Share News

వివాదాల ‘నల్లూరి’

ABN , Publish Date - Apr 04 , 2025 | 01:22 AM

శతాబ్దాల చరిత్ర కలిగిన పటమటలోని నల్లూరి వారి ధర్మతోట భూముల వ్యవహారం రచ్చకెక్కింది. నల్లూరి వారి ధర్మతోట భూముల్లో ఉన్న వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఇప్పటికే దేవదాయ శాఖ పరిధిలోకి రాగా, దీనికి అనుబంధంగా ఉన్న నల్లూరి వారి కళ్యాణ మండపం కూడా దేవదాయ శాఖకే చెందుతుందని తాజాగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో నల్లూరి వారి కళ్యాణ మండపాన్ని స్వాధీనం చేసుకునేందుకు దేవదాయశాఖ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

వివాదాల ‘నల్లూరి’

- రచ్చకెక్కిన నల్లూరి వారి ధర్మతోట భూముల వ్యవహారం

-కళ్యాణ మండపం స్థలం దేవదాయశాఖదేనని తేల్చిన న్యాయస్థానం

-స్వాధీనానికి దేవదాయ శాఖ సన్నద్ధం

- వారం రోజుల్లో అప్పగించకపోతే రెవెన్యూ, పోలీసుల సహకారంతో స్వాధీనం!

శతాబ్దాల చరిత్ర కలిగిన పటమటలోని నల్లూరి వారి ధర్మతోట భూముల వ్యవహారం రచ్చకెక్కింది. నల్లూరి వారి ధర్మతోట భూముల్లో ఉన్న వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఇప్పటికే దేవదాయ శాఖ పరిధిలోకి రాగా, దీనికి అనుబంధంగా ఉన్న నల్లూరి వారి కళ్యాణ మండపం కూడా దేవదాయ శాఖకే చెందుతుందని తాజాగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో నల్లూరి వారి కళ్యాణ మండపాన్ని స్వాధీనం చేసుకునేందుకు దేవదాయశాఖ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

కోర్టు తీర్పు నేపథ్యంలో నల్లూరి వారి కళ్యాణ మండపాన్ని వారం రోజుల్లో స్వాధీనం చేసుకునేందుకు దేవదాయశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కళ్యాణ మండపాన్ని నిర్వహిస్తున్న ఫౌండర్‌ ట్రస్టీకి దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చి, కళ్యాణ మండపాన్ని స్వాధీనం చేసుకునేందుకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయనున్నారు. ఫౌండర్‌ ట్రస్టీ వర్గాలు సహకరించని పక్షంలో రెవెన్యూ, పోలీసు అధికారుల సహకారంతో కళ్యాణ మండపాన్ని స్వాధీనం చేసుకునేందుకు దేవదాయశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇటీవలే హైకోర్టు తీర్పుననుసరించి దరిమిలా తీసుకోవాల్సిన అంశాలకు సంబంధించి ఎన్టీఆర్‌ జిల్లా దేవదాయశాఖ అధికారికి సవివర నివేదికను అందించారు. దేవదాయ శాఖ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు కళ్యాణ మండపం స్వాధీనానికి చర్యలు చేపడుతున్నారు.

వీడ ని మిస్టరీ

నల్లూరి వారి ధర్మతోట భూముల వ్యవహారంపై మిస్టరీ వీడటం లేదు. నల్లూరి వంశీకుల పూర్వీకులకు ఎవరి నుంచి ఈ భూములు సంక్రమించాయి? ఏ ఉద్దేశ్యంతో ఈ భూములు ఇచ్చారు? ఈ భూములను ఎలాంటి కార్యకలాపాలకు వినియోగించాలి! ఈ భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని దేని కోసం ఖర్చు చేయాలి? వందేళ్ల చరిత్ర ఉండటంతో కాలక్రమంలో ఫౌండర్‌ ట్రస్టీలుగా వ్యవహరిస్తున్న వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? వాటి పర్యవసానాలు ఏమిటి? నల్లూరి వారి ధర్మతోట భూములు దేవదాయ శాఖ పరిధిలోకి ఎప్పుడు వచ్చాయి ? వంటివి మిస్టరీగా ఉన్నాయి. ఈ వ్యవహారాలను అటు ఫౌండర్‌ ట్రస్టీ వారసులు కానీ, ఇటు దేవదాయ శాఖ అధికారులు మాత్రమే చెప్పగలరు. గతంలో ఏం జరిగిందన్న దానిపై కూడా అటు ట్రస్టీ నిర్వాహకులకు కానీ, ఇటు దేవదాయ శాఖ అధికారులకు కానీ పూర్తి సమాచారం లేదని తెలుస్తోంది.

