Land Disputes: వంశీకి భూకబ్జాలు హాబీ
ABN , Publish Date - Apr 04 , 2025 | 06:25 AM
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై భూముల కబ్జా చేయడంపై కేసు నమోదైంది. ఆయన కార్యాలయంలో నకిలీ పట్టాలు ముద్రించేందుకు ప్రత్యేక ప్రెస్ ఏర్పాటు చేసుకున్నారని న్యాయవాది పేర్కొన్నారు

కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు
ఆయన ముందస్తు బెయిల్‌కు అనర్హుడు
భూకబ్జా కేసులో న్యాయవాది బెనర్జీ వాదనలు
తదుపరి విచారణ 8కి వాయిదా
బెయిల్ కోసం హైకోర్టులో వంశీ పిటిషన్
విజయవాడ/ గన్నవరం/ అమరావతి, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): ‘‘మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి భూములు కబ్జా చేయడం ఒక హాబీ. ఆయన కొండలు కొల్లగొట్టాడు. కాల్వగట్లను గుల్ల చేశాడు. చివరికి పేదలకు నకిలీ పట్టాలు పంపిణీ చేశాడు. దీనికోసం తన కార్యాలయంలో ఒక ప్రెస్‌ను నడిపాడు’’ అని సీనియర్ న్యాయవాది కిలారు బెనర్జీ కోర్టుకు వివరించారు. గన్నవరంలోని గాంధీబొమ్మ సెంటర్‌లో సుంకర సీతామహాలక్ష్మికి చెందిన ఆస్తిని వంశీ అనుచరులు బెదిరించి వేరొకరికి రిజిస్ట్రేషన్ చేయించారంటూ చేసిన ఫిర్యాదుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ1గా ఉన్న వంశీ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషనపై విజయవాడలోని 12 అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టులో గురువారం వాదనలు జరిగాయి. సీతామహాలక్ష్మి తరఫున బెనర్జీ వాదనలు వినిపించారు. వంశీ దాఖలు చేస్తున్న పిటిషన్ల తీరు న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించేలా ఉందన్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్న విషయాన్ని గోప్యంగా ఉంచి ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారన్నారు. వంశీ బయట ఉన్నట్టు, ఆయన్ను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు పిటిషన్‌లో పేర్కొన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ముందస్తు బెయిల్‌కు అనర్హుడు అని చెప్పారు. వంశీ చరిత్ర మొత్తం నేరమయమన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక భూకబ్జాలు చేశారన్నారు. 1,200 నకిలీ పట్టాలు ముద్రించడానికి ఆయన కార్యాలయంలో ప్రత్యేకంగా ప్రెస్‌ను ఏర్పాటు చేసుకున్నట్టు కొంతమంది బాధితులు నూజివీడు కోర్టులో సాక్ష్యం చెప్పారన్నారు. సూరపునేని అనిల్‌కుమార్ అనే వ్యక్తి వంశీకి ప్రధాన అనుచరుడిగా ఉన్నాడన్నారు. సీతామహాలక్ష్మిని బెదిరించి ఆస్తిని అతడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారన్నారు. తర్వాత దాన్ని చట్టబద్ధం చేయడానికి మరో ఇద్దరి పేరు మీద రిజిస్ట్రేషన్లు చేయించారన్నారు. సీతామహాలక్ష్మి భర్త హైకోర్టు న్యాయవాదిగా ఉన్నారని, న్యాయవాది ఆస్తికే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల ఆస్తులకు ఎక్కడ రక్షణ ఉంటుందని ప్రశ్నించారు. ఇక వంశీ తరఫున న్యాయవాది వి.దేవీసత్యశ్రీ వాదనలు వినిపించారు. తదుపరి విచారణను న్యాయాధికారి పి.భాస్కరావు 8కి వాయిదా వేశారు.
వంశీ బెయిల్ పిటిషన్‌పై గన్నవరం కోర్టు తీర్పు నేడు
తేలప్రోలుకు చెందిన శనగల శ్రీధర్‌రెడ్డి భూమిని మరొకరికి విక్రయించారంటూ ఆత్కూరు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో బెయిల్ కోసం వంశీ గన్నవరం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై వంశీ తరఫు న్యాయవాది సత్యశ్రీ, ప్రాసిక్యూషన్ తరఫున డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కళ్యాణి కోర్టులో వాదనలు వినిపించారు. ఇరువురు వాదనలు విన్న న్యాయాధికారి... తీర్పును శుక్రవారానికి రిజర్వు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బెయిల్ కోసం హైకోర్టులో వంశీ పిటిషన్
వంశీ బెయిల్ పిటిషన్ గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు ఉత్తర్వులు ఇచ్చారు.