Women's Mart: నడుపుదామా.. మూసేద్దామా?
ABN , Publish Date - Apr 13 , 2025 | 01:04 AM
Women's Mart: నరసన్నపేట పట్టణంలోని మహిళా మార్టును నడుపుదామా.. లేదా మూసేద్దామా అని డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్ అడగడంతో వీవోఏలు (గ్రామసంఘాల ఆర్గనైజర్లు) ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

- మహిళా మార్టుపై అభిప్రాయం కోరిన డీఆర్‌డీఏ పీడీ
- షాక్‌కు గురైన వీవోఏలు
నరసన్నపేట, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): నరసన్నపేట పట్టణంలోని మహిళా మార్టును నడుపుదామా.. లేదా మూసేద్దామా అని డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్ అడగడంతో వీవోఏలు (గ్రామసంఘాల ఆర్గనైజర్లు) ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. శనివారం పట్టణంలోని వెలుగు కార్యాలయంలో నరసన్నపేట క్లస్టర్ పరిధిలోని వీవోఏలతో ఆయన సమావేశం నిర్వహించారు. గతంలో ఏర్పాటు చేసిన మహిళా మార్టును సక్రమంగా నిర్వహించగలమా ..లేదా మూసేద్దామా అని పీడీ ప్రశ్నించడంతో వీవోఏలు అయోమయానికి గురయ్యారు. గతనెల 21న ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన మాహిళా మార్టులో అనకొండలు అనే కథనంపై ఆయన స్పందించి విచారణ చేయాల్సింది పోయి.. మూసేద్దామా అని అనడంపై మహిళ సంఘాల సభ్యుల్లో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. 47 గ్రామ సమాఖ్య సంఘాలకు చెందిన 22,500 సభ్యులు ఒక్కొక్కరు రూ.110చొప్పున రూ.28 లక్షలు సేకరించి మార్టును ఏర్పాటు చేశారు. మొదట్లో సరుకుల అమ్మకాలు బాగా జరగడంతో రూ.3లక్షలు డిపాజిట్ చేశారు. అంతా బాగున్న సమయంలో కొందరు అనకొండలు ప్రవేశించి మార్టులో ఉన్న సరుకులను పక్కదారి పట్టించారు. ఈ వ్యవహారంపై డ్వాక్రా మహిళలకు తాము ఎలా సమాధానం చెప్పాలో తెలియడం లేదని పీడీ వద్ద వీవోఏలు వాపోయినట్లు సమాచారం. అయితే మార్టులో జరిగిన వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు నిర్వహించిన తరువాత, తమ అభిప్రాయం చెబుతామని పీడీ వద్ద వీవోఏలు కరఖండిగా చెప్పారు. డీఆర్‌డీఏ అధికారుల నిర్లక్ష్యంపై డ్వాక్రా సంఘాల మహిళలు భగ్గుమంటున్నారు. తాము కట్టిన వాటా ధనాన్ని వచ్చిన లాభంతో కలిపి తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మహిళా మార్టులో నిధుల గోల్‌మల్.. చోడవరం సీసీ నిధుల పక్కదారిపై డీఆర్‌డీఏ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థంకావడం లేదు. ఇటీవల జరిగిన జడ్పీ సమావేశంలో చోడవరం సీసీ వ్యవహారంపై ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఫిర్యాదు చేశారు. అయినా డీఆర్‌డీఏ అధికారుల్లో చలనం లేకపోవడం గమనార్హం.