌లో సుమారు 3వేల ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. జలుమూరు, నరసన్నపేట, సరుబుజ్జిలి, ఎల్.ఎన్.పేట, హిరమండలం, పాతపట్నం తదితర మండలాల్లో వరి పంట చేతికి అందివచ్చింది. జిల్లాలో సుమారు 20వేల మెట్రిక్ టన్నుల వరకూ ధాన్యం దిగుబడి వచ్చింది. కాగా రైతుసేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నుంచి ఇంతవరకూ అనుమతులు రాలేదు. దీంతో ఆ ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టి.. కళ్లాల్లో భద్రపరిచినా వాతావరణంలో మార్పుల కారణంగా ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలో కొందరు వ్యాపారులు, దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు సిండికేట్ వ్యవహరిస్తున్నారు. క్వింటా ధాన్యం బస్తా రూ.2,300కు కొనుగోలు చేయాల్సి ఉండగా.. బస్తాకు రూ.200 నుంచి రూ.300 వరకు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ఏటా ఖరీఫ్‌లో మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి.. రబీలో పట్టించుకోకపోవడంతో మిల్లర్లు, దళారులు అడిగిన ధరకే విక్రయించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. బస్తాకు రూ.300 వరకు తగ్గించడమే కాకుండా, పొల్లు, మట్టి పేరిట సుమారు 3 కేజీల వరకూ మార్జిన్ తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రబీలో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ విషయమై వ్యవసాయశాఖ ఏడీ రవీంద్రభారతి వద్ద ప్రస్తావించగా.. రబీలో పండించే ధాన్యం కొనుగోలుపై ఎటువంటి ఆదేశాలు రాలేదని తెలిపారు.
దోపిడీ ఇలా..
జిల్లాలో రైతుల నుంచి దళారులు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తూర్పుగోదావరి జిల్లా మండపేట, సామర్లకోటకు తరలిస్తున్నారు. సన్నరకం ధాన్యం బస్తా రూ.1,900కు కొనుగోలు చేస్తున్నారు. బస్తా(100 కేజీలు) ధాన్యం మరపడితే 60 కేజీల బియ్యం దిగుబడి వస్తుంది. బియ్యం కిలో రూ.65 చొప్పున మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. అంటే బస్తాకు 3,800 వరకు రాగా.. రైతుకు సగం మాత్రమే చెల్లించి.. మిగతా మొత్తాన్ని దళారులు దోచుకుంటున్నారు.