అభివృద్ధిపై అక్కసు!
ABN , Publish Date - Apr 04 , 2025 | 01:24 AM
వైసీపీ రాజకీయాలు గ్రామాభివృద్ధిని కూడా అడ్డుకునే స్థాయికి దిగజారాయి. పామర్రు మండలం ఐనంపూడి గ్రామంలో రోడ్లు, డ్రెయిన్ల అభివృద్ధికి రూ.20 లక్షల కేంద్ర ప్రాయోజిత పథక నిధులు మంజూరైనా వాటిని ఖర్చు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న తలంపు అధికార వైసీపీ పాలకవర్గానికి తట్టడం లేదు. గతంలో మాకు పనులు ఇవ్వలేదు కాబట్టి.. ఇప్పుడు మేమే పనులు చేసుకుంటామని పాలకవర్గం భీష్మించుకుని కూర్చుంది. మంజూరైన నిధులను ఖర్చు చేయకుండా తాత్సారం చేస్తోంది.

- గ్రామాభివృద్ధిని అడ్డుకునేలా వైసీపీ రాజకీయాలు!
- ఐనంపూడి గ్రామ పంచాయతీలో పనుల వివాదం
- కేంద్ర ప్రాయోజిత పథకం ద్వారా రూ.20 లక్షలు మంజూరు
- పనులు చేసేందుకు తీర్మానం చేయని పంచాయతీ పాలకవర్గం
- కమీషన్లపై నామినేషన్ విధానంలో కేటాయించేందుకు చర్యలు
- రూ.7 లక్షలు లంచం అడుగుతున్నారని టీడీపీ నాయకుల ఆరోపణలు
- పనులన్నీ వాళ్లే చేస్తామని ఒత్తిడి తెస్తున్నారంటున్న సర్పంచ్ పరంజ్యోతి
- గ్రామాభివృద్ధి కోసం ఉభయులు పాటు పడాల్సిందిగా గ్రామస్థుల హితవు
పామర్రు, ఏప్రిల్ 03 (ఆంధ్రజ్యోతి): వైసీపీ రాజకీయాలు గ్రామాభివృద్ధిని కూడా అడ్డుకునే స్థాయికి దిగజారాయి. పామర్రు మండలం ఐనంపూడి గ్రామంలో రోడ్లు, డ్రెయిన్ల అభివృద్ధికి రూ.20 లక్షల కేంద్ర ప్రాయోజిత పథక నిధులు మంజూరైనా వాటిని ఖర్చు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న తలంపు అధికార వైసీపీ పాలకవర్గానికి తట్టడం లేదు. గతంలో మాకు పనులు ఇవ్వలేదు కాబట్టి.. ఇప్పుడు మేమే పనులు చేసుకుంటామని పాలకవర్గం భీష్మించుకుని కూర్చుంది. మంజూరైన నిధులను ఖర్చు చేయకుండా తాత్సారం చేస్తోంది. మంచినీటి సమస్య ఎదుర్కొంటున్న గ్రామంలో యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన పనులను అడ్టుకుంటోంది. నామినేషన్ల ప్రాతిపదికన తమ వాళ్లకు పనులు అప్పగించేందుకు ముందు రంగం సిద్ధం చేసినా.. ఆ తర్వాత తేడాలు రావటంతో వాటిని పక్కనపెట్టారు. ఈ పనులను చేపట్టేందుకు పంచాయతీ పాలకవర్గం దృష్టికి తీసుకు వచ్చి తీర్మానాన్ని ఆమోదించే ప్రయత్నం కూడా చేయటం లేదు. తీర్మానాన్ని ప్రవేశపెడితే పనులు చేపట్టాల్సి వస్తుందన్న ఉద్దేశ్యంతో వైసీపీ సర్పంచ్ బట్టు పరంజ్యోతి మిన్నుకుండిపోతున్నారు. వైసీపీ సర్పంచ్ భర్త కూడా ఈ పనులు జరగకుండా అడ్డుపడుతున్నాడన్న విమర్శలు వస్తున్నాయి. పనులు చేపట్టాలంటే ఔట్‌రేట్‌గా రూ.7 లక్షలు ఇస్తేనే తీర్మానం ఆమోదం అవుతుందని సర్పంచ్ భర్త చెబుతున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
