Justice System: న్యాయ వ్యవస్థలోజవాబుదారీతనం పెంచాలి
ABN , Publish Date - Apr 13 , 2025 | 04:33 AM
అఖిల భారతీయ అధివక్త పరిషత్ జాతీయ కార్యవర్గ సమావేశాలలో న్యాయవ్యవస్థను మరింత పరిపుష్ఠం చేయాలని, జవాబుదారీతనం పెంచాల్సిన అవసరంపై వక్తలు చర్చించారు. దేశవ్యాప్తంగా 175 మంది న్యాయవాదులు సమావేశంలో పాల్గొన్నారు

ఏబీఏపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో వక్తల పిలుపు
అమరావతి, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): న్యాయవ్యవస్థను మరింత పరిపుష్ఠం చేయాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. అఖిల భారతీయ అధివక్త పరిషత్(ఏబీఏపీ) జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం ఘనంగా ప్రారంభయ్యాయి. గుంటూరు జిల్లా, చిన్నకాకానిలో నిర్వహించిన సమావేశాలకు అండమాన్ నికోబార్‌తో సహా దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 175 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అదేవిధంగా రాష్ట్రానికి చెందిన పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. సమావేశాలను ప్రారంభించిన ఏబీఏపీ జాతీయ అధ్యక్షుడు కేఎస్ మూర్తి మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థను మరింత పరిపుష్ఠం చేయడంతోపాటు జవాబు దారీతనం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ న్యాయవాది పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పసల పొన్నారావు మాట్లాడుతూ.. వృత్తిపరమైన నిబద్ధతను ప్రతి ఒక్కరూ ఆకళింపు చేసుకోవాలని సూచించారు. అనంతరం, ఏబీఏపీ కేంద్ర కార్యాలయం కార్యదర్శి సంతోశ్ కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి, సుప్రీంకోర్టు న్యాయవాది దివ్వెల భరత్‌కుమార్ పలు అంశాలపై మాట్లాడారు. ఏపీ హైకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ ధనంజయ తదితరులు పాల్గొన్నారు.