Vision 2047: పండంటి ప్రగతికి 10 సూత్రాలు!’
ABN , Publish Date - Mar 01 , 2025 | 04:58 AM
పేరుకు ఇది.. ఒక్క ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జమా ఖర్చుల పద్దు! కానీ... 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధన దిశగా ఈ బడ్జెట్‌లో తొలి అడుగు వేశారు. అందుకు తగిన విధంగా లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. దీనికోసం ‘పది సూత్రాలు’ నిర్దేశించుకున్నారు.

చంద్రబాబు 1990వ దశకంలోనే విజన్ 2020 డాక్యుమెంట్‌ను రూపొందించారు. అది సాకారమైంది. ఇప్పుడు... 2024లో ‘స్వర్ణాంధ్ర 2047’కు శ్రీకారం చుట్టి రాష్ట్రాభివృద్ధికి మార్గనిర్దేశం చేశారు. స్థిరమైన వృద్ధిరేటు, తలసరి ఆదాయం పెంపు... అభివృద్ధి ఫలాలను అణగారిన వర్గాలకు అందించడం ద్వారా పేదరిక నిర్మూలనే దీని లక్ష్యం. స్వర్ణాంధ్ర-2047 సాధన దిశగా మా ప్రభుత్వం పనులు మొదలుపెట్టింది.
- పయ్యావుల కేశవ్, ఆర్థిక మంత్రి
‘స్వర్ణాంధ్ర-2047’ దిశగా తొలి అడుగు
దాని మేరకే బడ్జెట్‌లో కేటాయింపులు
రాష్ట్ర పునర్నిర్మాణం, ఆర్థిక వృద్ధి లక్ష్యం
రూ.3.22 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్
అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యం
మూలధన వ్యయానికి రెట్టింపు నిధులు
‘సాగు’ వృద్ధికి రూ.29 వేల కోట్లు
పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు, మౌలిక సదుపాయాలకు పెద్దపీట
‘తల్లికి వందనం’ కోసం 9,400 కోట్లు
‘అన్నదాత సుఖీభవ’కు కేటాయింపులు
మొత్తం బడ్జెట్ - 3,22,359
రెవెన్యూ వ్యయం - 2,51,162
మూలధన వ్యయం - 40,636
రెవెన్యూ లోటు - (-)33,186 (రూ.కోట్లలో..)
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
అభివృద్ధి... సంక్షేమం... ఏడాదికి కేటాయింపులు... దీర్ఘకాలిక లక్ష్యాలు! ‘స్వర్ణాంధ్ర-2047’ సాధన దిశగా అడుగులు! కూటమి సర్కారు ప్రవేశపెట్టిన తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌కు ఇదే దిశా, దశ! రూ.3,22,359 కోట్ల భారీ మొత్తంతో 2025-26 వార్షిక బడ్జెట్ రూపుదిద్దుకుంది. పేరుకు ఇది.. ఒక్క ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జమా ఖర్చుల పద్దు! కానీ... 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధన దిశగా ఈ బడ్జెట్‌లో తొలి అడుగు వేశారు. అందుకు తగిన విధంగా లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. దీనికోసం ‘పది సూత్రాలు’ నిర్దేశించుకున్నారు.
పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నీటి సంరక్షణ, వ్యవసాయం-అభివృద్ధి, రవాణా సదుపాయాల మెరుగుదల, తక్కువ ఖర్చుతో ఇంధన ఉత్పత్తి, స్వచ్ఛాంధ్ర, టెక్నాలజీ విస్తృత వినియోగం, తక్కువ ధరలతో అత్యుత్తమ నాణ్యమైన ఉత్పత్తుల తయారీ... ఈ పది సూత్రాలతో 2047 నాటికి రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టాలని నిర్ణయించారు. ఈ దీర్ఘకాలిక ప్రణాళికకు అనుగుణంగా 2025-26 బడ్జెట్‌ను రూపొందించారు.
మూలధన వ్యయం పెంచుతూ...
రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన వ్యయం అవసరం. ఇప్పుడు పెట్టే మూలధన వ్యయమే (క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్) రేపు సంపద సృష్టిస్తుంది. అభివృద్ధికి బాటలు వేస్తుంది. మూలధన వ్యయానికి ఖర్చు పెట్టకపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా తీస్తుందన్న ప్రాథమిక సూత్రాన్ని పాటించి... దీనికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం మూలధన వ్యయం కోసం 59 శాతం ఖర్చు చేస్తే, 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం కేవలం 22 శాతం ఖర్చు చేసింది. జగన్ పాలనలో 60 శాతం తగ్గిన మూలధన వ్యయాన్ని కూటమి ప్రభుత్వం ఇప్పుడు గాడిలో పెట్టింది. పెట్టుబడుల వ్యయాన్ని రెట్టింపు చేసి... ఏకంగా రూ.40,635 కోట్లు కేటాయించింది.
ప్రగతి బాటలు...
పారిశ్రామిక అభివృద్ధి, నైపుణ్యం పెంపు, ఉపాధి కల్పన... ప్రగతి సాధనకు ఇవి కీలకం. వీటి కోసం ఈ బడ్జెట్‌లో రూ.12,112 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా... విశాఖ - చెన్నై, చెన్నై-బెంగళూరు, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి రూ.837 కోట్లు ఖర్చు చేయనునున్నారు. పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎ్‌సఎంఈలకు ప్రోత్సాహకాల కోసం రూ.1400 కోట్లు, పీపీపీపీ విధానంలో వీజీఎఫ్ (వయబులిటీ గ్యాప్ ఫండింగ్) కోసం రూ.2,000 కోట్లు కేటాయించారు. దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన - అజీవికా కోసం రూ.745 కోట్లు కేటాయించగా... ఐటీఐ, ఐఐఐటీ, స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (కాకినాడ) కోసం రూ.210 కోట్లు ఖర్చు చేయనున్నారు.
