Share News

CM Chandrababu Naidu: ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తాం

ABN , Publish Date - Mar 30 , 2025 | 04:17 AM

తెలుగుదేశం పార్టీ 43 ఏళ్ల పురస్కరించుకొని మంగళగిరిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు పార్టీ స్థాపకుడు ఎన్టీఆర్‌కు నివాళులర్పించి, టీడీపీ సంక్షేమానికి మార్గదర్శిగా నిలిచిందని తెలిపారు.

CM Chandrababu Naidu: ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తాం

సంక్షేమానికి మారుపేరు టీడీపీ

రాజకీయ కక్షలకు నేను దూరం

తప్పు చేసిన వారి తాట తీస్తా

టీడీపీ ప్రాంతీయ పార్టీ కాదు

జాతీయభావాలున్న దేశభక్తి పార్టీ

పార్టీకి వారసులం.. పెత్తందారులం కాదు

కార్యకర్తల త్యాగం గుర్తుపెట్టుకుంటా

రాష్ట్రంలో సంపద పెంపుపై దృష్టి పెట్టాం

టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవంలో చంద్రబాబు వ్యాఖ్యలు

అమరావతి, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): టీడీపీ స్థాపనకు ముందు రాజకీయాలంటే పెత్తందారీ వ్యవస్థ అన్నట్టు నడిచేవని, అప్పటి వరకూ పాలనకే ప్రభుత్వాలు పరిమితం కాగా, ఎన్టీఆర్‌ వచ్చాక సంక్షేమానికి శ్రీకారం చుట్టారని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దేశానికి సంక్షేమ పథకాలను పరిచయం చేసిందే టీడీపీయేనన్నారు. తెలుగువారు ఉన్నంత వరకూ పార్టీ ఉంటుందని తెలిపారు. టీడీపీ 43 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌కు చంద్రబాబు ఘన నివాళులు అర్పించారు. అనంతరం జెండా ఎగురవేసి కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలకు తినిపించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడారు. నాయకులు, కార్యకర్తలూ అందరం పార్టీకి వారసులమేగానీ పెత్తందారులం కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ‘‘ఎవరైనా చరిత్ర రాస్తే టీడీపీ ఆవిర్భావానికి ముందు తర్వాత అని రాయాల్సిందే. భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించి వారికి అండగా నిలిచిన పార్టీ ఇది. టీడీపీ వచ్చాకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలకు రాజకీయ అధికారం వచ్చింది.

uj.gif

వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మరింత పైకి తేవడమే నా లక్ష్యం. మొన్నటి ఎన్నికల్లో అన్ని వర్గాలు, అన్ని కులాలను రాజ్యాధికారంలో బాగస్వాములను చేస్తూ సీట్లు ఇచ్చాం. ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకున్నాం’’ అని చంద్రబాబు తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..


జాతీయస్థాయిలో మనదే కీలక పాత్ర

‘‘టీడీపీ ప్రాంతీయ పార్టీ మాత్రమే కాదు, జాతీయభావాలు ఉండే దేశభక్తి కలిగిన పార్టీ. నేషనల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యక్తి ఎన్టీఆర్‌. మనం యునైటెడ్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేశాం. ఎన్టీయే 1, ఎన్డీయే 2, అలాగే ప్రస్తుతం కేంద్రంలో టీడీపీదే కీలకపాత్ర. దేశంలో మరే పార్టీకీ దక్కని విధంగా పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా పనిచేశాం. టీడీపీ ముందుచూపుతోనే సంపద సృష్టి సాధ్యమైంది. ఆనాడు టీడీపీ ప్రారంభించిన పనుల వల్ల దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రంగా ఈనాడు తెలంగాణ నిలిచింది.’’

