Share News

Vontimitta Accident: అతి వేగం ఖరీదు మూడు ప్రాణాలు

ABN , Publish Date - Apr 15 , 2025 | 05:26 AM

ఒంటిమిట్ట సమీపంలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అతి వేగంతో జరిగిన ఈ ప్రమాదంలో మరొకరి పరిస్థితి విషమంగా ఉంది

Vontimitta Accident: అతి వేగం ఖరీదు మూడు ప్రాణాలు

  • ఒంటిమిట్ట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

  • ఎలక్ట్రిక్‌ బస్సు, రక్షక్‌ వాహనాన్ని ఢీకొన్న స్కార్పియో

  • మృతులు నంద్యాల జిల్లా వాసులు, ఒకరి పరిస్థితి విషమం

ఒంటిమిట్ట/నంద్యాల, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): కడప-చెన్నై ప్రధాన రహదారిలోని ఒంటిమిట్ట సమీపంలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా బస్సు, స్కార్పియో ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసుల కథనం మేరకు.. నంద్యాల జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన ఐటీఐ విద్యార్థి తేజనాయుడు(21), సునీల్‌నాయుడు (మహానంది కోర్టు కానిస్టేబుల్‌) సమీప బంధువులు. వీరి చిన్నాన్న హరినాయుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సునీల్‌నాయుడు తన స్నేహితులైన చాగలమర్రి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బత్తూరు ధర్మారెడ్డి (27), బండి ఆత్మకూరు మండలం సోమరాజులపల్లి గ్రామానికి చెందిన వినోద్‌ (29)తో కలిసి హరినాయుడును ఈ నెల 13న కారులో తిరుపతి తీసుకువచ్చి ఆసుపత్రిలో చేర్పించాడు. తిరుగు ప్రయాణంలో వారి వాహనం కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద ఎదురుగా వస్తున్న ఎలక్ట్రిక్‌ బస్సును, పోలీసు పెట్రోలింగ్‌ వాహనాన్ని ఢీకొట్టింది.


ఈ ప్రమాదంలో ధర్మారెడ్డి, వినోద్‌, తేజనాయుడు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడ్డ సునీల్‌నాయుడును కడప రిమ్స్‌కు తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలిసింది. సమాచారం అందుకున్న సీఐ బాబు, ఎస్‌ఐ శివప్రసాద్‌ ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కడప రిమ్స్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో అదుపు తప్పిన రక్షక్‌ వాహనం రహదారి పక్కనున్న చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో కానిస్టేబుల్‌ రఘునాఽథరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ఒంటిమిట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 15 , 2025 | 05:26 AM