‘కృషి’తో నాస్తి దుర్భిక్షం...
సాగు బాగుంటే... దుర్భిక్షం ఉండదు! అందుకే... వ్యవసాయం, నీటి సంరక్షణ పద్దులకు రూ.29,655 కోట్లు కేటాయించారు. ఇందులో ‘అన్నదాత సుఖీభవ’ పథకం వాటాయే రూ.6300 కోట్లు. అలాగే... ధరల స్థిరీకరణ నిధి కోసం రూ.300 కోట్లు కేటాయించారు.
జనమే బలం...
సకలవర్గాల సమ్మిళిత ప్రగతి, సాధికారత... ఈ జంట సూత్రాలతో రాష్ట్ర ప్రగతిని మార్చవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా... మానవ వనరులను పెంపొందించడం... వారిని నిపుణులుగా తీర్చిదిద్దడం... పేదరిక నిర్మూలన... శుభ్రమైన పరిసరాల్లో నివాసానికి ‘స్వచ్ఛాంధ్ర’ సాధనకు సంబంధించిన పద్దులకు ఏకంగా రూ.1,42,349 కోట్లు కేటాయించింది. ఇందులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకోసమే 27,518 కోట్లు ఖర్చు చేయనుంది. తల్లికి వందనం పథకం కోసం రూ.9,407 కోట్లు, స్వచ్ఛాంధ్ర కోసం రూ.820 కోట్లు కేటాయించారు.
రథ చక్రాలు...
ఆర్థిక, సాంకేతిక ప్రగతితో రాష్ట్రాభివృద్ధి వేగిరమవుతుందనే ఉద్దేశంతో సంబంధిత రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. వీటికి ఏకంగా 55,730 కోట్లు కేటాయించారు. అమరావతిని ‘గ్రోత్ ఇంజిన్’గా భావిస్తున్న నేపథ్యంలో... నూతన నగరాభివృద్ధికోసం బడ్జెట్‌లో రూ.6వేల కోట్లు వెచ్చించనున్నారు. ఇక... మౌలిక సదుపాయాలకు సంబంధించి మచిలీపట్నం, భావనపాడు, కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులు..
భోగాపురం, విజయవాడతోపాటు రీజనల్ ఎయిర్‌పోర్టులు, కొత్త పారిశ్రామిక నోడ్స్ కోసం రూ.605 కోట్లు కేటాయించారు. ఇంధన రంగానికి రూ.13,600 కోట్లు... రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కోసం రూ.10 కోట్లు, ఆర్టీజీఎస్, సీఎం కాల్ సెంటర్ కోసం రూ.101 కోట్లు, ఐటీ, ఎలక్ర్టానిక్ పరిశ్రమలకు ప్రోత్సాహకాల కోసం రూ.300 కోట్లు కేటాయించారు.
ఇదీ మార్గం... ఇదీ లక్ష్యం
2047 నాటికి స్వర్ణాంధ్ర సాధన, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలివి! వీటి ఆధారంగానే ‘స్వర్ణాంధ్రకు పది సూత్రాలు’ రూపొందించి, బడ్జెట్‌లో కేటాయింపులు జరిపింది.
ప్రస్తుతం 5.3 కోట్లుగా ఉన్న రాష్ట్ర జనాభా 2047 నాటికి 5.8 కోట్లకు చేరాలి.
70.6 ఏళ్లుగా ఉన్న సగటు ఆయుఃప్రమాణం 85 ఏళ్లకు పెరగాలి.
36 శాతం ఉన్న పట్టణ జనాభాను 60 శాతానికి పెంచాలి.
72 శాతం ఉన్న అక్షరాస్యత రేటును 100 శాతానికి చేర్చాలి.
ఉపాధి, ఉద్యోగ రంగాల్లో ప్రస్తుతం 45.8 శాతం మాత్రమే ఉన్న మహిళల భాగస్వామ్యాన్ని 80 శాతానికి పైగా పెంచాలి.
ప్రస్తుతం 170 బిలియన్ డాలర్లుగా ఉన్న జీఎ్‌సడీపీని 2.4 ట్రిలియన్ డాలర్లకు పెంచాలి.
ప్రస్తుతం 3,200 డాలర్లుగా ఉన్న తలసరి ఆదాయాన్ని 42,000 డాలర్లకు చేర్చాలి.
ఇప్పుడు 19.3 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు 450 బిలియన్ డాలర్లకు పెరగాలి.
వచ్చే ఐదేళ్లలో వృద్ధిరేటును రెండింతలు పెంచి 29.29 శాతానికి చేర్చాలి.
విద్యుత్ సబ్సిడీ 13,600 కోట్లు
విద్యుత్ సబ్సిడీ భారం రూ.13,600 కోట్లను రాష్ట్రప్రభుత్వమే భరించనుంది. వ్యవసాయం, పారిశ్రామిక రంగం, అర్హులైన ఎస్సీ,ఎస్టీ లబ్ధిదారులకు సబ్సిడీలు, రాయితీలను పూర్తిగా భరిస్తామని బడ్జెట్‌లో స్పష్టం చేసింది.
ఏ రంగానికి ఎంత?