Share News

minister achhenna: పనులు చేయకపోతే.. కాంట్రాక్టర్లను మార్చేయండి

ABN , Publish Date - Apr 09 , 2025 | 12:02 AM

change of contractors జడ్పీ సర్వసభ్య సమావేశం వేదికగా.. తనను ప్రశ్నించిన వైసీపీ నేతకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సుతిమెత్తటి మాటలతో చెల్లుమనిపించారు. దీంతో ఇతర సభ్యులెవరూ మద్దతు పలకలేక మౌనం దాల్చారు.

minister achhenna: పనులు చేయకపోతే.. కాంట్రాక్టర్లను మార్చేయండి
మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు, చిత్రంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తదితరులు

  • వారిని బతిమలాడుకోవడం ఏంటి?

  • గత ఐదేళ్లూ ఇలానే రాష్ట్రం సర్వనాశనం

  • వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు

  • ఐదేళ్లలో ఒక్క రోడ్డూ వేయలేదని చురకలు

  • మధ్యాహ్నం వరకు సమావేశం సజావుగా..

  • ప్రశ్నించి కెలుక్కున్న ఎమ్మెల్సీ విక్రాంత్‌

  • మౌనం దాల్చిన ఎంపీపీలు, జడ్పీటీసీలు

  • శ్రీకాకుళం, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): జడ్పీ సర్వసభ్య సమావేశం వేదికగా.. తనను ప్రశ్నించిన వైసీపీ నేతకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సుతిమెత్తటి మాటలతో చెల్లుమనిపించారు. దీంతో ఇతర సభ్యులెవరూ మద్దతు పలకలేక మౌనం దాల్చారు. మంగళవారం జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ అధ్యక్షతన.. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ సమక్షంలో ఉమ్మడి జిల్లాపరిషత్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రాజకీయపరంగా విమర్శలకు పోకుండా శాఖల వారీగా ప్రగతిపై సమీక్ష నిర్వహిస్తూ.. ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చేలా సమావేశం సాగింది. ముందుగా గ్రామీణ నీటిసరఫరా విభాగంతో సమావేశం ప్రారంభమై మధ్యాహ్నం వరకు సజావుగా జరిగింది. తర్వాత వైసీపీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ అడిగిన ప్రశ్నతో.. చివరగా ఆ పార్టీ జడ్పీటీసీలు, ఎంపీపీలు నోరెత్తలేని విధంగా మంత్రి సమాధానం ఇచ్చారు. దీంతో సమావేశం ఘాటుగా ముగిసింది.

  • కాంట్రాక్టర్లను బతిమలాడుకోవడమా?

  • సమావేశంలో మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ‘జలజీవన్‌ మిషన్‌ పనులను నిర్వహించేందుకు కాంట్రాక్టర్లను బతిమలాడుకోవడమేంటి? గత ఐదేళ్లు ఇలానే నాశనమైంది. ప్రభుత్వ పనులు నిర్వహించని కాంట్రాక్టర్‌ను అవసరమైతే మార్పు చేయండి. లేదంటే కేసులు పెట్టండి. పాతపనులను రద్దుచేయాలి. జలజీవన్‌ మిషన్‌ పనులు.. ఒక వరం. జూన్‌కు ముగియాల్సిన పనులను మరో మూడేళ్లు పెంచేలా ప్రధానమంత్రిని ఒప్పించిన సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు ఈ సభ ద్వారా అభినందన తెలియజేస్తున్నాం. నదులు, చెరువుల్లో నీరు లేదు. వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా పనులు చేయాలి. తాగునీటి ఇబ్బందులు ఎదురైతే అధికారులే బాధ్యత వహించాలి. ఉపాధిహామీ పథకం ద్వారా పేదలకు పనులు కల్పించాలి. ప్రజాప్రతినిధులు అభివృద్ధికి సహకరించాలి. అక్రమాలకు పాల్పడే ఒకరిద్దరిపై చర్యలుంటేనే వ్యవస్థ గాడిలో పడుతుంది. ప్రజల్లో కూడా అవగాహన పెరిగింది. డీఎంహెచ్‌ఓ ఆఫీసులో అవినీతి వల్ల చెడ్డపేరు వస్తోంది. చాన్నాళ్ల నుంచి పాతుకుపోయినవారిని ఏరివేయాలి. త్వరలో డీఎంహెచ్‌వో కార్యాలయంలోనే సమీక్ష నిర్వహించి తక్షణం చర్యలు తీసుకుందాం. జిల్లాలో టీబీ, డయేరియా ఎక్కువగా ఉంది. దీనిపై నివారణ చర్యలుండాలి. గత ప్రభుత్వ హయాంలో పేదల భూములను 22ఏ లో చేర్చేశారు. ఇప్పుడు 90 శాతం సమస్యలు రెవెన్యూవే ఉన్నాయి. పేదలు భూములు అమ్ముకుందామంటూ వీలుపడని పరిస్థితి. ఇవన్నీ సరిచేస్తున్నా’మని తెలిపారు.

