Wild animals: అడవిని వీడి.. జనావాసాల్లోకి..
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:31 AM
Wild animals:జిల్లాలోని కాశీబుగ్గ, పాతపట్నం అటవీ పరిధిలోని వివిధ వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి.

- మైదాన ప్రాంతాల్లోకి వచ్చేస్తున్న వన్యప్రాణులు
- నీటి కోసం వచ్చి ప్రాణాలు కోల్పోతున్న వైనం
- అటవీ సంపద తరిగిపోతుండడమే కారణం
వారం రోజుల కిందట కాశీబుగ్గ పోలీసు స్టేషన్ ఆవరణలోకి ఓ అడవి గొర్రె వచ్చింది. కుక్కలు దాడి చేయడంతో అది తీవ్రంగా గాయపడింది. ఒక రోజు చికిత్స అనంతరం మృతి చెందింది.
రెండునెలల కిందట పలాస మండలం వీరభద్రాపురం గ్రామ సమీపంలో ఐదు రక్తపింజరి పాములు కనిపించడంతో ప్రజలు భయోందోళనకు గురైయ్యారు. స్నేక్ క్యాచర్ వచ్చి చాకచక్యంగా వాటిని పట్టుకొని సమీప కొండల్లో విడిచిపెటాడు.
రెండు రోజుల కిందట మందస మండలంలో అరుదైన చుక్కల జింకలు కనిపించాయి. నీటి కోసం కొండపై నుంచి కిందకు దిగి గ్రామాల్లో సంచరించాయి. కుక్కలు వెంబడించడంతో అవి రక్షణ కోసం ఇళ్లలోకి చొరబడ్డాయి.
వీరభద్రాపురం వద్ద రక్తపింజరి పాములు(ఫైల్)
పలాస, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కాశీబుగ్గ, పాతపట్నం అటవీ పరిధిలోని వివిధ వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. గ్రామాలు, రోడ్లపై సంచరిస్తూ కనిపిస్తున్నాయి. భామిని, కొత్తూరు ప్రాం తాల్లో ఏకంగా ఏనుగుల గుంపే తిరుగుతుంది. పాములు, ఎలుగుబంట్లు, హైనాల గూర్చి చెప్పనవసరం లేదు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అడవి జంతువులు సంచరిస్తూ ప్రజలను హడలెత్తిస్తున్నాయి.
టిడ్కో గృహ సముదాయం వద్ద పట్టుబడిన భారీ కొండచిలువ(ఫైల్)
పోడు వ్యవసాయం పేరుతో అడవుల్లో చెట్లను నరికివేయడం, కలప కోసం భారీ వృక్షాలను తరలించడం, కొండలు, గుట్టలపై అక్రమంగా కంకర తవ్వకాలు చేపట్టడం తదితర కారణాలతో అడవిలో ఉండాల్సిన జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయని వన్యప్రాణి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు వర్షాభావం కారణంగా నీటి నిల్వలు తగ్గిపోవడంతో జలం కోసం వెతుకుతూ గ్రామాల్లోకి వచ్చి కుక్కలు, మనుషుల దాడుల్లో మృత్యువాత పడుతున్నాయి.
స్వేచ్ఛాజీవులైన జింకలు, అడవి గొర్రెలను మనుషులు తాకితే చాలు వాటి ప్రాణాలు సగం పోయినట్లేనని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అడవుల్లో తగిన నీటి కుంటలు ఏర్పాటు చేయడం, ఆ ప్రాంతాల్లో ఉన్న చెరువులు, కుంటలను అభివృద్ధి చేస్తే నీటి కోసం వన్యప్రాణులు మైదాన ప్రాంతాల్లోకి రాకుండా ఉంటాయి. అడవి జంతువుల రక్షణ కోసం గ్రామాల్లో అటవీశాఖ అధికారులు విస్తృత ప్రచారాలు చేస్తున్నారు. గిరిజన గ్రామాల్లో జంతువులపై అవగాహన కల్పిస్తున్నారు.
కొత్తూరు మండలం వసప వద్ద పంట భూముల్లో సంచరిస్తున్న ఏనుగులు (ఫైల్)
అవగాహన కల్పిస్తున్నాం
ప్రజలకు అడవి జంతువుల రక్షణపై అవగాహన కల్పిస్తున్నాం. జింకలు గ్రామాల్లోకి వచ్చి వీధి కుక్కల బారిన పడి మృతి చెందుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాటి రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నాం. జంతువుల వేట సాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అడవుల్లో చెట్లు నరకడం, కంకర తవ్వకాలను అడ్డుకోవడంపై దృష్టి సారించాం.
-మురళీకృష్ణ, అటవీశాఖ అధికారి, కాశీబుగ్గ