చిన్న గ్రామానికి ఈ నిధులు ఎంతో అవసరం
ఐనంపూడి గ్రామానికి మొత్తం రూ.20లక్షల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో రూ.14లక్షల నిధులతో నాలుగు సీసీ రోడ్లు నిర్మాణంతోపాటు రూ.5 లక్షల వ్యయంతో డ్రైనేజీ అభివృద్ధి, మరో రూ.లక్ష నిధులతో తాగునీటి పైపుల లీకులను అరికట్టడానికి కొత్త పైపులైన్ల నిర్మాణం కోసం వినియోగించవలసి ఉంది. మండలంలో మైనర్ పంచాయతీ అయిన ఐనంపూడి గ్రామం దాదాపు 791 మంది గ్రామ జనాభా కలిగి ఉంది. వారిలో 501 మంది దళితులు, 290 మంది ఇతరులు ఉన్నారు. 2020-21 మధ్యలో జరిగిన గ్రామ సర్పంచ్ ఎన్నికల పోరులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి బట్టు పరంజ్యోతి ఎన్నికయ్యారు. ఆ తర్వాత గ్రామాభివృద్ధి పేరుతో వైసీపీ పంచన చేరారు. గ్రామాభివృద్ధి పనుల విషయంలో చొరవ చూపించకపోవటంతో స్థానికంగా విమర్శలు వస్తున్నాయి. చేపట్టాల్సిన పనుల విషయంలో సాగదీత వల్ల నష్టం జరుగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
కమీషన్ల కోసం జాప్యం
కమీషన్ల కోసమే పనులను చేపట్టకుండా జాప్యం చేస్తున్నారని స్థానిక గ్రామ టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. కమీషన్లు ఇచ్చిన వారికే పనులు అప్పగిస్తామని బహిరంగంగా చెబుతున్నారని ఆరోపిస్తున్నారు. సర్పంచ్ వాదన మాత్రం మరోలా ఉంది. ఈ నిధులు 2021లో విడుదలైనప్పటికీ ఏ పనులు నిర్వహించాలో కేంద్ర ప్రభుత్వం సరైన మార్గదర్శకాలు విడుదల చేయక పోవడంతో ఆ నిధులుపై సందిగ్ధం నెలకొందని చెబుతున్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పనుల నిర్వహణ నిమిత్తం ఎలా ఖర్చు చేయాలో స్పష్టం చేసిందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో సర్పంచ్ ఈ పనులను నామినేషన్ విధానంలో తమకు నచ్చిన వారికి కేటాయించేందుకు సిద్ధమవుతుండటంతో గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పనులు పారదర్శకంగా జరగాలంటే తక్షణం టెండర్లు పిలవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. టెండర్లు పిలిస్తే పనులు ఆలస్యం అవుతాయనుకుంటే పాలకవర్గాన్ని సమావేశపరచి కలిసికట్టుగా పనులు చేసుకునే విధంగానైనా నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇవేమీ పట్టకుండా.. పనులకు తీర్మానం చేయకుండా. ఎవ్వరికీ కట్టబెట్టకుండా ఉద్దేశ్యపూర్వక జాప్యం చేయటం పలు అనుమానాలకు దారి తీస్తోంది. గ్రామ టీడీపీ నేత ఒకరు ఆ పనులను తనకే ఇవ్వాలని పట్టుబట్టడం వల్ల ఆలస్యం జరుగుతోందన్న వాదనలను సర్పంచ్ తెరమీదకు తెస్తున్నారు. గ్రామస్థులు మాత్రం రాజకీయాలకతీతంగా ఎన్నికలలో గెలిచారని, గ్రామాభివృద్ధికి సహకరించాల్సిందిగా ఉభయులకు విజ్ఞప్తి చేస్తున్నారు.