  • ప్రశ్నించి.. జవాబుతో మాట్లాడలేక..

  • వైసీపీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌.. సమావేశంలో చివరలో మాట్లాడారు. ఇటీవల పాలకొండలోని ఓ సమావేశం నుంచి ఓ ఎంపీడీవో పోలీసులతో తనను బయటకు పంపారని, ఎమ్మెల్సీగా తాను సమావేశాలకు హాజరయ్యే హక్కు తనకు ఉందని.. సమాచారాం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులకు ఉందని తెలిపారు. ఎంపీడీవో తీరుపై ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన ‘సూపర్‌ సిక్స్‌’ ఎప్పుడు అమలు చేస్తారో మంత్రి చెప్పాలని.. అలానే సమాచారం ఎమ్మెల్సీలకు కూడా చెప్పేలా ఆదేశించాలని పేర్కొన్నారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిస్తూ.. రాజకీయపరంగా వైసీపీ తప్పిదాన్ని తూర్పారబట్టారు. ‘వైసీపీ ప్రభుత్వ హయాంలో నేను టెక్కలి ఎమ్మెల్యేగా ఉన్నా. మా రామ్మోహన్‌నాయుడు శ్రీకాకుళం ఎంపీగా ఉన్నారు. మాకు ఏఒక్క కార్యక్రమం కూడా అప్పట్లో చెప్పలేదు. పైగా నా నియోజకవర్గంలో అప్పుడు ముఖ్యమంత్రి మూలపేట పోర్టు పనులను ప్రారంభించేందుకు వచ్చినా నాకు సమాచారం లేదు. నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేపట్టినా ఎమ్మెల్యే ఉండాల్సిందే. కానీ ఆ నిబంధన అమలుకాకపోయినా నేను పట్టించుకోలేదు. భావనపాడు పోర్టును మేము ప్రకటిస్తే.. దాన్ని తీసేసి మూలపేట పోర్టు అని పెట్టి పనులు చేపట్టారు. ఇప్పుడు నేను అడ్డుకోవాలంటే అడ్డుకోగలను. మీరందరూ గతంలో నిర్మించిన భవనాలకు సంబంధించిన పనులు చేపట్టారు. వాటి బిల్లులను కూడా ఇప్పుడు నేను ఆపడంలేదు. వ్యవస్థలు శాశ్వతం.. ప్రభుత్వం శాశ్వతం. ప్రజలు శాశ్వతం. కానీ రాజకీయాలు కాదు. వంశధార నీటిని పలాస వరకు తెచ్చుకోలేకపోయారు. కనీసం ఆమదాలవలస-శ్రీకాకుళం రోడ్డు పూర్తిచేయలేకపోయారు. నేను మంత్రి అయ్యాక పూర్తిచేయించా. మీరు అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించినట్లు మేము చేస్తే ఎలా?... అలా చేయం. కచ్చితంగా ప్రొటోకాల్‌ అందరూ పాటించాల్సిందే. పలాస నియోజకవర్గంలో ఎయిర్‌పోర్టు పెడుతున్నామంటూ అప్పుడే ఆందోళన ప్రారంభించేశారు. ఏ ప్రాజెక్టు తెస్తే ఆ ప్రాజెక్టును తరిమేద్దామంటే ఎట్లా. 74 శాతం వంశధార ప్రాజెక్టు పనులు పూర్తిచేయగా.. మిగిలిన పనులను గత ఐదేళ్లలో పూర్తిచేయలేకపోయారు. నదుల అనుసంధానాన్ని పట్టాలెక్కించలేకపోయారు. ఆఫ్‌షోర్‌ను పట్టించుకోలేదు. గ్రామాలకు రోడ్లు వేయలేకపోయారు. గత ఐదేళ్లలో అప్పటి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి చెప్పగలరా?’ అని మంత్రి అచ్చెన్న ఎదురు ప్రశ్నించారు. ‘ఇక సూపర్‌ సిక్స్‌ విషయానికొస్తే.. ప్రభుత్వం కచ్చితంగా కట్టుబడి ఉంది. ప్రభుత్వం వద్ద డబ్బు లేకున్నా.. ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కోటి అమలు చేస్తున్నాం’ అని అన్నారు.

