Swatha andhra : పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
ABN , Publish Date - Mar 16 , 2025 | 12:24 AM
Environment ప్రతీ ఒక్కరూ బాధ్యతగా పర్యావరణాన్ని పరిరక్షించాలని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కోరారు.

కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు పిలుపు
పలాసలో ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’
పలాస, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ప్రతీ ఒక్కరూ బాధ్యతగా పర్యావరణాన్ని పరిరక్షించాలని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కోరారు. శనివారం పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో జీడిపండు జంక్షన్ వద్ద స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సభలో ఆయన మాట్లాడుతూ.. ‘పరిశుభ్రతే.. ఆరోగ్యానికి శ్రీరామరక్ష. సీఎం చంద్రబాబు ఎంతో బాధ్యతతో రూపొందించిన ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ను బాధ్యతగా నిర్వర్తించాలి. అధికారులు ప్రతి నెలా మూడో శనివారం ఈ కార్యక్రమం కోసం కేటాయించాలి. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించి లక్ష్యాలు సాధించాలి’ అని తెలిపారు. ఈ మేరకు కార్యక్రమానికి హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలతో ప్రమాణం చేయించారు.
పలాసను అభివృద్ధి చేస్తాం
‘పలాసను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తీవ్ర కృషి చేస్తున్నాం. కేంద్రీయ విద్యాలయం మంజూరు చేశాం. దీనికి సంబంధించి త్వరలో విధానాలు ప్రకటిస్తాం. కలగా మిగిలిపోయిన కాశీబుగ్గ ఫ్లైఓవర్‌కు రూ.48కోట్లు రైల్వే నిధులు తీసుకువచ్చాం. పూండి రహదారికి రూ.125కోట్లు మేర కేంద్ర నిధులు మంజూరయ్యాయి. మునిసిపాలిటీలో తాగునీటి సమస్య పరిష్కరిస్తాం. ఉద్దానం రక్షితనీటి పథకాన్ని దీనికి అనుసంధానిస్తాం. పలాస నియోజకవర్గంలోనే గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణనికి చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో ఎయిర్‌పోర్టు నిర్మించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు నాతో పాటు మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే శిరీష సంకల్పంతో దీన్ని పలాసలో నిర్మించాలని ప్రతిపాదించాం. ఎయిర్‌పోర్టు నిర్మిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెంది.. ఉద్యోగావకాశాలు లభిస్తాయి’ అని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు.
వైసీపీ పాలనలో అభివృద్ధి నిర్వీర్యం: మంత్రి అచ్చెన్నాయుడు
వైసీపీ పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ‘కేంద్రం ఇచ్చిన నిధులు కూడా రాష్ట్రప్రభుత్వమే వినియోగించి స్థానిక సంస్థలకు నిధులు కేటాయించలేదు. ప్రజలు పన్నులు కట్టే నిధులన్నీ స్థానిక సంస్థలకే కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అభివృద్ధి వేగవంతమవుతుంది. రెండేళ్లలో ఆఫ్‌షోర్ పూర్తిచేస్తాం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వంశం మాది. అందుకే 40 ఏళ్లుగా ప్రజలు మమ్మల్ని గెలిపిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో జిల్లాను అభివృద్ధిపథంలో తీసుకువెళ్లడానికి కృషి చేస్తా’మని అచ్చెన్న తెలిపారు.