Share News

American Tornado Tragedy: అమెరికాలో టోర్నడోల బీభత్సం అన్నదమ్ముల దుర్మరణం

ABN , Publish Date - Mar 18 , 2025 | 03:34 AM

అమెరికాలో టోర్నడో(సుడిగాలి తుఫాను)లు బీభత్సం సృష్టించాయి. తీవ్రమైన టోర్నడోల ధాటికి తెనాలి, అమెరికాకు చెందిన దంపతుల ఇద్దరు కుమారులూ దుర్మరణం చెందారు.

American Tornado Tragedy: అమెరికాలో టోర్నడోల బీభత్సం అన్నదమ్ముల దుర్మరణం

వారి తల్లిది తెనాలి, తండ్రి అమెరికన్‌

తెనాలి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): అమెరికాలో టోర్నడో(సుడిగాలి తుఫాను)లు బీభత్సం సృష్టించాయి. తీవ్రమైన టోర్నడోల ధాటికి తెనాలి, అమెరికాకు చెందిన దంపతుల ఇద్దరు కుమారులూ దుర్మరణం చెందారు. దీంతో తెనాలిలోనూ వారి కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దివంగత గడ్డం థామస్‌ కుమార్తె షారోన్‌కు, అమెరికాకు చెందిన నథానియేల్‌ లివిస్కాకు గతంలో తెనాలిలోనే వివాహం జరిగింది. వారు అమెరికాలోని మిస్సిస్సీపీ రాష్ట్రంలో స్థిరపడ్డారు. వీరికి ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. కుమారులు సాధు(15), జౌషా అష్‌విల్లీ(16) ఆదివారం రాత్రి ఇంటిలో నిద్రిస్తుండగా, తెల్లవారు జామున టోర్నడో ధాటికి పెద్ద చెట్టు విరిగి ఇంటిపై పడడంతో వారు అక్కడిక్కడే మరణించారు. మరో గదిలో నిద్రిస్తున్న తమ కుమార్తె షారోన్‌, అల్లుడు, మనుమరాలు మాత్రం క్షేమంగా ఉన్నారని షారోన్‌ తల్లి మేరీగ్రేస్‌ థామస్‌, సోదరుడు జూనియర్‌ థామస్‌ విలేకరులకు తెలిపారు.


ఇద్దరు మనవళ్లూ నిద్రలోనే మరణించటంపై వారు జీర్ణించుకోలేకపోతున్నారు. విషయం తెలియడంతో పుట్టెడు దుఃఖంతో మేరీగ్రేస్‌, జూనియర్‌ థామస్‌ సోమవారం అమెరికా బయలుదేరి వెళ్లారు. షారోన్‌ తండ్రి గడ్డం థామస్‌ తన చివరి రోజుల వరకు తెలుగుదేశం పార్టీ నాయకుడిగానే ఉన్నారు. బాధిత కుటుంబానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Updated Date - Mar 18 , 2025 | 03:38 AM