  • క్యాన్సర్‌ నివారణ చర్యలు తీసుకోండి

  • మెళియాపుట్టి మండలం నడసంద్రంలో క్యాన్సర్‌ రోగుల సంఖ్య పెరగడం ఆందోళన కరమైన విషయం. క్యాన్సర్‌ నివారణకు చర్యలు తీసుకోవాలి. కొత్తూరు ఆసుపత్రిలో పరుపులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కడప నుంచి వచ్చిన ఓ వైద్యాధికారిణి ఇక్కడ విధులు నిర్వహించడం లేదని ప్రజలనుంచి ఫిర్యాదులు అందితే.. నేనే స్వయంగా కలెక్టర్‌కు చెప్పా. ఆమెను అక్కడ నుంచి తప్పించి.. మళ్లీ ఇప్పుడు మా నియోజకవర్గంలోనే నియమించారు. పనిచేయకుండా అందరితో గొడవపడే ఆ వైద్యాధికారిణిని దయచేసి మా నియోజకవర్గంలోనే ఉంచొద్దు.

  • - మామిడి గోవిందరావు, ఎమ్మెల్యే, పాతపట్నం

  • .......................

  • గతంలో చేపట్టిన పనులపై విచారణ చేయాలి

  • అధికారులపై రుజువుల్లేని ఆరోపణలు సరికాదు. అంబటివానిపేటలో మిలటరీ డ్రస్సు వేసుకుని ఓ వ్యక్తి వెళ్తే ఆయనకు అక్కడ విద్యుత్‌ మీటరును ఇచ్చేశారు. ఇటువంటి కొత్త దందాలు జరిగాయి అప్పట్లో. అసలు నిబంధనలు ప్రకారం గ్రేడ్‌-2 ఇసుక లభ్యమవుతుందా..? ప్రస్తుత ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులతోపాటు.. గత ఐదేళ్లలో చేపట్టిన పనులపై నమూనాలను సేకరించి విచారణ చేయాలి. నిర్మించి వదిలేసిన నర్శింగ్‌ కళాశాలను వినియోగంలోకి తేవాలి. పంచాయతీ రాజ్‌కు రెగ్యులర్‌ ఈఈ లేరు. ఆఫీసును ఎత్తేశారు. మళ్లీ ఆఫీసును ఇక్కడ ప్రారంభించాలి.

  • - గొండు శంకర్‌, ఎమ్మెల్యే, శ్రీకాకుళం

    ....................

  • నిధులు గోల్‌మాల్‌పై కేసు ఏదీ?

  • నరసన్నపేట నియోజకవర్గంలో చోడవరంలో సీఎఫ్‌, సీసీలు ఏకమై అవినీతికి పాల్పడ్డారు. రూ.80లక్షలు నిధులు గోల్‌మాల్‌ అయ్యాయి. దీనిపై ఏడు నెలల కిందట విచారణ జరిగినా బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. కనీసం పోలీసు కేసుపెట్టలేదు. దీనివల్ల మహిళా సంఘాలు డీఫాల్టర్‌గా చూపిస్తే ఎట్లా. దీనిపై డీఆర్డీఏ పీడీ ఎందుకు చర్యలు తీసుకోలేదు. పోలాకి మండలం జలజీవన్‌ మిషన్‌ పనుల్లో అసంతృప్తిగా ఉంది. తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. సరిదిద్దాలి.

  • - బగ్గు రమణమూర్తి, ఎమ్మెల్యే, నరసన్నపేట

  • ................

  • ఇంకొందరు సభ్యులు ఏమన్నారంటే..

  • జి.సిగడాం జడ్పీటీసీ సభ్యుడు కాయల రమణ మాట్లాడుతూ.. ‘జడ్పీటీసీలకు తొలి ఆరునెలలు మాత్రమే గౌరవవేతనం ఇచ్చారు. ఆ తర్వాత ఇవ్వలేదు. ప్రభుత్వం మారింది. అందరికీ దండం పెడుతున్నా. జడ్పీటీసీలకు గౌరవవేతనం చెల్లించండి’ అని కోరారు. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ తెలిపారు. ప్రజాప్రతినిధులు కోరుతున్న సమాచారాన్ని నివేదికల రూపంలో అందజేస్తామన్నారు. అలాగే కవిటిలో డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆమె కోరారు.

  • హిరమండలం జడ్పీటీసీ పొగిరి బుచ్చిబాబు మాట్లాడుతూ.. ‘హిరమండలం నిరాదరణకు గురవుతోంది. ఏ ఒక్కగ్రామానికి అనుసంధానం రోడ్లు లేకపోవడం వల్ల .. పక్క నియోజకవర్గం నుంచి ప్రజలు రాకపోకలు చేస్తున్నారు. ఇప్పటికైనా లింకు రోడ్లు నిర్మించాలి. పెండింగ్‌లో ఉన్న రెండు ప్రధాన వంతెన పనులను పూర్తిచేయాలి. అలికాం-బత్తిలి రోడ్డు పనులను బాగుచేయాలి’ అని కోరారు.

Updated Date - Apr 09 , 2025 | 12:02 AM