Liquor shops: నిబంధనలు పట్టట్లే!
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:23 AM
Liquor shops:జిల్లాలో చాలా మద్యం దుకాణాల వద్ద కనీస నిబంధనలు పాటించడం లేదు. మద్యం దుకాణాల చుట్టూ అనధికారికంగా షాపులు వెలుస్తున్నాయి.

- మద్యం దుకాణాల చుట్టూ అనధికారికంగా షాపులు
- అక్కడే బహిరంగంగా తాగుతున్న వైనం
- విచ్చల విడిగా బెల్టు దుకాణాలు
- అధిక ధరలకు విక్రయాలు
ఇచ్చాపురం, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో చాలా మద్యం దుకాణాల వద్ద కనీస నిబంధనలు పాటించడం లేదు. మద్యం దుకాణాల చుట్టూ అనధికారికంగా షాపులు వెలుస్తున్నాయి. అక్కడే మద్యం తాగుతుండడంతో స్థానికులు అసౌకర్యానికి గురవుతున్నారు. జిల్లాలో 158 మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు. అయితే చాలా వరకూ షాపుల వద్ద కనీస నిబంధనలు పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేసిన వారు చుట్టుపక్కల ఉన్న ఇతర షాపులను సైతం అద్దెకు తీసుకుంటున్నారు. అక్కడ తమ వారితోనే ఫాస్టుఫుడ్ సెంటర్లు, పాన్ షాపులు పెడుతున్నారు. వాస్తవానికి మద్యం దుకాణాల వద్ద ప్రభుత్వం ఎటువంటి పర్మిట్ రూమ్‌లకు అనుమతివ్వలేదు. అక్కడే తాగేందుకు అవకాశమిస్తే ప్రభుత్వానికి అదనంగా రూ.5 లక్షలు కట్టాల్సి ఉంది. నోటిఫికేషన్‌లోనే ఇది స్పష్టంగా చెప్పారు. ఒక వేళ షాపులో మద్యం నిల్వలు చాలకుంటే.. అదనంగా గోదాములు అద్దెకు తీసుకున్నవారు ఏడాదికి ప్రభుత్వానికి రూ.లక్ష వరకూ చెల్లించాల్సి ఉంటుంది. కానీ, జిల్లాలో చాలావరకూ షాపులు పర్మిట్ రూమ్‌లకు అనుమతి తీసుకోలేదు. అదనంగా ప్రభుత్వానికి రూపాయి చెల్లించలేదు. కానీ, ఎక్కడికక్కడే మద్యం దుకాణాల చుట్టూ వివిధ షాపులు వెలుస్తున్నాయి. అయితే వాటిని మద్యం వ్యాపారులే అద్దెకు ఇవ్వడమో, అనధికారికంగా నిర్వహించడమో జరుగుతోంది. అదే మాదిరిగా గోదాములు సైతం అనధికారికంగా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది.
అంతా సిండికేట్!
ఈసారి మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు వ్యాపారులే కాదు అన్నివర్గాల ప్రజలు పోటీపడ్డారు. దీంతో రికార్డుస్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. అయితే డ్రా తీయకుండా ముందే చాలా మంది సిండికేట్‌గా మారారు. షాపులు ఎవరికి దక్కినా.. అందరికీ వాటాలు అన్నవిధంగా ఒప్పందాలు చేసుకున్నారు. లాటరీ తీసిన తరువాత కూడా ఒప్పందాలు జరిగాయి. జనాభా ప్రాతిపదికన మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి. మండలంలో కనిష్టంగా ఐదు వరకూ షాపులను ఏర్పాటుచేశారు. పట్టణ ప్రాంతాల్లో అయితే 7 నుంచి 10 వరకూ షాపులు ఏర్పాటయ్యాయి. కొన్ని షాపుల్లో రోజువారి విక్రయాలు అధికంగా ఉన్నాయి. మరికొన్ని వాటిలో ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగడం లేదు. విక్రయాలు తక్కువగా ఉన్నచోట ‘బెల్ట్’ను ప్రోత్సహిస్తోన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
బహిరంగ ప్రదేశాల్లో..
బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న వారితో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. క్రీడా మైదనాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఖాళీ స్థలాలు మందుబాబుల అడ్డాలుగా మారిపోయాయి. సాయంత్రం 5 గంటలు దాటితే చాలు మద్యం బాబుల సందడి ప్రారంభమవుతుంది. ముఖ్యంగా పట్టణాల్లో ఈ సంస్కృతి అధికంగా ఉంది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం నేరం. కానీ, జిల్లాలో ఈ నిబంధన కనీసం అమలు కావడం లేదు. చాలాచోట్ల పోలీసుల హెచ్చరికలతో మందుబాబులు వెనక్కి తగ్గుతున్నారు. మందుబాబుల ఆగడాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరముంది.
ఇష్టానుసారంగా బెల్టు షాపులు..
పట్టణ, మండల పరిధిలో ఇష్టానుసారంగా బెల్టు షాపులు నిర్వహిస్తున్నా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నా, లూజ్ అమ్మకాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. నిబంధన లకు విరుద్ధంగా 21లోపు వయసు గల వారికి మద్యం విక్రయిస్తున్నారు. ఒక క్వాటర్ మీద రూ.10 పెంచుకోమని ప్రభుత్వం అనుమతి ఇస్తే, పాత స్టాక్‌ను కూడా పెంచుకుంటూ అమ్మకాలు జరుపుతున్నారు.
అనుమతిలేదు
మద్యం దుకాణాల వద్ద తాగేందుకు అనుమతి లేదు. ఒక వేళ పర్మిట్ రూమ్‌లు కావాలంటే ప్రభుత్వానికి రూ.5 లక్షలు కట్టాలి. లేకుంటే అక్కడే చిరుతిళ్ల దుకాణాల వద్ద తాగితే నేరం. బహిరంగ ప్రదేశాల్లో సైతం మద్యం తాగకూడదు. అలా తాగి దొరికితే కేసులు నమోదు చేస్తాం.
-మీసాల చిన్నమనాయుడు, సీఐ, ఇచ్ఛాపురం