భూములన్నీ దేవదాయ శాఖవేనా?

నల్లూరి ధర్మతోట భూములన్నీ కూడా దేవదాయశాఖవేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సర్వే నంబర్‌ 62/1లో వెంకటేశ్వరస్వామి దేవస్థానం, కళ్యాణ మండపం, ఎన్‌ఎస్‌ఎం హైస్కూల్‌ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకే సర్వే నంబర్‌లో ఉన్నాయి. ఎక్కడా సబ్‌ డివిజన్‌ జరిగలేదు. ఈ భూములన్నీ కూడా దేవదాయ చట్టం పరిధిలోకి వచ్చినందున అన్నింటిపైనా తమకు హక్కు ఉందని దేవదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ భూములకు దేవదాయ శాఖ మాత్రమే పూర్తి హక్కుదారు అని పేర్కొంటున్నారు. దీనికి తమ దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయని దేవదాయ శాఖ అధికారులు చెబుతున్నారు కానీ వాటిని బయట పెట్టడం లేదు. దీంతో ఈ భూములన్నీ దేవదాయశాఖ పరిధిలోకి వస్తాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- హై కోర్టులో ఎన్‌ఎస్‌ఎం హైస్కూల్‌ వివాదం

నల్లూరి సెయింట్‌ మాథ్యూస్‌ (ఎన్‌ఎస్‌ఎం) స్కూల్‌ వివాదం కూడా హైకోర్టులో నడుస్తోంది. దేవదాయ శాఖ అధికారులు ఇది కూడా తమ దేవదాయ శాఖ స్థలమేనని వాదిస్తున్నారు. అరవై సంవత్సరాల కిందట పేద పిల్లలకు విద్యాదానం చేసేందుకు ఎన్‌ఎస్‌ఎం స్కూల్‌కు నల్లూరి వంశీకుల పూర్వీకులు ఉచితంగా ఇచ్చారని వారి వారసులు చెబుతున్నారు. వారికి దానంగా ఇచ్చిన భూముల్లో స్కూల్‌ ఏర్పాటు చేసిన నిర్వాహకులు సెయింట్‌ మాథ్యూస్‌ స్కూల్‌కు ముందు నల్లూరి అని చేర్చారు. నల్లూరి ట్రస్ట్‌కు సంబంధించిన వారికి ఆ స్కూల్‌లో సీట్ల కేటాయింపు చేసే అధికారం కూడా ఉంటుంది.

దేవదాయ శాఖ కమిషన ర్‌కు అర్చకుని ఫిర్యాదు

నల్లూరి ధర్మ తోట భూమిలో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రధాన అర్చకులు అయిన కే రాజగోపాలచారి తాజాగా దేవదాయశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. నల్లూరి వారి ధర్మతోటలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానం, ఉపాలయాలకు చెందిన భూములు, కళ్యాణ మండపం వంటి వాటిని స్వాధీనం చేసుకోవటంలో తాత్సారం చేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా చర్యలు తీసుకోవటంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని తెలిపారు. దీంతో దేవదాయయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో రంగలోకి దిగారు.

ఉపాలయాలకు భూములు

నల్లూరి వారి ధర్మతోట భూములే కాకుండా దీనికి సంబంధించిన ఉపాలయాలకు కూడా భూములు ఉన్నాయని తెలుస్తోంది. వేంకటేశ్వరస్వామి ప్రధాన ఆలయానికి ఉపాలయంగా ఉన్న ఆంజనేయస్వామి గుడి ఎన్‌ఎస్‌ఎం రోడ్డుకు ఆవల ఉంటుంది. ఆంజనేయస్వామి ఆలయానికి 4.96 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి ఎన్‌ఎస్‌ఎం హైస్కూల్‌ వెనుక భాగంలో ఉంది. ఈ భూమి మాత్రం దేవదాయ శాఖ అధీనంలో ఉంది.

Updated Date - Apr 04 , 2025 | 01:22 AM