ఏపీ పునర్నిర్మాణం కోసమే కూటమి ఏర్పాటు

‘‘దగాపడిన రాష్ట్రాన్ని నిలబెట్టి, ఏపీని పునర్నిర్మించాలని టీడీపీ, బీజేపీ, జనసేన కలిశాయి. మనపై ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అప్పులు చేసి సంక్షేమం ఇస్తే కొన్నాళ్లకు ఆగిపోతాయి. అందుకే సంపద పెంపుపై దృష్టి పెట్టాం. ఓవైపు సంక్షేమం, అభివృద్ధి చేస్తూనే రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నాం. గత పాలకులు రూ.9.94 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారు. అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. రూ.200 పింఛన్‌ను రూ.2వేలకు పెంచాం. గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఏడాదికి రూ.250 చొప్పున రూ.1000 పెంచడానికి ఐదేళ్లు సమయం తీసుకుంది. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3వేలు నుంచి రూ.నాలుగు వేలు చేశాం. దివ్యాంగుల పింఛను రూ.ఆరువేలకు పెంచాం. పింఛన్లకు ఏడాదికి రూ.33 వేల కోట్లు వెచ్చిస్తున్నాం. అన్నా క్యాంటీన్లు పెట్టాం. దీపం-2 కింద ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఇస్తున్నాం.

fgh.gif

ఏప్రిల్‌, మే నెలలో అన్నదాత సుఖీభవ, తల్లికి వందం అందిస్తాం. మత్స్యకారులకు రూ.20వేలు ఆర్థికసాయం చేస్తాం. గత ఐదేళ్లలో నిలిపేసిన అమరావతి, పోలవరం పనులు తిరిగి ప్రారంభిస్తాం. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఎంతో మంది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు.’’ అని చంద్రబాబు తెలిపారు.


కార్యకర్త ఫస్ట్‌.. ఆ తర్వాతే నాయకుడు

‘‘తెలుగుదేశం కార్యకర్తలు నాకు ప్రాణసమానం. ఇన్నేళ్ల ప్రయాణంలో కార్యకర్తల అండదండలతోనే ఎన్నో సవాళ్లు అధిగమించాం. పార్టీయే ప్రాణంగా బతికే పసుపు సైనికులందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను. కార్యకర్తల బాధలు చూసి నిద్రపోని రోజులు ఉన్నాయి. కార్యకర్తల త్యాగాలు చూశా ను. ‘టీడీపీని వీడితే నీ ప్రాణాలు తీయకుండా వదిలేస్తా’మన్నా టీడీపీ జెండా వదలనంటూ ప్రాణాలు పోగొట్టుకున్న చంద్రయ్యలను చూశాను.గత పాలకులు విష సంస్కృతి తెచ్చారు. కానీ రాజకీయ కక్షలకు టీడీపీ దూరం. అదే సమయంలో మంచికి మం చి.. చెడుకు చెడు. ఎవరైనా చెడు చేసి తప్పించుకోవాలంటే తాట తీస్తాను. కార్యకర్తలు హుషారుగా ఉంటే టీడీపీకి ఓటమి లేదు. వారిలో జోష్‌ తగ్గితే విపక్షాలకు కొమ్ములు వస్తాయి. కార్యకర్త ఫస్ట్‌.. ఆ తర్వాతే నాయకుడు. నాయకులు వస్తుంటారు... పోతుంటారు. కానీ కార్యకర్తలు శాశ్వతంగా ఉంటారు. 83 రోజుల్లో కోటి సభ్యత్వాలు చేసిన ఏకైక పార్టీ టీడీపీ.’’

‘‘టీడీపీని లేకుండా చేస్తామని విర్రవీగినవారు కాలగర్భంలో కలిసిపోయారు. పార్టీని స్థాపించిన ముహూర్త బలం, సంకల్పం చాలా గొప్పవి. తెలుగుదేశం ఓ స్వర్ణయుగం అని చరిత్రలో చెప్పుకొనే రోజులు వస్తాయి. 43 ఏళ్లుగా పార్టీకి ఎన్నో సంక్షోభాలు ఎదురయ్యాయి. ప్రతి సంక్షోభాన్నీ అవకాశంగా మలుచుకున్నాం.’’

- టీడీపీ అధినేత చంద్రబాబు


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..

Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్‌పై మంత్రి రామానాయుడు ఫైర్

Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం

For More AP News and Telugu News

Updated Date - Mar 30 , 2025 | 04:29 AM